మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మించిన `ఖైదీనంబర్ 150` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. బాస్ ఈజ్ బ్యాక్ అన్న చందంగా మెగాస్టార్ మునుపటి ఛరిష్మాతో అదరగొట్టేశారు. డ్యాన్సులు, ఫైట్స్, నటనలో తెరపై గ్రేస్ చూపించి ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నారు. ఇదే హుషారులో మెగాస్టార్ చిరంజీవి నటించే 151వ సినిమాకి సంబంధించిన కథా చర్చలు అంతే స్పీడ్‌గా సాగుతున్నాయని తెలుస్తోంది.
మెగాస్టార్ 151వ సినిమాని `ధృవ` ఫేం సురేందర్‌రెడ్డి డైరెక్ట్ చేస్తారని వార్తలు వెలువడ్డాయి. డైరెక్టర్ ఓకే అయినా, ఏ కథతో సెట్స్‌కెళతారు? అన్నదానిపై కాస్త తర్జనభర్జన పడుతున్నారని తెలుస్తోంది. స్వాతంత్ర సమరయోధుడు `ఉయ్యాలవాడ నరసింహారెడ్డి` జీవితకథను పరుచూరి సోదరులు రెడీ చేశారు. సురేందర్‌రెడ్డి వేరొక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని రెడీ చేశారు. అయితే పరుచూరి వారి కథపై మెగాస్టార్ ఆసక్తి కనబరుస్తున్నారని, ఒకవేళ ఇది ఓకే అయితే ఈ కథతోనే సురేందర్‌రెడ్డి డైరెక్ట్ చేస్తారని చెప్పుకుంటున్నారు. 151 సినిమాని మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మించనున్నారు.


