‘మసూద’తో బిగ్ హిట్ అందుకున్న యంగ్ హీరో తిరువీర్ ఇప్పుడు రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ‘పరేషాన్’అనే హిలేరియస్ ఎంటర్ టైనర్ తో వస్తున్నారు. వాల్తేరు ప్రొడక్షన్స్ బ్యానర్ పై సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో రానా దగ్గుబాటి సమర్పణలో జూన్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరో తిరువీర్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
మీరు ఇప్పటి వరకు కొన్ని విలక్షణమైన పాత్రలు ఎంపిక చేసుకున్నారు? .. ‘పరేషాన్’ లో హాస్య ప్రధానమైన జోనర్ ఎంచుకోవడానికి కారణం?
నిజానికి ఇంతవరకు నేను ఏదీ ఎంపిక చేసుకోలేదు. వచ్చినవి చేశాను. ఘాజీ, మల్లేశం ,పలాస .. ఇలా నేను ఎలాంటి సినిమాలు చేయాలని అనుకున్నానో అలాంటివే వచ్చాయి. ఇందులో ప్లాన్ చేసింది ఏమీ లేదు. ఐతే ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నాను. మసూద తర్వాత ఒక స్వేచ్ఛ దొరికింది. ‘పరేషాన్’కి రానా గారు వచ్చిన తర్వాత బలం వచ్చింది.
రూపక్ ఈ కథ చెప్పినపుడు మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
రూపక్ ఓ నాలుగు సీన్లకు ఆడిషన్ అడిగాడు. తన రైటింగ్ చాలా కొత్తగా ఫ్రెష్ గా అనిపించింది. మరేం ఆలోచించకుండా ఈ కథ నేను చేస్తానని చెప్పాను. రూపక్ తను చూసిన జీవితం, వూరు, స్నేహం, అక్కడి ప్రజల పాత్రలని తీసుకుని ఒక ఇమాజినరీ వరల్డ్ ని క్రియేట్ చేశాడు. కథ, పాత్రలు, లొకేషన్స్ .. అన్నీ చాలా ఫ్రెష్ గా వుంటాయి.
రానా గారు ఈ సినిమా చూసిన తర్వాత ఏవైనా మార్పులు చెప్పారా ?
రానా గారు ఈ సినిమా చూసిన తర్వాత.. డైరెక్టర్, నిర్మాతతో ‘’నేను మీకు ఏం చేయగలుగుతాను. సినిమాని జనాల్లోకి తీసుకువెళ్ళడానికి ఏం చేద్దాం’’ అని మాత్రమే అన్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఆయన నవ్వుతూనే ఉన్నారు. రానా గారు కేవలం సమర్పణ అని వేసి విడుదల చేయడమే కాదు.. మాతో పాటు ప్రమోషన్స్ కి వస్తున్నారు. ఆయన నటించిన సినిమాలానే ఎంత శ్రద్ధతో పబ్లిసిటీ లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ‘ఈ సినిమాతో నాకు తెలియని ప్రపంచంలో నన్ను తీసుకెళ్ళారు. అది నాకు నచ్చింది. ఎలాగైనా సినిమాని జనాల్లోకి తీసుకెళ్దాం’ అని రానా గారు ముందుకు వచ్చారు.
‘పరేషాన్’ కథ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే
సింగరేణి పోరగాళ్ళ కథ. మంచిర్యాల వూరుని ఒక బయోపిక్ లా తీస్తే అదే ఈ కథ.
‘పరేషాన్’ ఫన్ ఎలా వుంటుంది ?
‘పరేషాన్’ లో చాలా నేచురల్ కామెడీ వుంటుంది. కావాలని చేసే కామెడీలా ఉండదు. అమాయకత్వం నుంచే హాస్యం వుంటుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ డ్రామా.
‘పరేషాన్’ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి ?
ఇందులో ప్రతి పాత్రకు ఏదో పరేషాన్ వుంటుంది. అందుకే ఈ చిత్రానికి ‘పరేషాన్’అని పేరు పెట్టాం.
‘పరేషాన్’ షూటింగ్ ఎలా జరిగింది ?
