మోపిదేవి వచ్చిన హీరో బాబీ సింహా
స్వాగతం పలికిన మండలి వెంకట్రామ్
కుటుంబ సమేతంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు
మోపిదేవి మండలం కోసూరువారిపాలెం గ్రామానికి చెందిన తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమల్లో హీరోగా, విలనుగా విజయవంతంగా రాణిస్తున్న వాల్తేరు వీరయ్య ఫేమ్ నటుడు బాబీ సింహా ఆదివారం సుప్రసిద్ధ మోపిదేవి శ్రీవల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
ఆయనకు నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్, స్వాగతం పలికారు. చిన్ననాటి స్నేహితుడు విస్సంశెట్టి కృష్ణమూర్తి నాయుడుతో పాటు, తమ కుటుంబ సమేతంగా దేవస్థానానికి విచ్చేసిన బాబీ సింహా తమ ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు.

ఈ సందర్భంగా వారిని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు, దేవస్థానం సూపరింటెండెంట్ అచ్యుత మధు, ముఖ్య అర్చక బుద్ధు సతీష్ వేద పండితులు సత్కరించి స్వామివారి ప్రసాదం, చిత్రపటం బహుకరించారు.
ఈ సందర్భంగా బాబీసింహాను మండలి వెంకట్రామ్, జిల్లా కర్రసాము అసోసియేషన్ అధ్యక్షులు సింహాద్రి పవన్, నున్న వెంకట సుబ్బారావు, చిలక శ్రీను, గుర్విందపల్లి అనీల్, కోసూరు నవీన్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మస్తాన్, ప్రియదర్శిని విద్యాలయం కరస్పాండెంట్ నర్రా రాంబాబు, మెరకనపల్లి నరేష్, దివి శ్రీను, కమ్మిలి సాయి భార్గవ తదితరులు పాల్గొన్నారు.




