బ్లాక్ బ‌స్ట‌ర్ `పెద‌రాయుడు`కి 25 ఏళ్లు.

0
1225
25 years for blockbuster Pedarayudu movie

భార్యాభర్తల బంధం, అన్నదమ్ముల అనుబంధం గురించి తెలుగు తెరపై ఆవిష్కృతమైన బ్లాక్‌బస్టర్‌ సినిమా ల్లో ‘పెదరాయుడు’ ఒకటి. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో డైలాగ్‌ కింగ్ మోహన్‌బాబు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కీలకపాత్రల్లో న‌టించారు. పాపారాయుడిగా రజనీకాంత్‌ అద్భుత నటన, పెదరాయుడిగా మోహన్‌బాబు యాక్షన్‌, పవర్‌ఫుల్‌ డైలాగులు, భానుప్రియ, సౌందర్య అభినయం ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ‌  సినిమా  ‘పెదరాయుడు’ లో ఎన్నో విశేషాలు.

మోహన్‌బాబు అభిరుచికి నిదర్శనం.
కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో నేపథ్య సంగీతానికి  కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ‘బావవి నువ్వు భామని నేను’ అనే ప్రేమ గీతం, ‘కదిలే కాలమా’ అనే భావోద్వేగ భరితమైన పాట.. ఇలా ప్రతిదీ సూపర్‌ హిట్టే. కోటి అందించిన స్వరాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే సౌందర్య సీమంతం నేపథ్యంలో సాగే ‘కదిలే కాలమా’ అనే పాట మోహన్‌బాబు అభిరుచికి నిదర్శనం. ఎందుకంటే ఆయనే కావాలని ఆ పాటను సినిమాలో పెట్టించారు. సినిమా విడుదలైన తర్వాత ప్రతి తెలుగింటిలోనూ ఈ పాట ఎంతగానో వినిపించింది.

ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా 200 రోజుల ఫంక్షన్
‘పెదరాయుడు’ బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లతో సూపర్‌హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమా 200 రోజుల ఫంక్షన్‌కి ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్రబృందాన్ని ప్రశంసించారు. ఇలా ప్రేక్షకుల నీరాజనం, సినీ ప్రముఖుల ప్రశంసలతో మోహన్‌బాబు కెరీర్‌లో ఎప్పటికీ చెప్పుకునే ఓ చిత్రంగా ఇది నిలిచింది. 15 జూన్ 1995 విడుద‌లైన ఈ చిత్రం నేటితో 25 ఏళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా క‌లెక్ష‌న్ కింగ్ మోహన్‌బాబు ఆ చిత్రం గురించి చెప్పిన విశేషాలు…

తొలి కాపీ అన్నయ్యకు చూపించాను.
‘‘మా అన్నయ్య నందమూరి తారక రామారావుగారి చేతుల మీదుగా నా చిత్రనిర్మాణ సంస్థ శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ ప్రారంభమైంది. ‘ప్రతిజ్ఞ’ నిర్మాతగా నా తొలి సినిమా. 1995 వరకూ ఆ బేన‌ర్ ఎన్నో చిత్రాలు తీశాను. విజయాలు, అపజయాలు చవి చూశాను. 1995లో ‘పెదరాయుడు’ చిత్రం తీశాను. జూన్‌ 15న ఆ సినిమా విడుదలైంది. అప్పటివరకూ తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న రికార్డులన్నీ అధిగమించి, అత్యధిక వసూళ్లు సాధించిందీ చిత్రం.

ర‌జనీ కారణంగానే రీమేక్‌ హక్కులు కొనగలిగాను.
తమిళంలో ఘనవిజయం సాధించిన ‘నాటామై’ చిత్రం హక్కులు కొని ఈ సినిమా తీశాం. నా స్నేహితుడు రజనీకాంత్‌ కారణంగానే ఆ సినిమా రీమేక్‌ హక్కులు కొనగలిగాను. ‘నాటామై’ చూసిన వెంటనే రజనీ నాకు ఫోన్‌ చేసి, ఆ సినిమా చూడమని చెప్పాడు. చూశాను. అద్భుతంగా ఉంది. వెంటనే రజనీని కలిశాను. ‘ఆ చిత్రనిర్మాత ఆర్‌.బి.చౌదరితో మాట్లాడాను. నువ్వు వెళ్లి రీమేక్‌ రైట్స్‌ తీసుకో’ అని చెప్పాడు రజనీ. ఆర్‌.బి. చౌదరిని కలిసి, మాట్లాడి ‘నాటామై’ హక్కులు కొన్నాను.

అలా మొదలైంది
ఇక ఈ సినిమాకు దర్శకుడెవరా అని ఆలోచించినప్పుడు నా స్నేహితుడు రవిరాజా పినిశెట్టి మదిలో మెదిలాడు. మంచి దర్శకుడు. ఈ సినిమాకు సరైన న్యాయం చేయగల వ్యక్తి అని భావించి అతనికి ఫోన్‌ చేశాను. ‘నాటామై’ గురించి చెప్పి, ఆ సినిమా చూడమన్నాను. చూశాడు. అంతకుముందు తన సొంత బేనరులో నాతో ‘ఎం.ధర్మరాజు ఎం.ఎ.’ సినిమా తీశాడు. నా బేనరుకు ఓ సినిమా చేయాలి. అందుకే ఈ సినిమా చేయమని అడిగాను. ‘అంతా బాగానే ఉంది కానీ.. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఒక రోజు టైమ్‌ ఇవ్వు ఆలోచించుకొని చెబుతా’ అన్నాడు రవిరాజా. వెంటనే సరేననకుండా అతను అలా అనేసరికి నాకు కోపం వచ్చి దర్శకుడు బి.గోపాల్‌కు కబురు చేశాను. అతను నాకు అసెంబ్లీ రౌడీ’ సినిమా చేశాడు. 25 వారాలు ఆడింది. బి.గోపాల్‌ రాగానే ‘నాటామై’ చిత్రం గురించి చెప్పాను. ఆ సినిమా చూడకుండానే ‘అన్నా.. ప్రస్తుతం నేను వేరే సినిమా చేస్తున్నాను. డేట్స్‌ కుదరవేమో’ అని చెప్పి తప్పించుకొన్నాడు. ఆ మర్నాడు మళ్లీ రవిరాజా వచ్చి సినిమా చేస్తానని చెప్పాడు. అలా మొదలైంది ‘పెదరాయుడు’ చిత్రం.

