కథానాయిక లావణ్యా త్రిపాఠి కెరీర్‌లో కొత్త దశ ప్రారంభమైంది. ‘అందాల రాక్షసి’, ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘అర్జున్ సురవరం’ తదితర విజయవంతమైన చిత్రాల్లో అందంతో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో ఆమె నటించారు. నటిగా చక్కటి పేరు సొంతం చేసుకున్నారు. ఇప్పుడు కథానాయికగా లావణ్యా త్రిపాఠి ప్రతిభపై పలువురు దర్శక నిర్మాతలు నమ్మకం ఉంచుతున్నారు. దాంతో వైవిధ్యమైన పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నారు. ఒకటి… ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. రెండు… ‘చావు కబురు చల్లగా…!’
సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ హాకీ నేపథ్యంలో రూపొందుతోంది. అందులో లావణ్యా త్రిపాఠి హాకీ క్రీడాకారిణిగా కనిపించనున్నారు. క్యారెక్టర్‌లో పర్‌ఫెక్షన్ కోసం హాకీ కోర్టులో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇతర సినిమాల షూటింగులతో బిజీగా ఉన్నప్పటికీ ఒక్క రోజు కూడా హాకీ శిక్షణకు డుమ్మా కొట్టడం లేదు. అవసరమైతే ఒక్కో రోజు రెండు గంటలు తక్కువ నిద్రపోతున్నారు. రెండే గంటలు నిద్రపోతున్నారు. కానీ, హాకీ ప్రాక్టీస్ మాత్రం మానడం లేదు. తెలుగు సినిమాలతో పాటు ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి ఒక తమిళ సినిమా కూడా చేస్తున్నారు. రోజంతా చెన్నైలో తమిళ సినిమా షూటింగ్ చేసి, నైట్ ఫ్లయిట్ క్యాచ్ చేసి హైదరాబాద్ వస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ హాకీ ప్రాక్టీస్ చేసి, మళ్లీ చెన్నై వెళ్లి తమిళ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఒక వారం రోజులు ఈ విధంగా చేశారు. ఇటీవల ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేశారు. లావణ్యా త్రిపాఠి హార్డ్ వర్క్, డెడికేషన్ చూసిన సినిమా యూనిట్ ఆమెను అభినందిస్తున్నారు.
‘ఏ1 ఎక్స్‌ప్రెస్’తో పాటు లావణ్యా త్రిపాఠి నటిస్తున్న మరో తెలుగు సినిమా ‘చావు కబురు చల్లగా…!’. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పతాకంపై కార్తికేయ హీరోగా రూపొందుతోంది. గీతా ఆర్ట్స్ సంస్థలో ‘భలే భలే మగాడివోయ్’, ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమాల తర్వాత కథానాయిక లావణ్యా త్రిపాఠి నటిస్తున్న సినిమా ఇది. డార్క్ కామెడీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటివరకూ చేయనటువంటి పాత్రలో ఆమె కనిపించనున్నారు.