“తకిట తధిమి తందాన” మూవీ రివ్యూ
చిత్రం: తకిట తదిమి తందాన
విడుదల తేదీ: 28 ఫిబ్రవరి 2025
తారాగణం: ఘన ఆదిత్య, ప్రియ కొమ్మినేని
సంగీతం: నరేన్
సినిమాటోగ్రఫీ: పి.ఎన్.అర్జున్
నిర్మాత: చందన్ కొప్పుల
దర్శకత్వం : రాజ్ లోహిత్
“మర్డర్” ఫేమ్ ఘన ఆదిత్య – అచ్చ తెలుగమ్మాయి “ప్రియ కొమ్మినేని” జంటగా.. రాజ్ లోహిత్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. తాను నిర్మాతగా అరంగేట్రం చేస్తూ… “ఎల్లో మ్యాంగో ఎంటర్‌టైన్‌మెంట్” పతాకంపై.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ టర్నెడ్ ప్రొడ్యూసర్ “చందన్ కుమార్ కొప్పుల” నుంచి వచ్చిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న సినెటేరియా మీడియా వర్క్స్ ద్వారా విడుదలైంది. గంగవ్వ, సతీష్ సారిపల్లి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
కథ:
ఆదిత్య (ఘన ఆదిత్య) ఫేక్ ఎక్స్ పీరియన్స్ తో పెద్ద ఉద్యోగం సంపాదించి వచ్చే జీతానికి మించిన ఖర్చులతో జల్సాలు చేస్తుంటాడు. అలా లోన్ యాప్ ల నుండి లోన్ ను తీసుకుని… ఓవర్ కాన్ఫిడెన్స్ ఫాల్స్ ప్రెస్టేజ్ తో లేనిపోని కష్టాలు కొని తెచ్చుకునే కుర్రాడి కథ “తకిట తధిమి తందాన”. ఆలోచింపజేస్తూనే వినోదాన్ని పంచే ట్రెండీ ఎంటర్టైనర్. భ్రమలో, కలల్లో విహరించే కుర్రాళ్లకు కొంతలో కొంత కనువిప్పు కలిగేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు యువ దర్శకుడు రాజ్ లోహిత్.ఆదిత్య పెళ్లి చేసుకొని సెటిల్ అవుదామనుకునే టైమ్ కి ఉద్యోగం ఊడిపోతుంది, దాంతో ఉన్న క్రెడిట్ కార్డులన్నీ గీకి మరీ పెళ్లి చేసుకుంటాడు. చాన్నాళ్ళపాటు ఉద్యోగం రాక ఫ్రెండ్స్ రూమ్ లో కూర్చుని ఉద్యోగం కోసం వేట కొనసాగిస్తుంటాడు. ఈ క్రమంలో కంగారులో తీసుకున్న లోన్ యాప్ నుండి బెదిరింపు కాల్స్ కూడా మొదలవుతాయి. ఏం చేయాలో తోచని స్థితిలో ఆదిత్య ఏం చేశాడు? అతడు తన జీవితాన్ని మార్చుకోవడానికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనేది “తకిట తదిమి తందానా” కథాంశం.
నటీనటుల పనితీరు:
రామ్ గోపాల్ వర్మ “మర్డర్”తోపాటు… “సమ్మేళనం” అనే వెబ్ సిరీస్ లో నటించిన గణాదిత్య నేటి యువతరానికి ప్రతినిధిలా తన పాత్రలో ఒదిగిపోయాడు. తనను తాను ఇంకొంచెం సానబెట్టుకుంటే ఈ కుర్రాడికి హీరోగా మంచి భవిష్యత్ ఉంటుంది. హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి “ప్రియ కొమ్మినేని”కి కూడా. పరభాషా హీరోయిన్లను చూసి చూసి విసిగిపోతున్న ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. హావభావాలపై మరి కాస్త దృష్టి పెడితే, ఈ అచ్చ తెలుగమ్మాయికి కూడా ప్రేక్షకులు కచ్చితంగా పట్టం కడతారు. గంగవ్వ కనిపించేది కాసేపే అయినా… కథకు/సినిమాకు చాలా హెల్పయ్యే పాత్ర. హీరోయిన్ తండ్రి పాత్రధారి సతీష్ సారిపల్లి కూడా మంచి మార్కులే స్కోర్ చేస్తాడు. స్వతహా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన నిర్మాత చందన్.. ఇందులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ గా కనిపిస్తారు. “నిర్మాణంతోపాటు… నటనపై కూడా ఫోకస్ పెట్టొచ్చు” అనేంతగా… తన నటన చాలా నేచురల్ గా ఉంది.