మంచిర్యాలలో షూట్ చేయడం నాకు మొదటిసారి. కేరళ లా అనిపించింది. మంచిర్యాలలో రెండు నెలలు వున్నాను. అది మా అమ్మమ్మగారి వూరులా అయిపోయింది. వర్షం పడితే గాంధారి ఖిల్లా జలపాతంలా అవుతుంది. చాలా అందమైన ప్రదేశం. స్థానిక ప్రజలు ఎంతో సహకరించారు.
ఈ సినిమా నటీనటుల్లో ఎవరు బాగా లైమ్ లైట్ లోకి వచ్చే అవకాశం వుంది ?
ఏ సినిమా అయినా హిట్ ఐతే ఒక్క డైలాగ్ చెప్పిన వాడు కూడా లైమ్ లైట్ లోకి వస్తారు. అది సినిమా ఫలితంపై వుంది. ‘పరేషాన్’ ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. హిట్ 2లో చేసిన పావని ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే మంచిర్యాల నుంచి చాలా మంది కొత్త నటులను ఆడిషన్స్ చేసి తీసుకున్నారు. ఇందులో చాలా గుర్తుపెట్టుకునే పాత్రలు ఉంటాయని భావిస్తున్నాను.
డైరెక్టర్ రూపక్ తో పని చేయడం ఎలా అనిపించింది ?
రూపక్ చాలా కూల్ గా ఉంటాడు. ఈ కథని చాలా ఫ్రెష్ గా రాసుకున్నాడు. చాలా రూటెడ్ గా ప్లాన్ చేసుకున్నాడు. ఈ సినిమా కోసం ఒక రాక్షసుడిలా పని చేశాడు. 20 నెలలు కేవలం పోస్ట్ ప్రొడక్షన్ కి తీసుకున్నాడు. నేపధ్య సంగీతంలో ఒక జోష్ వుంటుంది. దీని కోసం చాలా సమయం తీసుకున్నాడు. అందుకే ఇంత సమయం పట్టింది.
టీజర్, ట్రైలర్ చూస్తున్నపుడు మొత్తం తెలంగాణ నేపథ్యం కనిపిస్తోంది ? మిగతా రాష్ట్రాలకు ఎలా కనెక్ట్ చేస్తారు ?
మూడు రోజులు కిందట విజయవాడలో షో వేశాం. తర్వాత కరీంనగర్, వరంగల్ లో వేశాం. ఈ రెండు చోట్ల కంటే విజయవాడ షోకు ఎక్కవ రెస్పాన్స్ వచ్చింది. హిలేరియస్ గా ఎంజాయ్ చేస్తున్నారు. దీని వలన బారియర్ పోయిందనే ధైర్యం వచ్చింది.
కొత్త సినిమాల గురించి ?
ఓ నాలుగు సినిమాలు ఒప్పుకున్నాను. థ్రిల్లర్, ఫాంటసీ, సోషల్ డ్రామా ఇలా డిఫరెంట్ జోనర్స్ లో వుంటాయి. శివం సెల్యులాయిడ్ నిర్మాణంలో ఒక సినిమా వుంటుంది. బటర్ ఫ్లై ఫేం సతీష్ గారితో మరో సినిమా వుంటుంది. మరికొన్ని చర్చలో వున్నాయి.
‘పరేషాన్’ మీ కెరీర్ కి ఎంత ప్లస్ అవుతుందని భావిస్తున్నారు ?
ఇప్పటివరకు నేను కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రలే చేశాను. అది బ్రేక్ చేయడానికి చాలా సమయం పట్టింది. మసూద తర్వాత నాలో అమాయకత్వాన్ని కూడా చూశారు. పరేషాన్ లో నా పాత్ర చాలా కోణాల్లో వుంటుంది. కథలు రాసుకునే వారికి నేను ఒక మంచి ఆప్షన్ అవుతాననే నమ్మకం వుంది.
ThiruVeeR @iamThiruveeR 📸📸 Clicks From Media Interaction Ahead Of #Pareshan #PareshanOnJune2nd pic.twitter.com/0IqMfq0YVQ
— BA Raju's Team (@baraju_SuperHit) May 30, 2023