చిత్రం : హసీనా
నటీనటులు : ప్రియాంక డెయ్, థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్
సంగీతం : షారుఖ్ షేక్
బి జీ ఎమ్: నవనీత్ చారీ
సినిమాటోగ్రఫీ: రామ్ కండా
ఎడిటర్ : హరీష్ కృష్ణ
సహ నిర్మాత : ఎస్ రాజశేఖర్ రెడ్డి
నిర్మాత : తన్వీర్ ఎండీ
దర్శకత్వం : నవీన్ ఇరగాని
ట్విస్టులతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నడిచే సినిమాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ సినిమా థియేటర్లోకి వచ్చింది. హసీనా అంటూ ప్రియాంక డెయ్, థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్ ఇలా కొత్త వాళ్లంతా కలిసి సినిమాను చేశారు. ఈ మూవీని తన్వీర్ ఎండీ నిర్మించగా.. ఎస్ రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాకు నవీన్ ఇరగాని దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం నేడు (మే 19) థియేటర్లోకి వచ్చింది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ :
అభి (అభినవ్) అడ్డొచ్చిన వారిని చంపుతూ డ్రగ్స్, అమ్మాయిలను స్మగ్లింగ్ చేస్తుంటాడు. మరో వైపు ఓ ఐదుగురు అనాథలు హసీనా (ప్రియాంక డెయ్), థన్వీర్ (థన్వీర్ ఎండీ), సాయి (సాయి తేజ గంజి), శివ (శివ గంగా), ఆకాష్ (ఆకాష్ లాల్) చిన్నతనం నుంచి ఒకే చోట పెరుగుతారు. ఉద్యోగాలు చేస్తూ కూడా ఒకే చోట కలిసి ఉంటారు. హసీనా అంటే ఆ నలుగురికీ ఇష్టమే. హసీనా పుట్టిన రోజున ఆ విషయాన్ని ఆ నలుగురూ ఆమెకు చెప్పాలని అనుకుంటారు. కానీ అంతలోపే ఓ ఘటన వారి జీవితాలను మార్చేస్తుంది. ఆ ఐదుగురు జీవితాల్లోకి అభి ఎంట్రీ ఇచ్చాడా? అభి జీవితంలోకి ఆ ఐదుగురు ఎంట్రీ ఇచ్చారా? ఎవరి వల్ల ఎవరికి ఏం జరిగింది? ఇందులో పోలీసుల్లా కనిపించిన సీఐ, ఏసీపీల పాత్రలు ఏంటి? చివరకు ఏం జరిగింది? అన్నది కథ.
నటీనటుల పనితీరు :
హసీనా పాత్రలో ప్రియాంక డెయ్ చక్కగా నటించింది. ఎమోషన్స్ పండించడంలో ఫర్వాలేదు అనిపించినా లుక్స్ పరంగా మెప్పిస్తుంది. థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్ ఇలా అందరూ కొత్త వారే అయినా కూడా చక్కగా నటించారు. కామెడీ, ఎమోషన్, యాక్షన్ సీక్వెన్స్‌లో ఇలా అన్నింట్లోనూ నలుగురు కుర్రాళ్లు మెప్పిస్తారు. అభి పాత్రలో అభినవ్ లుక్స్, బాడీ లాంగ్వేజ్ అన్నీ బాగున్నాయి. మిగిలిన పాత్రల్లో గీతా సింగ్ ఓకే అనిపిస్తుంది.
సాంకేతిక నిపుణుల పనితీరు :
డబ్బు మాయలో పడితే ఎవరైనా ఎలాగైనా మారుతారని చూపించాడు దర్శకుడు నవీన్. డబ్బు చివరకు ఎంత పనైనా చేయిస్తుందనే సందేశాన్ని ఇచ్చాడు డైరెక్టర్. ఆద్యంతం థ్రిల్లింగ్ అంశాలతో గ్రిప్పింగ్ గా ఉండేలా దర్శకుడు చేయగలిగాడు. సాంకేతికంగా కూడా హసీనా సినిమా ఆకట్టుకుంటుంది. సినిమాలో పాటలు తక్కువే ఉన్నా షారుఖ్ షేక్ అందించిన పాటలు వినసొంపుగా ఉన్నాయి. నవనీత్ చారీ అందించిన ఆర్ఆర్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. రామ్ కండా సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. ఆర్ట్, ఎడిటింగ్ ఇలా అన్ని విభాగాలు చక్కగా పని చేశాయి. నిర్మాత తన్వీర్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉండేలా ఖర్చు పెట్టారు. క్వాలిటీ ఔట్ పుట్ తీసుకురావడానికి దోహద పడ్డారు.
విశ్లేషణ :
హసీనా సినిమాలో ఎన్నో లేయర్స్ తో కథను ఎంగేజింగ్ గా చెప్పారు దర్శకుడు నవీన్. ప్రేమ, స్నేహం గురించి అంతర్లీనంగా చెప్తూనే కథంతా డబ్బు చుట్టూనే తిరుగుతుంది. ఇందులో భాగంగా సైబర్ క్రైంల గురించి కూడా చర్చించాడు. ఏవో లింకులు వస్తే క్లిక్ చేయడం దాని వల్ల అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ మాయం అవ్వడం, ఫోన్లు హ్యాక్ అవ్వడం వంటి వాటిని కూడా చర్చించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు.
హసీనా సినిమా ప్రథమార్థంలో లవ్ సీన్స్, ఫైటింగ్ సీన్స్, అభి విలనిజంతో సాగుతుంది. సాఫీగా సాగుతుందని అనుకున్న టైంలోనే ఇంటర్వెల్ పడుతుంది. అసలు కథ అంతా కూడా సెకండాఫ్‌లోనే ఉంటుంది. ప్రతీ ఐదు నిమిషాలకు ఓ ట్విస్ట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ట్విస్టుల మీద ట్విస్టులతో ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు.
రేటింగ్: 3.25 / 5
చివరగా: ట్విస్టులతో ఆకట్టుకునే థ్రిల్లర్ హసీనా