మాది 35 ఏళ్ల అనుబంధం… నాది మాటలకు అందని బాధ – ‘సిరివెన్నెల’ గురించి ప్రముఖ నిర్మాత  ‘స్రవంతి’ రవికిశోర్

0
103

నిర్మాతగా తన తొలి సినిమా ‘లేడీస్ టైలర్’ నుంచి లేటెస్ట్ ‘రెడ్’ వరకూ… తమ సంస్థలో సుమారు 80 పాటల వరకూ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాశారని నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ అన్నారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకెంతో లోటు అని, ఏం చెప్పాలో తెలియడం లేదని, తనకు మాటలు రావడం లేదని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. తన పెద్దన్నయ్యను కోల్పోయినట్టు ఉందని రవికిశోర్ అన్నారు.

‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ “ఏం చెప్పాలో తెలియడం లేదు. మాటలకు అందని బాధ ఇది. అన్నయ్యతో అనుబంధం ఈనాటిది కాదు. నిర్మాతగా నా తొలి సినిమా ‘లేడీస్ టైలర్’లో అన్ని పాటలూ ఆయనే రాశారు. అప్పటి నుంచి సీతారామశాస్త్రి గారితో పరిచయం ఉంది.  అప్పటి నుంచి మా ప్రయాణం కంటిన్యూ అవుతోంది. బహుశా… ఏ నిర్మాతకూ రాయనన్ని పాటలు మా సినిమాకు రాశాడని చెప్పవచ్చు. ‘మహర్షి’, ‘ఏప్రిల్ 1 విడుదల’, ‘మావిచిగురు’, ‘ఎగిరే పావురమా’, ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘నువ్వే కావాలి’, ‘నువ్వే నువ్వే’, ‘ఎలా చెప్పను’, ‘గౌరీ’, ‘నేను శైలజ’, ‘రెడ్’… దాదాపుగా నేను నిర్మించిన అన్ని సినిమాల్లోనూ ఆయన పాటలు రాశారు. ఎక్కడో ఒకటి అరా పాటలు వేరేవాళ్లు రాశారు తప్పితే… ఎక్కువ సినిమాలకు ఆయనదే సింగిల్ కార్డ్. స్రవంతి మూవీస్ సంస్థలో సుమారు 80 పాటల వరకూ రాసి ఉంటారు. ఆయనతో మ్యూజిక్ సిట్టింగ్స్, రైటింగ్ సిట్టింగ్స్ కు కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. ఒక్కో పాట రాయడానికి ఐదారు రాత్రులు కూర్చునే వాళ్ళం. ఇంకా ఏదో రాయాలని ఆయన పరితపించేవారు. ఇది వరకు… పాట అంటే నాలుగైదు సన్నివేశాల్లో చెప్పాల్సిన సారాన్ని చెప్పేవాళ్లం. అందులో ఆయన మేటి. రామ్ హీరోగా నిర్మించిన ‘రెడ్’లో ఆయన పాటలు రాశారు. అప్పుడు డిసెంబర్ 2019లో ఆ పాటల కోసం రాత్రుళ్లు కూర్చున్నాం. ఆ తర్వాత కరోనా వచ్చాక కలవడం కుదరలేదు. నాకంటే ఆయన రెండు నెలలు పెద్దవారు. అందుకని, నన్ను ‘కుర్రకుంక’ అని సరదాగా అనేవారు. నేను రాముడు అని పిలిచేవాడిని. సాయంత్రం మా ఆఫీసుకు వస్తే సరదాగా కూర్చుని కబుర్లు చెప్పుకొనేవాళ్లం. ఆయన ఆరోగ్యం గురించి మొన్న ఒకరితో మాట్లాడితే… త్వరలో ఆరోగ్యంగా తిరిగి వస్తారని అన్నారు. ఇంతలో ఇటువంటి విషాద వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు” అని అన్నారు.

‘రెడ్’ సినిమా పాటలు రాసేటప్పుడు జరిగిన సంఘటన గురించి ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ “వారం రోజుల్లో ‘రెడ్’ సినిమాలో సాంగ్ షూటింగ్ అనగా… పాట రెండు రోజుల్లో రాసి ఇచ్చేస్తానని అన్నారు. కథ మొత్తం విని… ‘ఈ కథకు ఈ పాట కరెక్ట్ కాదు. నేను రాసినా, మీరు చిత్రీకరించినా… ఆ తర్వాత తీసేస్తారు’ అని చెప్పారు. దాంతో మేం ఆ పాటను తీసేశాం. అలా ఎవరు చెబుతారు చెప్పండి? డబ్బులు చూసుకుంటారు తప్ప, పాట వద్దని ఎవరంటారు? ఇటువంటి సంఘటనలు మా మధ్య చాలా జరిగాయి. మా మధ్య సుమారు 400 రాత్రులు సాహిత్య చర్చలు జరిగాయి” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here