యశోద పాయింట్ విన్నాక ఎగ్జైట్ అయ్యి సినిమా చేశాం – కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ

0
329

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదలైంది. అన్ని భాషల్లో, అన్ని వయసుల ప్రేక్షకుల నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ డే ఆరున్నర కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

సమంతతో పాటు మిగతా పాత్రలకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్‌లో సమంతతో పాటు కనిపించిన కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ పాత్రలు కథలో కీలకం. తమ పాత్రలకు వస్తున్న స్పందన తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆ ముగ్గురూ చెప్పారు. సినిమాకు, తమ క్యారెక్టర్లకు పాజిటివ్ రెస్పాన్స్ లభించిన నేపథ్యంలో శనివారం కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ మీడియాతో ముచ్చటించారు.

కల్పికా గణేష్ మాట్లాడుతూ ”మనం కూర్చుని ఫిలాసఫీ చెబితే ఎవరూ వినరు. దాన్ని ఎంగేజింగ్‌గా చెప్పాలి. ‘యశోద’ పర్ఫెక్ట్ ప్యాకేజ్ అని చెప్పాలి. ఎంటర్‌టైన్‌మెంట్, క్యూట్ రొమాన్స్, ఎమోషన్స్… ప్రతిదీ ఉంది. పాటలు మాత్రమే మిస్సింగ్. ఈ కథను ప్రేక్షకులకు చెప్పాలి. అందుకే, కొన్ని ప్రాజెక్టుల్లో లీడ్ రోల్స్ చేస్తున్నప్పటికీ… ఈ సినిమాలో ప్రెగ్నెంట్ లేడీ రోల్ చేయడానికి అంగీకరించాం. మహిళలకు మాత్రమే కాదు, మగవాళ్ళకు, పిల్లలకు కూడా సమాజంలో ఏం జరుగుతుందో తెలియాలి. క్యారెక్టర్ చిన్నదా? పెద్దదా? అని ఆలోచించలేదు. కథ కోసమే సినిమా చేశా. చిన్న చిన్న పాత్రలు కథను ముందుకు తీసుకు వెళ్లాయి. సమంత సినిమా కోసం కష్టపడ్డారు. ఇప్పుడు వస్తున్న స్పందన సంతోషాన్ని ఇచ్చింది. మీరు ‘ప్రయాణం’ చూశారు కదా! దానికి ఈ క్యారెక్టర్ మరో వెర్షన్ అని చెప్పాలి. సినిమా షూటింగ్ చేశాక… తెలుగు డబ్బింగ్ చెప్పాను. తమిళ్ డబ్బింగ్ కూడా చెబుతానని ఫైట్ చేశా. వాయిస్ టెస్ట్ చేశారు. కానీ, కుదరలేదు” అని అన్నారు.

దివ్య శ్రీపాద మాట్లాడుతూ ”సమంత ‘నేను బాగా చేశాను’ అని చెప్పారు. నాకు అది బెస్ట్ కాంప్లిమెంట్. సినిమా చూస్తే… క్యారెక్టర్ల పేర్లు అన్నిటికీ కృష్ణుడి కనెక్ట్ ఉంటుంది. సరోగసీ కాన్సెప్ట్ కొత్తది కాదని చెప్పడానికి పేర్లు ఆ విధంగా పెట్టారేమో!? షూటింగ్ విషయానికి వస్తే… సిలికాన్ బెల్లీతో చేయడం కష్టం అండి. ఇటువంటి కథతో సినిమా తీస్తున్నారనేది ఎగ్జైటింగ్ పార్ట్. క్యారెక్టర్ కోసం చాలా ఇన్‌పుట్స్ ఇచ్చారు. లీలకు కృష్ణ అంటే ఎంత ప్రేమ అనేది చాలా వివరించారు. లీల ఎంత ఇన్నోసెంట్ అనేది నేను ఫీల్ అయ్యానో… అలా ప్రేక్షకుడు కూడా ఫీల్ అవ్వాలి. సమంత ఇంకా భవిష్యత్తులో చాలా చేయగలరు. సమంత మాత్రమే కాదు, ఈ సినిమా చూశాక మిగతా ఫిమేల్ ఆర్టిస్టులకు ఇటువంటి సినిమా చేసే ఛాన్సులు వస్తాయని, ఇటువంటి కథలు రాస్తారని ఆశిస్తున్నాను. ‘యశోద’ కథకు వస్తే… సినిమా ఎండ్ కార్డ్స్‌లో న్యూస్ క్లిప్పింగ్స్ చూపిస్తారు. సినిమాకు అదే మూలం” అని అన్నారు.

ప్రియాంకా శర్మ మాట్లాడుతూ ”సినిమా షూటింగ్ చేసేటప్పుడు గర్భవతులుగా కనిపించడం కోసం మేమంతా సిలికాన్ బెల్లీ ఉపయోగించాం. దాంతో షూటింగ్ చేయడం కష్టమే. కథ విన్నప్పుడు ఎగ్జైట్ అయ్యాను. ఇటువంటి క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. అందుకని, ఎలా చేయగలను? న్యాయం చేస్తానా? లేదా? అని కొంత ఆలోచించాను. రెండు రోజులు ఆలోచించిన తర్వాత ఓకే చేశా. ఈ కథను నా దగ్గరకు పుష్ప గారు తీసుకొచ్చారు. ‘సినిమా విడుదలైన తర్వాత ఇటువంటి కథ చేయలేదు’ అని రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదన్నారు. నాకు ఆ మాట నచ్చింది. ఓకే చేసేశా. ఇటువంటి కథలు అరుదు. ‘యశోద’ లాంటి కథల్లో నటించే అవకాశం అరుదుగా వస్తుంది.  సమంత విషయానికి వస్తే… బాడీ డబుల్ (డూప్) ఉపయోగించే అవకాశం ఉన్నా స్వయంగా చేశారు. ఆమె డెడికేషన్‌కి హ్యాట్సాఫ్” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here