ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్న యువ సక్సెఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఇటీవల సంక్రాంతి పండుగ కానుకగా సూపర్ స్టార్ మహేష్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ సరిలేరు నీకెవ్వరుతో మరొక హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. గత ఏడాది సంక్రాంతికి విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ఎఫ్2 తో మంచి హిట్ ని అందుకున్న అనిల్, ప్రస్తుతం దానికి కొనసాగింపుగా ఎఫ్3 మూవీ కథ సిద్ధం చేసే పనిలో నిమగ్నం అయి ఉన్నారు.
కాగా నేడు ఈ సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఒక ప్రముఖ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రేక్షకులతో పంచుకున్నారు అనిల్. ప్రస్తుతం తమ సొంత ఊళ్ళో ఎఫ్3 కథ సిద్ధం చేస్తున్నానని, ఈ సినిమా ద్వారా ఇటీవల బాలీవుడ్ లో వచ్చిన గోల్ మాల్, హౌస్ ఫుల్ సినిమాల మాదిరిగా ఫ్రాంచైజీలు తీసుకురావాలనేది తన ఆలోచన అని అన్నారు అనిల్. ఇక ఎఫ్2 లోని పాత్రలే ఇందులోనూ ఉంటాయి, దానితో పాటు సినిమా ట్యాగ్ లైన్ లో చెప్పినట్లు ఇందులో కూడా ఫన్, ఫ్రస్ట్రేషన్ రెండూ ఉంటాయన్నారు.
వెంకటేష్ గారిని కోబ్రో అని వరుణ్ ఎందుకు పిలిచారు, అలానే వెంకటేష్ గారు వెంకీ ఆసన్ ఎందుకు వేశారు వంటి అంశాలు ఇందులో మరింత ఆసక్తికరంగా ఉండడంతో పాటు, ముఖ్యంగా ఈ సినిమా కథకు మంచి థీమ్ దొరికిందని అన్నారు. అయితే గత కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తలను బట్టి ఇందులో మరొక హీరో కూడా నటిస్తున్నారని అంటున్నారు, అది నిజమేనా అని అడుగగా, నిజానికి ఇప్పటివరకు మొదటి అర్ధ భాగం పూర్తయిన మేరకు అటువంటిది ఏమి లేదని, అయితే రెండవ అర్ధ భాగం రాయడం మొదలెట్టిన తరువాత మూడవ హీరో అవసరం ఉంటె ఆ పాత్రను చేర్చడం జరుగుతుందని, ఈ విధంగా దర్శకుడు అనిల్ ఎఫ్3 గురించి పలు విషయాలను వెల్లడించడం జరిగింది….!!



