`వకీల్ సాబ్` చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోన్న పవర్ స్టార్ పవన్‌కళ్యాణ్ తన 27వ సినిమాగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కి ముందే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. అయితే ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోగా మరి కొద్ది రోజులలో ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. అయితే సెప్టెంబర్2 పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా #PSPK27 ప్రీ లుక్ విడుదల చేశారు దర్శకుడు క్రిష్. “పవన్‌కళ్యాణ్ గారు #PSPK27 సినిమా కోసం పదిహేను రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది.. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది.. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం.. ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు దర్శకుడు క్రిష్.
ఈ సినిమా కు సంబంధించి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ప్రీ లుక్‌లో పవన్ చేతికి కడియం, నడుముకి ఎర్రని గుడ్డ చూస్తుంటే ఈ చిత్రం పవన్ ఫ్యాన్స్‌కి సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం రూపొందిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.



