కబీర్ సింగ్ సినిమా బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ జాతకాన్ని పూర్తిగా మార్చేసింది. ఎన్ని సినిమాలు చేసినా దక్కని ఘన విజయాన్ని అందించింది. తెలుగులో సంచలన విజయం సాధించిన తన ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు రీమేక్గా ఈ చిత్రాన్ని సందీప్ వంగ రూపొందించిన సంగతి తెలిసిందే. జూన్ 21న విడుదలైన ‘కబీర్ సింగ్’ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఇప్పటికే 250 కోట్ల క్లబ్లో చేరిపోయి 300 కోట్ల దిశగా దూసుకెళ్తుంది. ఈ విజయంతో షాహిద్ కపూర్ తన పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేశాడని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. షాహిద్ తన తదుపరి సినిమాల కోసం ఏకంగా 35 కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి. ఈ వార్త నిజమే అయితే బాలీవుడ్లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటుల సరసన నిలువనున్నాడు. గత సంవత్సరం విడుదలైన పద్మావత్ చిత్రానికి షాహిద్ కపూర్ దీపికా పదుకొనె కంటే తక్కువ పారితోషకం తీసుకున్నాడు.
కబీర్ సింగ్ విజయం వెనకాల సందీప్ రెడ్డి వంగ కృషి ఎంతగానో ఉంది. అర్జున్ రెడ్డి అనూహ్య విజయం తరువాత హీరో విజయ్ దేవరకొండ ఎలా అయితే క్రేజీ స్టార్ అయ్యారో, ఇప్పుడు కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో షాహిద్ కి స్టార్ డమ్ వచ్చింది.


