టాలీవుడ్ సినిమా పరిశ్రమకు తొలితరం హీరోలు ఎన్టీఆర్, ఎఎన్నార్ నుండి నేటి తరం హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వరకు దాదాపుగా అందరూ హీరోలతో నటించి, తన అత్యద్భుతమైన ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్న నటులు, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు. నేడు అయన తన 84వ ఏట అడుగుపెడుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో అయన వేయని పాత్ర లేదు అనే చెప్పాలి. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా, అన్నగా, బాధ్యత గల తండ్రిగా, ఇలా చెప్పుకుంటూపోతే సత్యనారాయణ గారు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
1935వ సంవత్సరంలో కృష్ణా జిల్లా కవుతరం గ్రామంలో జన్మించిన సత్యరనారాయణ గారు, ప్రాధమిక విద్యను గుడ్లవల్లేరులో, ఇక తన ఇంటర్మీడియట్ విద్యాబ్యాసాన్ని విజయవాడలోనూ, అలానే డిగ్రీని గుడివాడ కాలేజీలోనూ పూర్తి చేయడం జరిగింది. అప్పట్లో నాటకాల మీద వ్యామోహంతో మద్రాసు చేరిన సత్యనారాయణ గారికి తోలి చిత్రంగా ‘సిపాయి కూతురు’లో నటించే అవకాశం దక్కింది. ఆ తరువాత రాజమకుటం, సహస్ర శిరచ్చేధ అపూర్వ చింతామణి చిత్రాల ద్వారా మంచి పేరు సంపాదించారు సత్యరాయణ. ఇక అక్కడినుండి ఆయనకు మెల్లగా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. అలానే అప్పట్లో నటరత్న ఎన్టీఆర్ గారికి కొన్ని సినిమాల్లో డూప్ గా కూడా సత్యరనారాయణ గారు నటించడం జరిగింది. కెరీర్ పరంగా ఇప్పటివరకు కొన్ని వందల సినిమాల్లో నటించిన సత్యనారాయణ గారు,
1996లో టిడిపి తరపున మచిలీపట్నం నియోజకవర్గ ఎంపీగా గెలుపొంది ప్రజలకు సేవలందించారు. ఇక ఇప్పటికీ అక్కడక్కడా చిన్న పాత్రల్లో నటిస్తున్న సత్యనారాయణ గారు, ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన మహర్షి సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించి మెప్పించారు. ఇకపోతే నేడు అయన 84వ జన్మదినాన్ని పురస్కరించుకుని, వారు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ పలువురు సినిమా ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు……!!


