యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, హీరోలుగా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా భారీ హిస్టారికల్ మల్టీస్టారర్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో టాలీవుడ్ తో పాటు పలువురు కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నటులు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, తెలంగాణ విప్లవ వీరుడు కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇకపోతే నేడు ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ, ఆర్ఆర్ఆర్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైన సినిమా అని, రాజమౌళి గారు ఈ సినిమాను ఎంతో గొప్పగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ సినిమాలో అల్లూరి పాత్రలో నటించడం కోసం తన శరీరం, ఆహార్యం, నడవడిక వంటి వాటిని కొంత మార్చుకునేందుకు ఎంతో కష్టపడ్డానని, ఆ విధంగా ఆ పాత్రలోకి నేను పరకాయ ప్రవేశం చేసేలా సాయం అందించిన దర్శకుడు రాజమౌళికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు చరణ్. అలానే తప్పకుండా ఇది ప్రేక్షకులు మెచ్చే సినిమా అవుతుందని చరణ్ ఆశాభావం వ్యక్తం చేసారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ భారీ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తుండగా, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జులై 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు…..!!