ఇటీవలే ‘కళాతపస్వి’ కె విశ్వనాథ్ శివైక్యం చెందారు.ఆయన భౌతికంగా నేడు మన మధ్య లేకపోయినా ఆయన సృజియించిన సినిమాలు ఆయనను చిరంజీవిగా నిలిపాయి.వాటిల్లో ‘స్వాతిముత్యం’ ఒక ఆణిముత్యంగా ఎన్నదగినది. ఈ సినిమా విడుదలై నేటికి 37 సంవత్సరాలు పూర్తి చెసుకున్నది .
దృశ్యకావ్యంగా రూపుదిద్దుకున్న గొప్ప కుటుంబ కథాచిత్రంగా ‘స్వాతిముత్యం’ అవార్డులతోపాటు అప్పటికి Box Office Records ని బ్రేక్ చెసింది . 1986,మార్చి 13 వ తేదీ విడుదలైన ఈ సినిమా భారతదేశం తరపున ఆస్కార్ ఎంట్రీని పొందింది. ఇప్పుడు ‘ఆర్ ఆర్ ఆర్’
సినిమా గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం.
ఆనాడే ‘స్వాతిముత్యం’ ఆస్కార్ ఎంట్రీతో పాటు ఏషియన్ పెసఫిక్ చిత్రొత్సవంలొ ఉత్తమ నటుడి అవార్డు , ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారంతో పాటు బంగారు నందిని కూడా అందుకుంది.దర్శకత్వ విభాగంలో ఫిల్మ్ ఫేర్ విజేతగా నిలిచింది, కమల్ హసన్ ఉత్తమనటుడుగా ఎంపికయ్యాడు. రష్యన్ భాషలోకి అనువదించి అక్కడ కూడా విజయవంతమైనది. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకం పై శ్రీ ఏడిద ఏడిద నాగేశ్వరావు ఈ చిత్రాన్ని నిర్మించారు ..
సంప్రదాయం,సంచలనం,సంగీతం, సాహిత్యం రంగరించుకున్న ఈ చిత్రం తమిళం లో సిప్పిక్కుల్ ముత్తు. కన్నడలో స్వాతిముత్తు , హిందీలో ఈష్వర్ గా నిర్మాణమై దేశవ్యాప్తంగా సంచలన విజయాలను సొంతం చేసుకుంది.
ఆత్రేయ,సినారె,సిరివెన్నెల గీతాలు ప్రేక్షకులను రసవృష్టిలో ముంచిముద్దచేశాయి. పసిడికి తావి అబ్బినట్లు ఆ కవుల కలం నుంచి జాలువారిన స్వర్ణాక్షరాలకు ఇళయరాజా రసరమ్యమైన సుస్వరాలతో పాటు అద్బుతమైన నేపద్య సంగీతం ఈ చిత్ర విజయానికి జత చేరాయ. అమాయకుడిగా కమల్ హాసన్ పాత్ర భారతీయ సినిమాల్లో చిరంజీవిగా నిలిచిపోయింది.
రాధిక,నిర్మలమ్మ పోటీపడి నటించారు.గొల్లపూడి,
శరత్ బాబు, ఏడిద శ్రీరాం, జెవి సోమయాజులు, దీప, వై.విజయ, మొదలైన నటీనటులు వాళ్ళ పాత్రలకు జీవం పోశారు.ఎమ్ వి రఘు ఛాయాగ్రహణం సహజత్వానికి అద్దం పట్టింది.ఏడిద రాజా ఈ చిత్రానికి executive producer గా వ్యవహరించారు .ఆంధ్రప్రదేశ్, తమిళనాడు,కర్ణాటక లోని అనేక ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. స్వాతిముత్యం విడుదలై ఇన్నేళ్లయినా వన్నె తగ్గని మేలిముత్యంలా మెరిసిపోతోంది.