మనమంతా ఒక్కటవ్వాల్సిన సమయమిది – శేఖర్ కమ్ముల

0
367
శేఖర్ కమ్ముల

కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు మనమంతా ఒక్కటవ్వాల్సిన సమయమిదని దర్శకుడు శేఖర్ కమ్ముల పిలుపునిచ్చారు. వైరస్ సోకితే భయం, ఆందోళనలకు గురి కాకుండా ప్రశాంతంగా చికిత్స తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన వాళ్లు ఎలా ఉన్నారో ఫోన్ లో అడిగి తెలుసుకోవడం, ఎవరైనా అవసరం కోసం ఫోన్ చేస్తే అందుబాటులో ఉండటం ఇప్పుడు ముఖ్యమని శేఖర్ కమ్ముల చెప్పారు. డాక్టర్ సాజయా కాకర్ల, యాక్సెస్ ఫౌండేషన్ డాక్టర్ ఇరామ్ జోవర్ లతో కలిసి ఆయన ఫేస్ బుక్ లైవ్ లో కొవిడ్ గురించి చర్చించారు. ఇందులో కరోనా బారిన పడి వైరస్ ను గెల్చిన కారు డ్రైవర్ కృష్ణంరాజు అనుభవాలను ఈ లైవ్ చర్చలో తెలుసుకున్నారు.

ఫేస్ బుక్ లైవ్ లో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ…ఏపీ, తెలంగాణ , మరో ప్రాంతం అని కాదు ఈ కరోనా సమయంలో మనమంతా ఒక్కటవ్వాలి. ఒకరికి మరొకరం అండగా నిలబడాలి. మీకు తెలిసిన వాళ్లు ఎలా ఉన్నారో ఫోన్ చేసి కనుక్కోండి. వాళ్లకు ఏదైనా సహాయం కావాల్సి వస్తే చేయండి. మీరు ఫోన్ లో అందుబాటులో ఉండండి. యువకులు ఈ సేవలో వాలంటీర్ గా ముందుకు రావాలి. కరోనా వచ్చినా భయపడొద్దు. మంచి ఆహారం తీసుకుని, ఒత్తిడికి గురి కాకుండా చికిత్స తీసుకోండి. ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే టెస్టులు చేయించుకోవాలి. మనకు రాదని ఎవరూ అనుకోవద్దు. వచ్చిన వాళ్లను చిన్న చూపు చూడకండి. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలి. కరోనా లక్షణాలు ఉంటే ఇంట్లో వాళ్లకు దూరంగా ఉండండి. మళ్లీ వారం కొవిడ్ చర్చలో హీరో నాగచైతన్య పాల్గొంటారు. ఆయనకు థ్యాంక్స్. అన్నారు

డాక్టర్ ఇరామ్ జోవర్ మాట్లాడుతూ…కరోనా టైం కాబట్టి దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, వాంతులు, మోషన్స్ , రుచి కోల్పోవడం, వాసన చూడలేకపోవడం వంటి ఏ లక్షణం ఉన్నా వెంటనే కొవిడ్ పరీక్ష చేయించుకోండి. చాలా మంది ఆలస్యం చేస్తున్నారు. ఇది కరోనా కాదు అనుకుంటున్నారు. కావొచ్చు. కానీ కరోనా అయితే మీకు రిస్కు రెట్టింపు అవుతుంది. మీరు టెస్టులు చేయించుకోవడం ఆలస్యమైతే అది మీ ఇంట్లో వాళ్లకు అంటుకుంటుంది. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా కరోనా టెస్టులకు వెళ్లండి. సోషల్ మీడియాలో కరోనా గురించి వచ్చే అనవసర సమాచారం చూసి కంగారు పడకండి. అన్నారు.

సాజయా కాకర్ల మాట్లాడుతూ..కరోనా ఉందని తెలిస్తే గానీ కొన్ని ఆస్పత్రులు రోగులను తీసుకోవడం లేదు. అయితే మేమూ ఈ మధ్య ప్రభుత్వానికి ఒక అభ్యర్థన చేశాం. ఎవరైనా అనారోగ్యంతో ఆస్పత్రికి వస్తే అక్కడే యాంటీజెన్ టెస్టులు చేసి., కరోనా ఉంటే అడ్మిట్ చేసుకోండని చెప్పాం. ప్రభుత్వం ఈ సూచనను అమలులోకి తీసుకుంది. ఇప్పుడు అన్ని పబ్లిక్ హెల్త్ యూనిట్ సెంటర్స్ కొవిడ్ పరీక్షలు, వైద్యం అందిస్తున్నాయి కాబట్టి భయపడకండి. అన్నారు

కొవిడ్ నుంచి కోలుకున్న డ్రైవర్ కృష్ణంరాజు మాట్లాడుతూ…మాది మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్. ఇక్కడ కారు డ్రైవర్ ఉద్యోగం కోసం వచ్చాను. మా సార్ కు కరోనా వచ్చింది, మా మేడమ్ కూడా వైరస్ బారిన పడింది. ఆ తర్వాత వాళ్ల కుటుంబ సభ్యులు నన్ను వారం రోజులు ఐసోలేషన్ కు పంపించారు. టెస్టుల్లో నాకూ కరోనా ఉందని తెలిసింది. నేచర్ క్యూర్ ఆస్పత్రికి వెళ్లాను. మొదట్లో చాలా భయపడ్డా. నా పక్కనున్న వాళ్లు ధైర్యం చెప్పారు. వాళ్లెవరో కూడా తెలియదు. కానీ వాళ్లు చెప్పిన మాటలు నాలో ధైర్యం నింపాయి. ఇప్పుడు నేనూ కొవిడ్ వాట్సాఫ్ గ్రూప్ లో ఉన్నాను. చాలా మందికి ధైర్యం చెబుతున్నాను. ఫ్లాస్మా ఇచ్చేందుకు కూడా సిద్ధమే. అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here