‘డిస్కో కింగ్’ ‘డిస్కో డాన్సర్’ మా ఇద్దరికీ చిత్రబంధం ఉంది. – నందమూరి బాలకృష్ణ
విలక్షణ నటుడు, మిత్రుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం హర్షించదగ్గ విషయం! తొలి చిత్రం ‘మృగయా’తోనే నటునిగా తనదైన బాణీ పలికించి, జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలిచారు మిథున్ చక్రవర్తి. ఆరంభంలో వాస్తవ చిత్రాలతో సాగినా, తరువాత బాలీవుడ్ కమర్షియల్ మూవీస్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు మిథున్. ముఖ్యంగా ‘డిస్కో డాన్స్’కు మిథున్ చక్రవర్తి విశేషమైన పేరు సంపాదించి పెట్టారు. మిథున్ చక్రవర్తితో నాకు చిత్రబంధం ఉంది- అదెలాగంటే నేను సోలో హీరోగా బయటి సంస్థల చిత్రాలలో నటించడానికి తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన చిత్రం ‘డిస్కో కింగ్’. ఈ చిత్రానికి మిథున్ చక్రవర్తి హిందీ సినిమా ‘డిస్కో డాన్సర్’ ఆధారం. అలా మా ఇద్దరికీ చిత్రబంధం ఉంది.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యుత్తమమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డుకు ఎంపికై మిథున్ చక్రవర్తికి నా హృదయపూర్వక శుభాభినందనలు. మిథున్ నటునిగా మరెన్నో విలక్షణమైన పాత్రలలో మురిపిస్తూ సాగాలని ఆశిస్తున్నాను…
-నందమూరి బాలకృష్ణ