మాస్ మహారాజా రవితేజ, వి.ఐ.ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా..‘డిస్కోరాజా’.. సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ హీరోయిన్స్ కాగా ప్రముఖ తమిళ నటుడు బాబీ సింహా నెగటివ్ పాత్రలో కనిపించనున్నారు. జనవరి 24న విడుదలవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం..
నేపథ్యం!
* మా పేరెంట్స్ నేటివ్ మచిలీపట్నం. అయితే నేను పుట్టింది హైదరాబాదే. కానీ ఆ తరువాత మా ఫ్యామిలీ కోడై కెనాల్ లో సెటిల్ అయింది. కోడై కెనాల్ లో మా పేరెంట్స్ వ్యవసాయం చేసేవారు. నేను యాక్టర్ అవుదామని నిర్ణయించుకున్నాక 2005 లో చెన్నై కి వెళ్ళాను. చాలా ప్రయత్నాలు చేశాను. అలా అవకాశాలు వచ్చాయి.
*‘డిస్కో రాజా’ గురించి
– మాస్ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో డిస్కో రాజా ఉండబోతుంది. సినిమా టైటిల్ కమర్షియల్ గా ఉన్నప్పటికీ సినిమాలో మాత్రం మంచి కంటెంట్ ఉంది. మా డైరెక్టర్ వి ఐ ఆనంద్ గారి శైలిలో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. వి.ఐ ఆనంద్ గారు కంటెంట్ ఓరియెంటెడ్ డైరెక్టర్ `ఎక్కడికిపోతావ్ చిన్నవాడా`,`ఒక్క క్షణం` సినిమాలు దానికి ఉదాహరణ. ఆయన వేరీ కూల్ మరియు క్రియేటివ్, ఇప్పటివరకు నేనొక 40-45 సినిమాలు చేశాను. నా బెస్ట్ డైరెక్టర్స్ లిస్ట్ లో వి.ఐ ఆనంద్ కూడా ఒకరు. ఆయన క్లారిటీ ప్రెజెంటేషన్ అద్భుతంగా ఉంటుంది. ఫుల్ మాస్ అండ్ కామెడీతో సాగుతూనే ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా భిన్నంగా ఉంటుంది.
మీ రోల్ ఎలా ఉండబోతుంది. సీరియస్ గా ఉంటుందా ? లేక ఫన్ కూడా మిక్స్ అయి ఉంటుందా?
– అన్ని ఉంటాయి అండి. జోవియల్, సీరియస్ అండ్ నా శైలి యాక్టింగ్ ఇలా అన్ని ఉంటాయి. ఈ సినిమాలో ‘బర్మా సేతు’ అనే క్యారెక్టర్ చేస్తున్నాను. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో నా రోల్ కాస్త కొత్తగా కూడా ఉంటుంది. నేను కూడా కొత్తగా కనిపిస్తాను, అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను.
రవితేజగారి ఎనర్జీ గురించి?
– రవితేజగారిది వెరీ వెరీ పాజిటివ్ ఎనర్జీ అండి. ఆయన మార్క్ యాక్టింగ్ సినిమాలో చాలా బాగా అలరిస్తోంది. ఇక ఆయనలో నాకు బాగా నచ్చింది ఆయన టైమ్ సెన్స్ అండ్ జన్యూనిటీ. టైమింగ్, టైం మేనేజేమెంట్, పంక్చువాలిటి విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారాయన.
మీరు ఇండస్ట్రీకి హీరో అవ్వాలని వచ్చారా లేక విలన్ అవ్వాలనా?
-నేను యాక్టర్ అవుదామనే వచ్చాను. కానీ మధ్యలో హీరోగా అవకాశాలు వచ్చాయి, చేశాను. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.
యాక్టర్స్ లో మీకు ఇన్స్‌పిరేషన్ ఎవరు?
– రజినీకాంత్ సర్. నాకు ప్రేరణ అంటే ఆయనే. ఆయనతో నటించాలనే నా కల `పేట` సినిమాతో నెరవేరింది. కమల్ హాసన్ గారు కూడా ఇష్టమే. ఇప్పుడు కమలహాసన్ సర్ తో ఇండియన్-2 లో చేస్తున్నాను. చిరంజీవిగారు ఇష్టం.. ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. ప్రతి ఒక్కరూ నుండి ఏదోకటి నేర్చుకుంటాను.
జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు కదా ?
– అవును చేశాను. రోజుకు 250 రూపాయిల కోసం పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. వాటితో చాలా హ్యాపీగా ఉండేది, నేను ఫ్రేమ్ లో ఆ చివర నిలబడ్డాను నేను ఈ రోజు 250 సంపాదించాను అనుకునే దానిలో చాలా ఆనందం ఉంది ఆ రోజులు గురించి ఇప్పుడు తల్చుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తోంది. కానీ ప్రస్తుతం రోజులు మారాయి. సోషల్ మీడియా వల్ల అవకాశాలు పెరిగాయి. ఒక చిన్న వీడియో వల్ల కూడా మన టాలెంట్ చూపించొచ్చు. అంటూ ఇంటర్వ్యూ ముగించారు.