చిత్రం: కృష్ణగాడు అంటే ఒక రేంజ్
నటీనటులు: రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ, రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినయ్ మహదేవ్ తదితరులు
నిర్మాణ సంస్థ: శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి
నిర్మాతలు: పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత
దర్శకత్వం: రాజేష్ దొండపాటి
సంగీతం: సాబు వర్గీస్
సినిమాటోగ్రఫీ: ఎస్ కె రఫీ
ఎడిటర్: సాయి బాబు తలారి
విడుదల తేది:ఆగస్ట్ 4, 2023
రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో హీరోయిన్లుగా పెట్లా రఘురామ్ మూర్తి నిర్మించిన చిత్రం ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’. క్రైమ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు నూతన దర్శకుడు రాజేష్ దొండపాటి దర్శకత్వం వహించాడు. కొత్త టీం అంతా కలిసి చేసిన ‘కృష్ణ గాడు అంటే ఒక రేంజ్’ టీజర్, ట్రైలర్‌లతో అందరి దృష్టిలో పడింది. మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఈ శుక్రవారం థియేటర్లోకి వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.
కథ:
కృష్ణ (రిష్వి తిమ్మరాజు) అనే కుర్రాడు చిన్నప్పటి నుంచీ కృష్ణగాడు అంటే ఒక రేంజ్ అనే ట్యాగ్ లైన్‌తో బతికేస్తుంటాడు. కృష్ణ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతాడు. తల్లి పెంపకంలో పెరుగుతాడు. ఎప్పటికైనా తండ్రి ప్రారంభించిన ఇంటిని పూర్తి చేయాలనేది కృష్ణ లక్ష్యం. మరోవైపు అదే ఊర్లో వరుసకు మరదలు అయ్యే సత్య (విస్మయ) కృష్ణని ఇష్టపడుతుంది. కృష్ణకి కూడా సత్య అంటే చాలా ఇష్టం. కానీ సత్య తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిని కృష్ణకి ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడరు. ఇక వీరిద్దరి ప్రేమకు దేవా అనే వ్యక్తి విలన్‌లా మారుతాడు. సత్యను పెళ్లి చేసుకోవాలని దేవా అనుకుంటాడు. సత్య, కృష్ణల ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరిగింది? వారిని విడగొట్టేందుకు దేవా చేసిన పనులు ఏంటి? కృష్ణ, సత్య ఒక్కటయ్యారా? తన తల్లి ప్రాణాలను కాపాడుకోవడానికి బీహార్ గ్యాంగ్‌తో కృష్ణ ఎలాంటి పోరాటం చేయాల్సివచ్చింది? తమ ఊరి చివరి బంగళా మిస్టరీని కృష్ణ ఎలా ఛేదించాడు అన్నదే ఈ సినిమా కథ.
నటీనటుల పనితీరు:
హీరోగా కృష్ణ పాత్రలో రిష్వి తిమ్మిరాజు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఎమోషనల్ సీన్స్, కామెడీ సీన్స్, యాక్షన్ సీన్స్ అని ఇలా అన్నింట్లోనూ ఓకే అనిపిస్తాడు. తెరపై చూడడానికి పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడు. విస్మయ పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. పల్లెటూరికి చెందిన గడుసు అమ్మాయిలా విస్మయ చక్కగా నటించింది. లుక్స్ పరంగా తెరపై కాస్త బొద్దుగా కనిపించినా, అందంగా ఉంది. హీరోహీరోయిన్లు రిష్వి తిమ్మరాజు, విస్మయశ్రీ కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యింది. పల్లెటూరి జంట మధ్య ఉండే సరదాల్ని, సంతోషాల్ని సహజంగా వారి సీన్స్ ద్వారా అందంగా చూపించారు డైరెక్టర్. దేవా తో పాటు హీరో తల్లి పాత్రధారి యాక్టింగ్ కూడా పర్వాలేదనిపిస్తుంది. మిగిలిన పాత్రలు పరిధి మేరకు మెప్పిస్తాయి.
హైలైట్స్:
రిష్వి, విస్మయ ల పెర్ఫార్మెన్స్
ఆకట్టుకునే పల్లెటూరి నేపథ్యం
క్రైమ్ ఎలిమెంట్
డ్రాబ్యాక్స్:
రెగ్యులర్ కథ
అక్కడక్కడ స్లో గా సాగే ఫస్ట్ హాఫ్
సాంకేతిక నిపుణుల పనితీరు:
ఈ చిత్రానికి సాబు వర్గీస్ అందించిన సంగీతం బ్యాక్ బోన్‌లా నిలిచింది. పాటలు కథానుగుణంగా వస్తూ వినసొంపుగా ఉన్నాయి. ఆర్ఆర్ ఓకే అనిపిస్తుంది. రఫీ కెమెరావర్క్ సహజంగా ఉంది. ఎడిటింగ్ ఓకే అనిపిస్తుంది. నిర్మాత పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నంతగా అనిపిస్తాయి.
విశ్లేషణ:
గ్రామీణ వాతావరణం, ప్రేమ కథలు, ఊర్లోని రకరకాల మనుషులు, ఆ జనంలోనే కామెడీ పండించడం, కథను నడిపించడం, ప్రేమ కథను జోడించడం ఇవన్నీ చాలా రోజులుగా చూస్తున్న కథే అయినా దర్శకుడు రాజేష్ సింపుల్ సన్నివేశాలు, సున్నితమైన అంశాలు, భావోద్వేగాలు పండేలా కథ రాసుకున్నాడు. దానికి సరైన క్యాస్టింగ్‌ను చూసుకున్నాడు. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. హీరోహీరోయిన్ల ప్రేమకథతో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగుతుంది. ఊర్లో జరిగే దోపీడి, మల్లయ్య అనే రౌడీతో దేవాకు ఉన్న లింక్ ను లవ్‌స్టోరీకి సమాంతరంగా చూపిస్తూ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు.
ప్రేమ కథలకు లీడ్ పెయిర్ యాక్టింగ్ ప్లస్ అవుతుంది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీకి జనాలు కనెక్ట్ అయితే సినిమా హిట్ అవుతుంది. ఆ విషయంలో దర్శకుడు కొంత వరకు సఫలం అయినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌ను ఆద్యంతం వినోదభరితంగా, ఆహ్లాదభరితంగా తెరకెక్కించాడు. కాస్త స్లోగా, ఊహకందేలా సాగడం మైనస్. ద్వితీయార్థం చాలా ఎమోషనల్‌గా సాగుతూనే వరుస ట్విస్టులు కథపై ఆసక్తిని పెంచుతుంది. దోపిడీ ముఠాను హీరో కనిపెట్టిన తీరు బాగుంటుంది. క్లైమాక్స్‌లో హీరో నుంచి మంచి ఎమోషన్స్‌ని రాబట్టుకున్నాడు దర్శకుడు. ప్రీ క్లైమాక్స్‌లో అసలు ట్విస్ట్ రివీల్ అవ్వడం బాగుంటుంది. క్లైమాక్స్ ఊహకు అందేలా సాగుతుంది.
రేటింగ్ : 3/5
చివరగా : ఆహ్లాదంగా సాగిపోయే పల్లెటూరి ప్రేమకథ