మిస్టరీ నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే థ్రిల్లర్‌ `నిశ్శ‌బ్దం`- ద‌ర్శ‌కుడు హేమంత్ మ‌ధుక‌ర్‌

0
282

స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `నిశ్శ‌బ్దం`. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శక‌త్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు కోన ఫిలిం కార్పొరేషన్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సెన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవ‌డంతో సినిమా పైన మంచి అంచనాలు ఏర్ప‌డ్డాయి. గాంధి జ‌యంతి కానుక‌గా అక్టోబర్ 2న తెలుగు, త‌మిళ‌,మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో అమెజాన్ ప్రైమ్‌లో సినిమా విడుద‌ల‌కానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు హేమంత్ మ‌ధుక‌ర్ వెబినార్‌లో పాత్రికేయుల‌తో ముచ్చ‌టించారు. ఆ విశేషాలు

ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలయ్యింది?
– క‌మ‌ల్‌హాస‌న్ గారు న‌టించిన పుష్ప‌క విమానం టీవీలో చూస్తున్న‌ప్పుడు ` ఆనందంగా గ‌డుపుతున్న ఒక చెవిటి మ‌రియు మూగ వ్య‌క్తి జీవితం ఊహించ‌ని విధంగా ఒక పెద్ద‌ స‌మ‌స్య‌ని ఎదుర్కోవాల్సి వ‌స్తే అత‌ను ఎలా రియాక్ట్ అవుతాడు, ఆ స‌మ‌స్య గురించి ఇత‌రుల‌కి ఎలా తెల‌ప‌గ‌ల‌డు అనే పాయంట్‌తో అత‌ని దృక్కోణంలో ఒక సైలంట్ థ్రిల్ల‌ర్ మూవీగా చేస్తే ఎలా ఉంటుంది అని క‌థ రాయ‌డం ప్రారంభించాను. మొదట్లో చాలా చిన్న సినిమాగానే ప్లాన్ చేద్దామనుకొని ప్రీ ప్రొడక్షన్ పనిని స్టార్ట్ చేశాను, ఆ తర్వాత ఓసారి కోనా వెంకట్ గారిని కలిసి లైన్ వినిపించాను. ఆయ‌న‌కు బాగా న‌చ్చ‌డంతో హేమంత్ ఇది చిన్న‌సినిమాగా వ‌ద్దు స్టార్ క్యాస్ట్ తో ఒక పెద్ద స్పాన్‌లో సినిమా ప్లాన్ చేద్దాం త‌ప్ప‌కుండా వ‌ర్క‌వుట్ అవుతుంది అని చెప్పారు. ఆ తర్వాతే వాణిజ్యహంగులతో సంభాషణల్ని జోడించాను. ఓ మిస్టరీ నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే థ్రిల్లర్‌ చిత్రమిది. తెలుగు ప్రేక్షకులు ఇదివరకు చూడని సరికొత్త అనుభూతిని పంచుతుంది.

ఈ ప్రాజెక్ట్‌లోకి అనుష్క ఎలా ఎంట‌ర్అయ్యారు?
– ముందు ఈ ప్రాజెక్ట్ తాప్సీ, మాధ‌వ‌న్‌తో తెర‌కెక్కించాలి అనుకున్నా. కాని కొన్ని కార‌ణాల వ‌ల్ల కుద‌ర‌లేదు. అయితే కోనా వెంక‌ట్‌గారు అనుకోకుండా ఫ్లైట్‌లో అనుష్క గారిని క‌ల‌వ‌డం స్టోరీలైన్ చెప్ప‌డంతో ఆమెకి బాగా న‌చ్చి నేను చేస్తాను అని చెప్పారంట ఆ త‌ర్వాత నేను అనుష్క గారి ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఫుల్ స్క్రిప్ట్ న‌రేట్ చేశాను. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి అనుష్క గారిని తీసుకోవడంలో పూర్తి క్రెడిట్ కోనా గారికే చెందుతుంది. ఆమె క్రేజ్‌ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఇమేజ్‌, పాపులారిటీ ఇవేమీ పట్టించుకోకుండా ఓ కొత్తహీరోయిన్‌లా ప్రతిది అడిగి తెలుసుకుని నటించారు. ఈ సినిమా కోసం ఆమె ఇండియ‌న్ సైన్ లాంగ్వేజ్‌తో పాటు ఇంట‌ర్నేష‌న‌ల్ సైన్‌ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నారు. అనుష్క పాత్ర భిన్నపార్శాల్లో ఆకట్టుకుంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ఆమె డెడికేషన్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది.

