‘వెంకీమామ’ చిత్రాన్ని నా లైఫ్‌లా ఫీలై చేశాను – యంగ్ డైరెక్టర్ బాబీ

0
759

‘పవర్‌’, ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’, ‘జై లవకుశ’ వంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ డైరెక్టర్ బాబీ. ప్రస్తుతం విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య ల మ‌ల్టీస్టారర్ `వెంకీమామ‌` కి దర్శకత్వం వహించారు. రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఇద్ద‌రి హీరోల అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 13న వరల్డ్ వైడ్ గా విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు బాబీ ఇంటర్వ్యూ..

ఈ ప్రాజెక్ట్ లోకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు?
– ఈ కథలోకి నేను అనుకోకుండా వచ్చా. నిర్మాత సురేష్‌బాబు నాకీ అవకాశమిచ్చారు. నిజానికి ‘జై లవకుశ’ తర్వాత ఓ అగ్ర హీరోతో సినిమా చెయ్యాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నా. ఆ సమయంలోనే కోన వెంకట్‌ నన్ను కలిసి ఈ ప్రాజెక్టు గురించి చెప్పారు. ‘సురేష్‌బాబు గారు వెంకటేష్‌-నాగచైతన్యలతో మామా అల్లుళ్ల చిత్రమొకటి చేద్దామనుకుంటున్నారు. ఓసారి నువ్వు వెళ్లి కథ వినొచ్చుగా’ అని కోన నాకు సలహా ఇచ్చారు. దాంతో వెళ్లి కథ విన్నా. తర్వాత నా బృందంతో కలిసి కూర్చొని కథలో కొన్ని మార్పులు చేసి సురేష్‌ గారికి చెప్పాం. ఆయనకది బాగా నచ్చడంతో వెంట‌నే సినిమాను పట్టాలెక్కించాం.

ఈ సినిమా రామానాయుడు గారి డ్రీమ్ కదా! ఈ అవకాశం మీకు దక్కడం ఎలా అనిపించింది?
– ఇది నాకు దక్కిన చాలా పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను.. గొప్ప గౌరవం కూడా. ఈ కథ నాకు ఇచ్చినప్పుడే సురేష్ గారు మా నాన్న కలల బాధ్యతని నీ చేతుల్లో పెడుతున్నాం అని చెప్పారు. ఆ క్షణం చాలా సంతోషంగా అనిపించింది. నేనూ ఈ చిత్రాన్ని నా లైఫ్‌లా ఫీలై చేశా. నా బలం ఏంటో ప్రేక్షకులకు చూపించాలి అని కసితో ఇంకాస్త ఎక్కువే కష్టపడ్డాను.

వెంకీమామ టైటిల్‌ ఆలోచన ఎవరిది?
– ఓరోజు సురేష్‌ సర్‌ ఫోన్‌ చేసి పేరు గురించి ఏం ఆలోచించావు అన్నారు. ఇంకా ఏం అనుకోలేదన్నా. సరే.. ‘‘వెంకీమామ’ ఎలా ఉంది? చైతూ ఎప్పుడూ వెంకటేష్‌ను అలాగే పిలుస్తుంటాడు. ఈ పేరు ఓకేనా అన్నారు. ఆ పేరులోనే కథ ఉంది. సినిమాలోని విషయాన్ని ఉన్నదున్నట్లు చెప్పేస్తుంది. మరో ఆలోచన లేకుండా ఇదే పెట్టేద్దాం సర్‌ అన్నా.

ఈ చిత్రంలో వెంకటేష్‌ – చైతూ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి?
– పల్లెటూరి నేపథ్యంగా సాగే మామా అల్లుళ్ల కథ ఇది. వెంకటేష్‌ మిలటరీ నాయుడుగా కనిపిస్తారు. ఆయన నమ్మేది రెండిటినే. ఒకటి కిసాన్‌.. రెండు సోల్జర్‌. నాగచైతన్య సిటీ నుంచి పల్లెటూరికి వచ్చిన అబ్బాయిగా కనిపిస్తాడు. మేనమామ చాటు బిడ్డగా పెరిగిన అతను మిలటరీకి ఎందుకు వెళ్లాడు? వెంకీమామకు మిలటరీకి సంబంధం ఏంటి? ఊరిలో వీళ్లిద్దరూ ఏం చేశారు? ఈ మామా అల్లుళ్ల అనుబంధమేంటి? వంటి అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. ఆద్యంతం వినోదాత్మకంగా, భావోద్వేగాల సమ్మేళనంగా సాగుతుంది. వెంకీ, చైతూ ఇద్దరి పాత్రలకీ సరిసమానమైన ప్రాధాన్యం ఉంటుంది. ఒకరెక్కువ తక్కువ అని ఏం ఉండదు. ఈ కథ రాసుకున్నప్పుడు మదిలో ఒకటే అనుకున్నా.. చిత్రం చూసిన ప్రతిఒక్కరికీ తమ మేనమామలు, మేనల్లుళ్లు గుర్తుకు రావాలని అనుకున్నా.

