1984లో సరిగ్గా ఇలాంటి రోజుల్లో నేను సూపర్ స్టార్ కృష్ణగారితో సినిమా చేయాలనుకున్నాను. అదే సందర్భంలో .. మే 31న కృష్ణగారి పుట్టినరోజు.. కాబట్టి కృష్ణగారి స్టిల్స్ కావాలని అనుకున్నప్పుడు దివంగత సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావుగారు నన్ను బి.ఎ.రాజుకి పరిచయం చేశారు. మృదు స్వభావి. ఎవరినీ నొప్పించకుండా, చిరునువ్వుతో అందరినీ పలకరించే మనస్తత్వం ఆయనకు నన్ను మరింత దగ్గర చేసింది. అప్పటి నుంచి మూడున్నర దశాబ్దాలకు పైగా బి.ఎ.రాజుతో అనుబంధం కొనసాగింది. నేను నిర్మాతగా చేసిన ఎన్నో సినిమాలకు ఆయన పి.ఆర్.ఓ వర్క్ చేశారు. మనలో ఒకడిగా కలిసిపోయే మంచి గుణమున్న వ్యక్తి. అలాంటి బి.ఎ.రాజు ఉన్నట్లుండి హఠాన్మరణం చెందారని తెలిసి షాకయ్యాను. సినీ పరిశ్రమ, ముఖ్యంగా పాత్రికేయ కుటుంబం ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. బి.ఎ.రాజు ఆత్మకు ప్రశాంతత చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను.
– నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్