సాంకేతిక నిపుణుల పనితీరు:
ఇక దర్శకత్వం విషయానికి వస్తే… స్వయంగా కథ – సంభాషణలు సమకూర్చుకున్న రాజ్ లోహిత్… రచయితగా మంచి మార్కులు స్కోర్ చేసినా… దర్శకుడిగా కొంచెం తడబడ్డాడనిపిస్తుంది. నేరేషన్ లో స్పీడ్ పెంచి, ఆడియో క్వాలిటీపరంగా కేర్ తీసుకుని… “మేడ్ ఫర్ ఈచ్ అదర్” అనిపించేలా ఉన్న హీరో-హీరోయిన్ మధ్య ఇంకొంచెం కెమిస్ట్రీ, ఎమోషన్స్ వర్కవుట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ చిత్రం మరింత బాగుండేది. అయితే చిన్న చిత్రాలకుండే బడ్జెట్ పరిమితులు, ప్రాక్టికల్ డిఫికల్టీస్ గురించి కూడా ఆలోచించినప్పుడు.. దర్శకుడిగానూ అతన్ని మెచ్చుకోవచ్చు. ముఖ్యగా… హీరో ఏ ఫాల్స్ ప్రెస్టేజ్ తో అప్పులు పాలయ్యాడో… ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ ని పక్కన పెట్టి, వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే, తాత్కాలిక ఉపశమనం కోసం “స్విగ్గి బాయ్” అవతారం ఎత్తడం వంటి సీన్స్ దర్శకుడి ప్రతిభకు అద్దం పడతాయి. హరిశంకర్ ఎడిటింగ్ ఈ చిత్రానికి ఎస్సెట్. నరేన్ రెడ్డి సంగీతం గురించి పెద్దగా వంకలు పెట్టడానికి ఏమీ లేకపోయినా… ఇంకొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేదనిపిస్తుంది. నరేన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. టైటిల్ ట్రాక్, లవ్ సాంగ్ సాహిత్య పరంగానూ బాగుంది. అయితే.. నేపథ్య సంగీతంతో మాత్రం అలరించలేకపోయాడు. నరేన్ సమకూర్చిన పాటలు బాగున్నాయి. టైటిల్ ట్రాక్, లవ్ సాంగ్ సాహిత్య పరంగానూ బాగుంది. అయితే.. నేపథ్య సంగీతంతో మాత్రం అలరించలేకపోయాడు. అర్జున్ సినిమాటోగ్రఫీ వర్క్ పర్వాలేదు అంతే.
విశ్లేషణ:
“తకిట తదిమి తందానా” చిత్రకథ పాయింట్ గా మంచిదే, కానీ ఆ పాయింట్ ను ఎలివేట్ చేసే స్థాయి డ్రామా సరిపోలేదు. ఆదిత్య క్యారెక్టర్ ఆర్క్ ను ఎక్స్ ప్లోర్ చేసినట్లుగా, హీరోయిన్ క్యారెక్టర్ ఆర్క్ ను వినియోగించుకోలేదు. అలాగే.. అప్పుల ఊబి నుంచి బయటపడడానికి భార్యభర్తలు కలిసి ఏం చేశారు అనేది కూడా సరిగా చూపించలేదు. ఈ అంశాలన్నీ సినిమాలో చూపించి ఉండుంటే.. మరింత సంతృప్తి గా ఉండేది.
ఇక ఈ చిత్రంతో నిర్మాతగానూ, నటుడిగానూ మారిన చందన్ కుమార్ కొప్పుల, తన తొలి ప్రయత్నంలొనే… ఓ ప్రతిభావంతుడ్ని దర్శకుడిగా, ఓ తెలుగమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చెయ్యడం కచ్చితంగా అభినందనీయం. వినోదంతోపాటు చిన్న సందేశాన్ని జోడించి.. ఒక క్లీన్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చిన చందన్ నుంచి కచ్చితంగా మరిన్ని మంచి చిత్రాలు ఆశించవచ్చు. యూత్ ఫుల్ చిత్రం అనగానే.. అనవసరమైన అసభ్యతను చొప్పించే నేటి కాలంలో… హీరోహీరోయిన్ల నడుమ వచ్చే రొమాంటిక్ సీన్స్.. శృతి మించకుండా, పొయిటిక్ గా తెరకెక్కించడం యూత్ కూడా ఇష్టపడేలా ఉన్నాయి.
రేటింగ్: 2.75/5
చివరిగా: ఆలోచింపజేస్తూనే ఆనందింపజేసే క్లీన్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్