‘ పుష్ప 2 ‘ మూవీ రివ్యూ

0
1624

చిత్రం: పుష్ప 2 : ద రూల్

విడుదల తేదీ : డిసెంబర్ 05, 2024

నటీనటులు : అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు

ఎడిటర్ : నవీన్ నూలి

సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ : మిరోస్లా క్యూబా బ్రోజెక్

నిర్మాతలు : నవీన్ ఏర్నేని, వై రవిశంకర్

దర్శకుడు : సుకుమార్

కథ:

ఎర్రచందనం దుంగలు కొట్టే కూలీగా ప్రారంభమైన పుష్పరాజ్ (అల్లు అర్జున్)సిండికేట్ లీడర్ స్థాయికి ఎదుగుతాడు. ఎంపీ సిద్ధప్ప (రావు రమేష్) అండతో నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో బిజినెస్ చేసే స్థాయికి వెళ్తాడు. ఓసారి సీఎం ఊరికి వచ్చాడని కలవడానికి వెళుతున్న సమయంలో భార్య శ్రీవల్లి ఆయనతో ఫోటో దిగి ఫ్రేమ్ కట్టించుకుని రమ్మని అడుగుతుంది. అయితే సీఎం ఫోటో ఇవ్వకుండా అవమానించడంతో ఫోటో ఇవ్వడానికి కూడా భయపడే సీఎం మనకెందుకు మనతో ఫోటో దిగే సీఎం కావాలని భావించి ఏకంగా సీఎంను మార్చాలని కంకణం కట్టుకుంటాడు. రాష్ట్ర రాజకీయాల్లోకి సిద్ధప్పని తీసుకొచ్చి సీఎంని చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో సిద్ధప్పను సీఎం చేయగలిగాడా? ప్రతీకర జ్వాలతో రగిలిపోతున్న శకావత్ (ఫహద్ ఫాజిల్) పుష్పను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? బావమరిది చావుతో సైలెంట్ అయిన మంగళం శ్రీను( సునీల్) పుష్ప పతనానికి ఎలా ప్రయత్నాలు చేశాడు? ఇంటి పేరు కోసం పోరాడుతున్న పుష్ప ఇంటిపేరు దక్కించుకోగలిగాడా? ఇందులో ప్రతాపరెడ్డి( జగపతిబాబు) పాత్ర ఏమిటి? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

Allu Arjun Pushpa 2 Review
Allu Arjun Pushpa 2 Review

నటీనటుల పనితీరు:

నటీనటుల విషయానికి వస్తే ఒక్క మాటలో చెప్పాలంటే అల్లు అర్జున్ వన్ మాన్ షో. సినిమాలో ఎన్నో పాత్రలు ఉన్నాయి కానీ ఆ పాత్రలన్నీ అల్లు అర్జున్ కోసమే అన్నట్టుగా డిజైన్ చేశారు. నేషనల్ అవార్డు అందుకున్న యాక్టర్ గురించి మళ్లీ ప్రత్యేకంగా చెప్పాలా? కానీ చెప్పాలి ఎందుకంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ అలాంటిది. డాన్స్, ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ ఇలా ఒక్కటేమిటి అన్ని విషయాలలో ది బెస్ట్ అని మరోసారి నిరూపించుకున్నాడు బన్నీ. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్, జాతర డాన్స్ ఎపిసోడ్ అయితే నభూతో నా భవిష్యతి అన్నట్లుగా రెచ్చిపోయారు. ఇక శ్రీవల్లి పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. ఫహద్ ఫాజిల్ పాత్ర బావుంది కానీ దానికి ముగింపు పలికిన విధానమే ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తుంది. జగపతిబాబు, రావు రమేష్ ,సునీల్,అనసూయ, జగదీష్, తారక్ పొన్నప్ప వంటి వాళ్లు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. తారక్ పొన్నప్పకి కెరియర్లో ప్లస్ అయ్యే పాత్ర దొరికింది.

