నారప్ప మూవీ – రివ్యూ

0
323

చిత్రం: నారప్ప

విడుదల తేదీ : జూలై 20, 2021

విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

నటీనటులు: వెంకటేశ్‌, ప్రియమణి, కార్తీక్‌ రత్నం, రావు రమేశ్‌, నాజర్‌, రాజీవ్‌ కనకాల, అమ్ము అభిరామ్‌ తదితరులు
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు
ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
బేన‌ర్స్‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప్రై.లి, వీ క్రియేష‌న్స్‌
నిర్మాతలు: డి.సురేశ్‌బాబు, కలైపులి ఎస్‌.థాను,
కో – ప్రొడ్యూసర్: దేవి శ్రీదేవి సతీష్
రచన: వెట్రిమారన్‌
దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల

కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంటున్న హీరో ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్. సోలో సినిమాలైనా మల్టీస్టారర్ సినిమాలైనా వెంకటేష్ ముందుంటారు. అయితే రీమేక్‌ల‌ను ఎంచుకోవ‌డంలో వెంకీమామ‌ది ప్ర‌త్యేక‌మైన శైలి. ఎన్నో రీమేక్ ల్లో నటించి సక్సెస్ లు దక్కించుకున్న ఘనత ఆయ‌న‌కు ఉంది. వెంకటేష్‌ తనకు సూట్‌ అయ్యే కథలనే ఎంచుకుని ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మాతృక సినిమాను మర్చిపోయేలా చేస్తాడు. అదే వెంకీ మామ స్టైల్‌. ఆయన తాజా చిత్రం ‘నారప్ప’. తమిళ ‘అసురన్‌’కి రీమేక్‌ ఇది. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ మాస్ అండ్ యాక్ష‌న్ డ్రామా పోస్ట‌ర్స్, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కి పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు ‘నారప్ప’ఏ మేరకు అందుకున్నాడో ఇప్పుడు చూద్దాం.

క‌థ‌: నారప్ప(వెంకటేష్‌) తన భార్య సుందరమ్మ(ప్రియమణి)తో కలిసి తనకున్న మూడెకరాల పొలం చేసుకుంటూ అనంతపురం జిల్లాలోని రామసాగరం అనే ఊరిలో హాయిగా జీవితం సాగిస్తుంటాడు. అతడికి మునికన్నా(కార్తీక్‌ రత్నం), సిన్నబ్బ(రాఖీ), బుజ్జమ్మ(చిత్ర) ముగ్గురు పిల్లలు. అక్కడి భూస్వామి పాండుసామి (నరేన్) తన ఫ్యాక్టరీ కోసం ఊర్లో అందరి భూమిని దౌర్జ‌న్యంగా లాక్కుంటాడు. నారప్పకు చెందిన మూడు ఎకరాలు తప్ప ఊర్లోని పొలమంతా కూడా పాండుసామి చేతుల్లోకి వెళ్తుంది. వ్య‌వ‌సాయ‌బావిలో నీరు దౌర్జ‌న్యంగా మోటార్‌ద్వారా తీసుకెళ్లే విష‌యంలో సుంద‌ర‌మ్మ‌కు, పాండు స్వామి మ‌నుషుల‌కు గొడ‌వ‌జ‌రుగుతుంది. ఈ విష‌యంలో ఆవేశ‌ప‌రుడైన మునిక‌న్నా పాండు స్వామి త‌మ్ముడు దొరస్వామి(దీపక్‌ శెట్టి)ని కొడ‌తాడు. ఆ త‌ర్వాత‌ పాండు స్వామిని అవ‌మానిస్తాడు. దీంతో మునికన్నాను దారుణంగా హత్య చేయిస్తాడు పాండు స్వామి. త‌న‌ అన్నను చంపారన్న ప్రతీకారంతో తల్లి బాధను చూడలేక నారప్ప రెండో కొడుకు సిన్నబ్బ పండుస్వామిని హత్య చేస్తాడు. దీంతో పండుస్వామి కుటుంబ సభ్యులు నారప్ప కుటుంబాన్ని అంతం చేయాలని చూస్తారు. వారినుండి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి? నారప్ప గతం ఏంటి? చివరకు నారప్ప తన కొడుకును కాపాడుకున్నాడా? లేదా? అన్నదే కథ.

నారప్ప సినిమా తండ్రీ కొడుకు అడవుల బాట పట్టడంతో ప్రారంభమ‌వుతుంది. ప్రత్యర్థులు ఓపక్క, పోలీసులు మరోపక్క వారిని తరమడం, మరో వైపు తల్లి, కూతురు వేరే చోట తల దాచుకోవడం ఇలాంటి థ్రిల్లింగ్ అంశాల‌తో ఫ‌స్ట్‌లోనే సినిమా చూడాలనే ఆసక్తి జనరేట్ అవుతుంది. మొద‌ట్లో పౌరుషం లేని తాగుబోతు తండ్రిగా వెంకటేష్ త‌న‌దైన శైలి న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్‌ సన్నివేశాల్లో నటుడిగా ఆయన సీనియార్టీ కనిపిస్తుంది. ఇక త‌న కుటుంభం జోలికి వ‌స్తే మాత్రం శ‌త్రువుల‌ను చీల్చిచెండాడే ఫిరోషియ‌స్ నార‌ప్ప‌గా వెంక‌టేష్ న‌ట‌న అద్భుతం. యాక్షన్ సన్నివేశాల్లో వెంకటేష్ తన విశ్వరూపాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువ‌చ్చారు. నారప్ప సినిమా వెంకటేష్‌ వన్‌మెన్‌ షో అని చెప్పవచ్చు. ద్వితీయార్థంలో నార‌ప్ప ఫ్లాష్ బ్యాక్ మొద‌ల‌వుతుంది. అందులోనూ ఎమోష‌న్స్ క‌ట్టిప‌డేస్తాయి. ముఖ్యంగా `చెప్పుల ఎపిసోడ్‌` ఆనాటి అస‌మాన‌త‌ల్ని ఎత్తి చూపిస్తుంది. ఓ వ‌ర్గానికి ఇలాంటి అన్యాయం జ‌రిగిందా? అనిపిస్తుంది. ఆయా స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు శ్రీ‌కాంత్ అడ్డాల బాగా డీల్ చేశాడు. రెండు వైవిధ్యమైన పాత్రల్లోనూ ఆయన నటన మెప్పిస్తుంది. ఇక సుందరమ్మ పాత్రలో ప్రియమణి అల‌వోక‌గా నటించి ఆ పాత్ర‌కు ఆమె ఫ‌ర్‌ఫెక్ట్ ఛాయిస్ అని నిరూపించుకుంది. ముని ఖన్నాగా కార్తీక్ రత్నంకి మంచి స‌న్నివేశాలు ప‌డ్డాయి. సిన్నబ్బగా రాఖీ, బసవయ్యగా రాజీవ్ కనకాల, లాయర్ వరదరాజులుగా రావు రమేష్, శంకరయ్యగా నాజర్ ఇలా ప్రతీ ఒక్కరూ కూడా తమ పాత్రల్లో నటించేశారు.