మాధవన్‌, అంజలి, శాలినిపాండే, మైఖేల్‌ వంటి ‌యాక్టర్స్‌తో మీ ప్రయాణం ఎలా సాగింది? 
ముందు నుండి ఆ పాత్ర‌కి మాధ‌వ‌న్ అయితే సూట్ అవుతాడు అనుకున్నాం. ఆయ‌నకు కూడా న‌చ్చ‌డంతో ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాడు. అలాగే అంజలి ఓ స్టైలీష్ అమెరికన్‌ కాప్‌గా కనిపించడానికి ప్రత్యేకశిక్షణ తీసుకుని తన లుక్‌ను మార్చుకున్నారు. హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడ్సెన్ని ప్లాన్డ్ గానే అనుకున్నాము. ఎందుకంటే క‌థ ప్ర‌కారం యూఎస్ కు చెందిన ఒక హాలీవుడ్ నటుణ్ని ఎంచుకోవాలి అలా ఆయనను నిశ్శబ్దంలో తీసుకున్నాం. అయితే ఇంత మంది టాలెంట్‌ పర్సన్స్‌తో ఒక సినిమా చేయడం అంటే కొంతమేరకు కష్టమే అయినప్పటికీ వీరందరికీ నటన పట్ల వున్న అంకితభావంతో మా షూటింగ్‌ ఆద్యంతం హాయిగా సాగిపోయింది.

థ్ల్రిలర్‌ సినిమాకు నేపథ్యసంగీతం చాలా కీలకం ‘నిశ్శబ్ధం’ చిత్రంలో అది ఎలా వుండబోతుంది? 
ఇది మాటల్లో కంటే రేపు సినిమా విడుదల తరువాత ప్రేక్షకుల అనుభవం ద్వారా తెలుసుకుంటే నాకు సంతృప్తిగా ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకుల నుంచి నేపథ్య సంగీతానికి మంచి ఫీడ్‌బ్యాక్‌ వస్తుందని ఆశిస్తున్నా. పానీల్‌ డియో అందించిన అద్భుతమైన విజువల్స్‌తో మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీసుందర్ సంగీతం‌, గిరీష్ గోపాల‌కృష్ణ‌న్‌ నేపథ్య సంగీతం పోటీపడతాయి. గోపీసుందర్ సినిమాను ఛాలెంజ్‌గా తీసుకుని తొలిసారిగా ఓ థ్రిల్లర్ సినిమాకి సంగీతం అందిచారు.

ఈ చిత్రం థియేటర్‌లో కాకుండా అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ కావడం పట్ల మీరు హ్యాపీగా వున్నారా? 
కరోనా నేపథ్యంలో థియేటర్స్‌ మూతపడటంతో వేరే మార్గం లేదు. ప్రేక్షకులంతా సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా అమెజాన్‌ వారికి సినిమా బాగా నచ్చింది. ఓటీటీలు, థియేటర్స్‌కి పోటీకాదు. వీటి వల్ల థియేటర్‌కి ఎలాంటి నష్టం జరగదని నేను నమ్ముతున్నాను. తప్పకుండా కరోనా వ్యాప్తి తగ్గిన తరువాత థియేటర్స్‌ ప్రారంభమై మళ్లీ థియేటర్స్‌కి పూర్వవైభవం వస్తుందని విశ్వసిస్తున్నాను.

చిత్రీకరణ మొత్తం విదేశాల్లో చేయడం రిస్క్‌ అనిపించలేదా? 
కోనా వెంకట్ గారు మరియు విశ్వప్రసాద్ గారు ఇద్దరూ మాకు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పూర్తి స్వేచ్ఛను ఇచ్చేసారు. కథను నమ్మి నిర్మాతలు పెట్టుబడి పెట్టారు. అందుకే బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని నిర్మించారు. అమెరికాలో సినిమా చిత్రీకరణ అంటే కత్తిమీదసామే. వీసా దగ్గర నుంచి షూటింగ్‌ లోకేషన్స్‌లో అనుమతులు, ఇలా చాలా విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే సమిష్టికృషితో సినిమా షూటింగ్‌ను 55-60 రోజుల్లో పూర్తిచేశాం

మీ సినిమాపై ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు?
– ఒక్క నేను మాత్రమే కాదు మొత్తం మా చిత్ర యూనిట్ అంతా ఫైనల్ అవుట్ ఫుట్ చూసి చాలా సంతోషంగా ఉన్నాం. స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ వారు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ తీసుకున్నాక కొంత మంది అమెజాన్ సభ్యులు ఈ చిత్రాన్ని చూసి మా గ్రూప్ అంతటికీ కాల్ చేసి అభినందించారు.

ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ ఏంటి?
ప్రేక్ష‌కులు థ్రిల్ ఫీల‌వ్వ‌డం కోసం ఆ విష‌యాలు ఇప్పుడే రివీల్ చెయ్యను కానీ, ఈ సినిమాలో నటులు ఇచ్చిన పెర్ఫామెన్స్ లు చాలా బాగుంటాయి. అలాగే ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి అంటే నా సౌండింగ్ అండ్ సినిమాటోగ్రఫీలు అందించిన షానియల్ డియో కు చెప్పాలి. వారికి ఖచ్చితంగా మంచి గుర్తింపు వస్తుంది అని నమ్ముతున్నాను.

మీ నెక్ట్స్‌‌ ప్రాజెక్ట్స్ ఏంటి ?
ప్రస్తుతానికి నా దగ్గర రెండు కథలు ఉన్నాయి. అందులో ఒక‌టి థ్రిల్ల‌ర్ మ‌రోటి డిఫ‌రెంట్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌. రెండు పెద్ద స్టార్‌కాస్ట్ ఉన్న స‌బ్జెక్ట్‌. అయితే నిశ్శ‌బ్ధం సినిమా విడులయ్యాక వాటి గురించి ఆలోచిస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here