సుహాస్ “గొర్రె పురాణం” సినిమా సమీక్ష

0
136
Suhas Gorre Puranam Movie Review
Suhas Gorre Puranam Movie Review

గొర్రె పురాణం కథ

రవి(సుహాస్) ఒక వ్యక్తిని మర్డర్ చేయడంతో అతన్ని జైలుకు తరలిస్తారు. మరోపక్క ఒక ముస్లిం వ్యక్తి ఇంట్లో బిర్యానీ అవ్వాల్సిన గొర్రె ఆ గ్రామ దేవత ఆలయంలో దూరడంతో పెద్ద రచ్చకు దారితీస్తుంది. మీడియాకు విషయం చేరడంతో గొర్రె మతకలహాలకు కారణమైంది అంటూ దాన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలిస్తారు. రవి సెల్ లోనే దాన్ని కూడా బంధించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అసలు రవి ఒకరిని ఎందుకు చంపాడు? రవి మర్డర్ కి గొర్రెకి సంబంధం ఏమిటి? జైలులో గొర్రెను చంపడానికి ప్రయత్నించిన వారెవరు? వాళ్లు గొర్రెను చంపడానికి ఎందుకు ప్రయత్నించారు? అసలు రవి భార్యకు, కుమార్తెకు ఏమైంది? చివరికి గొర్రెకు ఎలాంటి శిక్ష విధించారు? ముగ్గురిని చంపాలనుకున్న రవి టార్గెట్ నెరవేరిందా? అనేది తెలియాలి అంటే సినిమాను చూడాల్సిందే.

కళాకారుల ప్రదర్శన

ఈ సినిమాలో సుహాస్ కంటే ఎక్కువసేపు గొర్రె కనిపించింది. గొర్రె నటన గురించి చెప్పలేం కానీ ఆ గొర్రెకు తరుణ్ భాస్కర్ డబ్బింగ్ తో మరింత హాస్య చతురతను జోడించినట్లయింది. సినిమా ఓపెనింగ్ లోనే సుహాస్ ఉన్నా సరే ఆయన పాత్ర చాలా పరిమితం. అయితే ఉన్నంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకునేలా సుహాస్ పాత్ర సాగింది. ఇక పోసాని కృష్ణ మురళి, రఘు కారుమంచి, జెన్నీ వంటి వాళ్ళు తమ తము పాత్రలకు ప్రాణం పోశారు.

సాంకేతిక అంశాలు 

సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని అందంగా తెరమీదకు తీసుకొచ్చింది. పవన్ సిహెచ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి కరెక్ట్ గా సెట్ అయింది. పాటలు కూడా బాగున్నాయి. వంశీకృష్ణ రవి ఎడిటింగ్ కూడా సినిమా ఫ్లోకి తగ్గట్టుగా ఉంది. నిజానికి గొర్రె పురాణం కథ అంటే స్టోరీ లైన్ బాగుంది కానీ పూర్తిస్థాయిలో దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విషయంలో డైరెక్టర్ బాబీ తడబడినట్లు అనిపించింది.

విశ్లేషణ

ఈ సినిమా కథ విషయానికి వస్తే కొత్త కథ అని చెప్పలేం, గతంలో ఎన్నో సినిమాల్లో చూసిన కథే. ఒక జంతువు చుట్టూ అల్లుకున్న ఒక సోషల్ సెటైర్ సినిమా ఇది. సినిమా మొదట్లోనే ఒక హత్యతో మొదలుపెట్టిన డైరెక్టర్ ఆ తర్వాత గొర్రె ఇంట్రడక్షన్ తో కామెడీ ట్రాక్ ఎక్కించే ప్రయత్నం చేశాడు. గొర్రె ఎంట్రీ తర్వాత చాలావరకు ప్రేక్షకుల మీద మీడియా మీద రాజకీయ నాయకుల మీద సెటైర్లు వేసే ప్రయత్నం చేశాడు.. అందుకు ఎంచుకున్న ఎత్తుగడ కూడా ప్రేక్షకులను అలరించేలా ఉండడం కాస్త ఆసక్తి కరం.

ప్రేక్షకులను ఒకపక్క ఎంటర్టైన్ చేస్తూనే మరొకపక్క ప్రశ్నిస్తూ సోషల్ సెటైర్ వేస్తున్నట్టుగా ఈ కథను రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. సినిమా కథతోనే ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించిన డైరెక్టర్ సినిమా నేరేషన్ ని కూడా గొర్రె చేత ఇప్పిస్తూ మరికొంత ఆసక్తి రేకెత్తించే ప్రయత్నం చేశాడు. తమ వ్యక్తిగత అవసరాల కోసం సమాజంలో జరిగే ఇష్యూలను మీడియా, రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటున్నారు అనే విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చూపిస్తూనే మరోపక్క సమాజంలో ఉన్న చాలామంది జనం గొర్రెలు లాగా ఎవరు ఏం చెబితే అది వినడానికి రెడీ అవుతున్నారు అంటూ సుతి మెత్తగా వారిని కూడా విమర్శించినట్లు అనిపించింది. సినిమాలో డైలాగ్స్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకపక్క ఆలోచింప చేస్తూనే మరో పక్కన నవ్విస్తూ ఈ డైలాగ్స్ రాసుకున్నారు. అయితే సినిమానిది గంటా 42 నిమిషాలైనా దానిని కూడా ఎందుకో సాగదీస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. దానికి తోడు జరగబోయే విషయాన్ని ఊహకు అందేలా రాసుకోవడం కూడా సినిమాకు కాస్త ఇబ్బందికర అంశమే. ఫస్ట్ ఆఫ్ కాస్త ఆసక్తికరంగా సాగినట్లు అనిపించినా, సెకండ్ హాఫ్ ఎందుకో భారంగా గడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అయినా కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విషయంలో దర్శకుడు దాదాపు సఫలమైనట్లే.

పంచ్ లైన్

ఈ గొర్రె చెప్పే పురాణం అందరూ వినాలి

రేటింగ్

3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here