నార‌ప్ప సినిమాకు ప్రధాన బలం మణిశర్మ సంగీతం. పాటలు కథాగమనంలో వచ్చి వెళ్లిపోతాయి. అయితే, యాక్షన్‌ సన్నివేశాలను ఎలివేట్‌ చేయడంలో మణిశర్మ ఇచ్చిన నేపథ్య సంగీతం ప్రేక్ష‌కుల‌కి గూజ్బంమ్స్ తెప్పిస్తుంది. ముఖ్యంగా ‘రా నరకరా.. నరకరా’ థీమ్ సాంగ్ వింటుంటే ఒళ్లుగగురు పొడవాల్సిందే. శ్యామ్‌ కె. నాయుడు విజువ‌ల్స్ సినిమానుండి ఎక్క‌డా డీవియేట్ కాకుండా చేశాయి. మార్తాండ్‌ కె. వెంకటేష్ ఎడింటింగ్ బాగుంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, వీ క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ బాగున్నాయి.

సాధార‌ణంగా ఒక సినిమాను ఆద‌రించ‌డానికి చాలా కారణాలు వుంటాయి. అక్కడి సామాజిక పరిస్థితులు, సినిమాలో నటించిన హీరో, అక్కడి ప్రేక్షకుల అభిరుచులు ఇలా. తమిళనాట అసురన్ సినిమాకు అంత అప్లాజ్ రావడానికి ముఖ్య కారణం అక్కడి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో అల్లిన కథ కావ‌డం. అలాగే యువ హీరో అయి వుండి ఇద్దరు పిల్లల తండ్రిగా ధనుష్ నటించడం. అయితే ఆ క్యారెక్ట‌ర్‌ను విభిన్న‌త‌ర‌హా పాత్ర‌లుచేయ‌డంలో ముందుండే వెంక‌టేష్ చేయాల‌నుకోవడం అభినందించాల్సిన విష‌యం. వెంక‌టేష్ నార‌ప్ప పాత్ర‌లోకి ప‌ర‌కాయ‌ప్ర‌వేశం చేశారు. నార‌ప్ప‌గా ఆయ‌న ట్రాన్స్‌ప‌ర్మేష‌న్, బాడీ లాంగ్వెజ్ ఫ‌ర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యాయి. డైలాగులు, స్టైల్‌, మేన‌రిజ‌మ్‌, లుక్స్ అన్నీఈ చిత్రానికి మేజర్‌ హైలైట్‌ అని చెప్పొచ్చు. నార‌ప్ప‌గా వెంక‌టేష్ ధ‌నుష్‌ని మైమ‌రిపించాడు. నార‌ప్ప చిత్రంతో వెంక‌టేష్ క‌థ‌ల విష‌యంలో త‌న ఛాయిస్ ఎప్పుడు క‌రెక్టే అని మ‌రోసారి నిరూపించారు. దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల మాత్రం నారప్ప విషయంలో నూటికి నూరు మార్కులు సంపాదించుకున్నారు. ప్రతీ ఎమోషన్‌ను ప్రేక్షకులకు ప‌ర్‌ఫెక్ట్‌గా కనెక్ట్ అయ్యేలా చేశారు.

‘వాళ్లను ఎదిరించడానికి అది ఒక్కటే దారి కాదు. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప’లాంటి డైలాగ్‌తో సమాజానికి మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు. అలాగే ఒకే మ‌ట్టిమీద ఉంటున్నాం. ఒకే భాష మాట్లాడుతున్నాం ఇవి చాల‌వా క‌లిసి బ్ర‌త‌క‌డానికి వంటి డైలాగ్స్ ప్రేక్ష‌కుల్ని ఆలోచింప‌జేస్తాయి. ఒకప్పుడు నిమ్న-అగ్ర వర్ణాల మధ్య ఉన్న భేదాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. సామాజిక స్పృహ కలిగించేలా.. సమాజంలోని అసమానతలను చూపించేలా రాసుకున్న ఈ కథ అందరినీ కదిలిస్తుంది. అసురన్‌ చూడకుండా నేరుగా నారప్పను చూసేవారు మరింత కొత్త అనుభూతికి లోనవ‌డం ఖాయం.

రేటింగ్: 3.25/5

చివ‌ర‌గా..అంద‌రినోట ఒక‌టే మాట నార‌ప్ప‌..నార‌ప్ప‌…నార‌ప్ప‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here