ఇక సినిమాలో తండ్రి పాత్ర ఉంది. ర‌జినీ దగ్గ‌ర‌కి వెళ్లి ఆ పాత్ర గురించే ఆలోచిస్తున్నా.. అని చెప్పాను. నువ్వు ఆలోచించేదేంట్రా ఆ పాత్ర నేనే చేస్తాను.. అందుకే ఈ సినిమా గురించి నీకు చెప్పాను అని చెప్పాడు. ఆయ‌నే స్వంత డ‌బ్బుతో ఆ గెట‌ప్ లో రెడీ అయ్యి ఫోటో తీసి పంపాడు. చూసి షాక్ అయ్యాను. అంత సిన్సియారిటి ఉన్న వ్య‌క్తి హ్యాట్సాఫ్ టు హిమ్‌. అటువంటి స్నేహితుడు నాకు దొర‌క‌డం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాకు టైటిల్‌ సూచించింది కూడా రజనీకాంతే. ‘పెదరాయుడు’ సంచలన విజయం సాధించింది.

అప్పుడే 25 ఏళ్లయిందా..
‘పెదరాయుడు’ చిత్రానికి అన్న ఎన్టీఆర్‌గారు క్లాప్‌ ఇచ్చారు. తొలి షాట్‌లో రజనీకాంత్‌కి నేను పూలమాల వేయాలి.. ఎందుకంటే తండ్రి కాబట్టి. నేను పూలమాల సగం వేయగానే వాడు దాన్ని అందుకుని నాకు వేసి కాళ్లకు దండం పెట్టాడు.. ‘నేను దండం పెట్టింది నీ మంచి మనసుకు.. ఈ సినిమా మంచి హిట్‌ అవుతుంది’ అన్నాడు రజనీ.

ప్ర‌తి షాట్ అద్భుతం
డైరెక్టర్‌ రవిరాజా పినిశెట్టి ప్ర‌తి షాట్ అద్భుతంగా తీశారు. భార్యాభర్తలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలో చెప్పిన సినిమా ఇది. నటీనటులందరూ బాగా సహకరించారు. తొలి కాపీ రాగానే అన్నయ్యకు చూపించాను. ‘అద్భుతం బ్రదర్‌… గొప్ప విజయాన్ని సాధిస్తుంది’ అని అభినందించారాయన. ఆయన మాటే నిజమైంది. సినిమా చ‌రిత్ర‌లో సువ‌ర్ణ అక్ష‌రాల‌తో రాయ‌ద‌గ్గ సినిమా పెద‌రాయుడు. నా కెంతో కీర్తి ప్ర‌తిష్ఠ‌ల‌ను సంపాదించి పెట్టిన ఆ సినిమా విడుదలై అప్పుడే 25 ఏళ్లయిందా అనిపిస్తోంది. నేను, రజనీకాంత్, భానుప్రియ, బ్రహ్మానందం, బాబూమోహన్, సంగీత దర్శకుడు కోటి కలిసి ఘనంగా ఓ వేడుక చేద్దామనిపించింది. దురదృష్టం ఏంటంటే తొలి క్లాప్‌ కొట్టిన అన్నయ్య (ఎన్టీఆర్‌) లేరు. సౌందర్య, కెమెరామేన్‌ కేఎస్‌ ప్రకాశ్‌రావు లేరు. కరోనా నేపథ్యంలో గెట్‌ టు గెదర్‌ లాంటివి ఉండొద్దు కాబట్టి వేడుక చేయడం లేదు…

హిట్‌ డైలాగ్స్‌.
* పిల్లల్ని పెంచడం మన కర్తవ్యం.. మనకు పుట్టారుగాబట్టి..పెళ్లాన్ని పోషించడం మన బాధ్యత.. మనల్ని నమ్మకొని వచ్చిందిగాబట్టి.. తల్లిదండ్రుల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం మన ధర్మం.. వాళ్లు మనకు జన్మనిచ్చారుగాబట్టి.. మనల్ని చూసి వాళ్లు గర్వపడాలిగానీ సిగ్గుపడకూడదురా.

* న్యాయానికి బంధం బంధుత్వం ఒకటే. ఒప్పు చేసినవాడు బంధువు, తప్పు చేసిన వాడు శత్రువు

* భారతి.. భార్యాభర్తల సంబంధం గురించి కుటుంబసభ్యుల అనుబంధం గురించి ఓ ఇంగ్లీష్‌ కవి ఏమన్నారో తెలుసా..!
The relationship between two persons of a family must be like fish and water, but it should not like a fish and a fisherman.
ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న చదువు.. నీకు ఇంగ్లీషులో చెబితే అర్థమౌతుందని చెప్పాను. గ్రామర్‌ తప్పులుంటే మన్నించు.. అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు..!
* ఆపరా…అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తా! నా క‌ళ్ళ‌లోకి చూసి సూటిగా మాట్లాడ్డానికి భ‌య‌పడే నువ్వు..నా తీర్పుకే ఎదురు చెప్తావా..ప్రాణాలు తీస్తా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here