Allu Arjun Pushpa 2 Review
Allu Arjun Pushpa 2 Review

సాంకేతిక నిపుణుల పనితీరు:

టెక్నికల్ టీం విషయానికి వస్తే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి. ఏదో ఊదరగొట్టే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాకుండా సినిమాను ఎలివేట్ చేసేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉంది. పాటలు వినడానికన్న స్క్రీన్ మీద చూడడానికి ఇంకా బాగున్నాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ. కూబా ఫ్రేమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక మౌనిక దంపతుల ఆర్ట్ వర్క్ ప్రతి ఫ్రేమ్లో కనిపించింది.. కొరియోగ్రాఫర్ల కష్టమేమిటో బన్నీ, రష్మిక మందన, శ్రీ లీల డాన్స్ ద్వారా బహిర్గతమైంది.. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యాక్షన్ కొరియోగ్రాఫర్ల గురించి కూడా. ఫైట్లను చాలా స్టైలిష్ గా చేయడంలో వారు సక్సెస్ అయ్యారు. డైలాగ్స్ చాలావరకు బన్నీ ఫ్యాన్స్ కిక్కిచ్చేలా ఉన్నాయి. మీ బాస్ కి కూడా నేనే బాస్, నేను తగ్గితే చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు, మనం ఒక స్థాయికి వచ్చాక తగ్గిన తప్పులేదు లాంటి డైలాగ్స్ ఫ్యాన్స్ కి భలే కిక్కిస్తాయి.. అలాగే లేడీస్ ఎంజాయ్ చేసేలా పెట్టుకున్న ఎమోషనల్ సీన్స్ ఎమోషనల్ డైలాగ్స్ వారికి బాగా కనెక్ట్ అవుతాయి.

విశ్లేషణ:

పుష్ప రాజ్ తగ్గేదేలే అంటూ ఫస్ట్ పార్ట్ తో అలరించిన బన్నీ ఈసారి పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలే అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా కాదు ఫైర్ అంటూ అప్పట్లో ప్రేక్షకులను అలరిస్తే ఈసారి ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ ఒక్కసారిగా ప్రేక్షకులందరికీ ఎంగేజ్ చేసే కథతో వచ్చాడు. అంటే కథ అద్భుతం అనుకుంటే పొరపాటే చాలా రొటీన్ కథను అద్భుతమైన ఎలివేషన్స్ తో హై మూమెంట్స్ తో ప్రేక్షకులు ఎంగేజ్ చేసేలా రాసుకున్నాడు. సుకుమార్ బన్నీ ఇద్దరి మూడేళ్ల కష్టం.. మూడు గంటల 20 నిమిషాల్లో కనబడుతుంది. దాదాపు మూడున్నర గంటలు వుందన్న పేరేగానీ… ఎక్కడా బోర్‌ కొట్టదు. పుష్ప చేసేది స్మగ్లింగ్‌ అది తప్పని ఆడియన్స్‌కు తెలిసినా… అదేమిటోగానీ.. పుష్ప సక్సెస్‌ అవ్వాలని కోరుకునేలా చేశారంటే హీరో క్యారెక్టర్‌ను ప్రేక్షకులు ఓన్‌ చేసుకునేలా సుకుమార్‌ చేసిన మ్యాజిక్ అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం యాక్షన్‌ మూవీనే అనుకుంటే పొరపాటే ఫ్యామిలీ ఎమోషన్స్‌, రొమాన్స్‌, కామెడీతో గంగమ్మ జాతర లేడీ గెటప్‌లో భక్తి కూడా పెట్టేశాడు దర్శకుడు. ఒక మాటలో చెప్పాలంటే సినిమాని ఒక అత్యద్భుతమైన విందు భోజనంలా రెడీ చేశాడు. పెళ్లాం చెబితే వినాలి. పెళ్లాం అడిగితే కాదనకూడదన్న మెసేజ్‌ తో కథను నడిపించడమే కాదు లేడీ ఆడియన్స్ ని కూడా టార్గెట్ చేశారేమో అనిపిస్తుంది. భార్య ఫోటో కోసం ఏకంగా ముఖ్యమంత్రిని మార్చేయడం అనే లైన్ ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అవుతుందో అంతగా డిస్ కనెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే క్లైమాక్స్ మాత్రం త్వర త్వరగా ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది కానీ సినిమా మాత్రం ఫుల్ పైసా వసూల్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రేటింగ్: 3.5 /5

చివరగా: పుష్ప 2 బాక్సాఫీస్‌ రికార్డుల రప రపతో ఆల్ టైం బ్లాక్ బస్టర్ లోడింగ్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here