హీరోయిన్స్ గా పాయల్‌ రాజ్‌పుత్, రాశీ ఖన్నా ఎవరి ఛాయిస్?
– ఇద్దరూ అనుకోకుండానే కథలోకి వచ్చారు. వెంకీ సరసన కనిపించబోయే నాయిక టీచర్‌ కాబట్టి పరిణతితో కూడిన భావాలతో కనిపిస్తూనే గ్లామర్‌గానూ ఉండాలి. ఆ లక్షణాలు నాకు పాయల్‌ రాజ్‌పుత్‌లో కనిపించాయి. నిజానికి ఈ పాత్రకు ఆమెను నాకు తొలుత సూచించింది తమన్‌. తనే పాయల్‌ ఫొటోని నాకు పంపించాడు. అది చూడగానే వెంకీకి ఆమె సరిగ్గా సరిపోతుందనిపించింది. రాశీ ఖన్నా పాత్రకి ముందు ఇద్దరు ముగ్గుర్ని అనుకున్నాం. కానీ, ఆఖరి నిమిషంలో రాశీకి ఫిక్స్‌ అయ్యాం.

‘సినిమాలో ప్రధాన ఆకర్షణలు ఏంటి?
– కథలో బలం ఉంది. ‘మనం’లోని భావోద్వేగాలు, ‘ఎఫ్‌2’లోని వినోదం వీటన్నిటికీ తోడు చక్కనైన యాక్షన్‌ అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత వెంకటేష్‌లోని పూరి మాస్‌ కోణాన్ని ఈ చిత్రంతో చూడొచ్చు. ఆయన ‘లక్ష్మీ’ తర్వాత అంత మాస్‌ పాత్రని మళ్లీ చెయ్యలేదు. నాకు ఆ సినిమా బాగా ఇష్టం. ఇందులో ఆ మాస్‌ కోణాన్ని బాగా చూపించా.

సినిమా చూసి దగ్గుబాటి, అక్కినేని కుటుంబ సభ్యులు ఏమన్నారు?
– నాగార్జున గారు ఇంకా చూడలేదు. వెంకటేష్, చైతన్య, సురేష్‌బాబు, తమన్‌ అందరూ చూశారు. చాలా సంతోషంగా ఫీలయ్యారు. సురేష్‌ సర్‌ ఎప్పుడూ బహిరంగంగా పొగడటం వంటివి చెయ్యరు. కానీ, సినిమా చూశాక ఆయన చాలా సంతృప్తిగా కనిపించారు. వెంకీ.. చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లావన్నారు. చైతూ.. గట్టిగా కౌగిలించుకోని థ్యాంక్స్‌ చెప్పారు. రవితేజ తర్వాత నాకు థ్యాంక్స్‌ చెప్పిన హీరో ఆయనే. ఇవన్నీ నాకెంతో తృప్తిని, ఆనందాన్ని కలిగించాయి.

కాశ్మీర్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలెట్ అని తెలుస్తోంది. దాని గురించి చెప్పండి?
– ‘వెంకీమామ’ చిత్రీకరణ మొత్తంలో చాలా సవాల్‌గా నిలిచింది కశ్మీర్‌ ఎపిసోడ్‌. అక్కడి గ్లేషియర్‌ అనే పర్వత శిఖరాల్లో 13 రోజుల పాటు యాక్షన్‌ సన్నివేశాల్ని చిత్రీకరించాం. నిజానికి వాటిని దూరం నుంచి చూడటానికి ఎంత బాగుంటాయో.. అక్కడికి వెళ్లి చిత్రీకరణ జరపడం అంత కష్టం. ఆ మంచులో అంతెత్తున్న పర్వతంపైకి ఎక్కడమంటే మాటలు కాదు. హీరోలు, సిబ్బంది ఎవరైనా పై వరకు నడిచి వెళ్లవలసిందే. ఉదయం 5 గంటలకు బయలు దేరితే మా సిబ్బందితో, సామాగ్రిని వేసుకోని అక్కడికి చేరుకోవడానికి 9 గంటలయ్యేది. అందుకే ముందు అక్కడ చిత్రీకరణ అనుకున్నప్పుడు ఇదంతా రిస్క్‌ వద్దులే అన్నా. కానీ, సురేష్‌ గారు ఎంత కష్టమైనా పర్లేదు అక్కడే చేద్దాం అని ప్రోత్సహించడం, వెంకీ – చైతూలు సైతం సై అనడంతో చిత్రీకరణ పూర్తి చేశాం. రామ్‌ – లక్ష్మణ ఆధ్వర్యంలో తెరకెక్కించిన ఈ పోరాట ఘట్టాలు చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

మీరు ఎక్కువగా ఏ తరహా జోనర్‌లని ఇష్టపడతారు?
– వాణిజ్యాంశాలున్న చిత్రాల్ని తెరకెక్కించడానికే ఎక్కువ ఇష్టపడుతుంటా. ఒకవేళ ఇది కాకుండా మరేదైనా చెయ్యాల్సి వస్తే భావోద్వేగాలతో నిండిన కథ చేస్తా. ‘వెంకీమామ’తో ఓ సరికొత్త ప్రయత్నాన్ని చేశా. దాన్ని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అని ఆతృతగా ఎదురుచూస్తున్నా.

మీ నెక్ట్స్‌ప్రాజెక్ట్?
– ప్రస్తుతానికి నా దగ్గర రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఈ చిత్రం విడుదలైన తర్వాతే వాటిపై నిర్ణయం తీసుకుంటా. అంటూ ఇంటర్వ్యూ ముగించారు దర్శకుడు బాబీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here