ప్రతిష్టాత్మకమైన ‘ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్’ నా చేతుల మీదుగా అందించడం గౌరవంగా భావిస్తున్నాను – మెగా స్టార్ చిరంజీవి.( 2018 శ్రీదేవి తరపున బోని కపూర్, 2019 నటి రేఖ)

0
872

సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో `ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డు` ఒకటి. నటసామ్రాట్‌, డా. అక్కినేని నాగేశ్వరరావుగారి గౌరవార్థం అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ చేత స్థాపించబడింది. ఈ అవార్డు ఒక వ్యక్తి జీవితకాల విజయాలు, భారతీయ చిత్ర పరిశ్రమకు చేసిన కృషికిగాను అందజేయబడుతుంది. 2018 సంవత్సరానికిగాను ఈ అవార్డును ప్రముఖ నటి శ్రీదేవి, 2019 సంవత్సరానికి గాను నటి రేఖకు ఈ అవార్డు లభించింది. న‌వంబ‌ర్‌17న అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఈ కార్య‌క్ర‌మం అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై ఈ అవార్డ్ ను శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీ కపూర్, నటి రేఖ లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో…

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ – ” సినిమా మాత్రమే నాకు తల్లి తండ్రి, అదే నాకు అన్నీ ఇచ్చింది. కృతజ్ఞతగా ఆ తల్లి ఋణం తీర్చుకోవడానికి ఒక అవార్డ్ స్థాపించడం జరిగింది. సినిమా రంగానికి తమ సేవలతో గౌరవం తెచ్చే వారికి ఇవ్వాలని ‘ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్’ సృష్టించబడింది. ఇవి ఈ అవార్డ్స్ గురించి నాన్న చెప్పిన మాటలు. ఆయన సంకల్పమే మమ్మల్ని నడిపిస్తుంది. ఆయన ఆలోచనలే మేము ఆచరిస్తున్నాము. సినిమా రంగానికి తమ సేవలతో గౌరవం తెచ్చే వారికి ఈ ‘ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్’ ఇచ్చి వారిని సగౌరవంగా సన్మానించుకొని వారి పేరుతో పాటు నాన్న పేరు కూడా చిరకాలం ఉండేలా ఈ అవార్డు కార్యక్రమం జరుగుతుంది. శ్రీదేవిగారికి, రేఖ గారికి ఈ అవార్డ్ ఇవ్వాలని నాన్న ఎప్పుడూ చెప్తుండేవారు. ఆయన ఉన్నప్పుడు ఈ అవార్డ్ ఇవ్వలేక పోయాం. కానీ తెలుగు సినిమా ఉన్నంత వరకూ ఈ అవార్డ్ ఉంటుంది. ఈ వేదిక మీద అవార్డ్ తో పాటు నాన్న ఇక్కడే మనమధ్యనే ఉన్నారు. ఆయన సంకల్పం నెరవేరుతుందని చాలా సంతోషిస్తున్నారు. సుబ్బరామిరెడ్డిగారిలో ఒక గమ్మత్తైన క్వాలిటీ ఉంది. నాన్నగారికి ఎంత క్లోజ్‌ ఫ్రెండో అందరికీ అంతే క్లోజ్ గా ఉంటారు. `పూల రెక్కలు , కొన్ని తేనే చుక్కలు రంగరిస్తివో ఒక బొమ్మ చేస్తివో ‘ ఇవి శ్రీదేవి మీద సీతారామశాస్రి గారు రాసిన పదాలు. అవి అక్షరాలనిజం. శ్రీదేవి తో నేను నాలుగు సినిమాలు చేశాను. మొదటి సినిమా ‘ఆఖరి పోరాటం’. ఆవిడ సెట్ కి వస్తున్నప్పుడు అప్పటిదాకా గొడవ గొడవగా ఉండే సెట్ సైలెంట్ గా అయిపోయేది. శ్రీదేవి ‘ది గాడెస్ ఆఫ్ గ్రేస్’. శ్రీదేవి గారికి దేవుడిచ్చిన అందం అభినయం ఆమె అదృష్టం అన్నారు. కానీ దానికన్నా ఎక్కువ అదృష్టం బోని కపూర్ గారు భర్తగా లభించడం. వారిద్దరూ నాకు చాలా కాలంగా తెలుసు. ‘హిమ్మత్ వాలా’ అనే సినిమా ఆమెను హిందీలో స్టార్ ని చేస్తే బోని కపూర్ గారు తీసిన’ మిస్టర్ ఇండియా’ ఆమెను నేషనల్ సూపర్ స్టార్ గా చేసింది. సినిమా పరిశ్రమ ఉన్నంత వరకూ ఎఎన్‌ఆర్‌ గారు, శ్రీదేవి గారు బ్రతికే ఉంటారు. అలాగే రేఖ గారి మొదటి సినిమా ఒక తెలుగు సినిమా’రంగుల రాట్నం’. రేఖ గారు మనసు ఎంత మంచిది అంతే శ్రీదేవి గారు ‘ఆఖరి రాస్తా’ హిందీ సినిమాకి రేఖ గారు డబ్బింగ్ చెప్పారు. ఆమెకి ఈ అవార్డ్ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈరోజు మా ముఖ్య అతిధి పద్మభూషణ్ చిరంజీవి గారు, మా అన్నయ్య, నాకు అత్యంత ఆత్మీయులు. చిరంజీవి గారితో నాకున్న అనుబంధం గురించి మాటల్లో చెప్పలేను. ఈ అవార్డ్ కి పిలవగానే యూఎస్ ట్రిప్ మానుకొని ఇక్కడికి వచ్చారు” అన్నారు.

ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్ క‌మిటి చైర్మ‌న్, కళాబంధు డా. టి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – ఈ రోజు ఈ అవార్డ్ ఫంక్షన్ ని దేవలోకం నుండి, కళా ప్రపంచం నుండి నా ఆప్త మహా నటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు గారు చూసి సంబరపడుతూ ఉంటారు. అలాగే ‘సైరా నరసింహరెడ్డి’ గా నటించి యావత్ భారత దేశం గర్వించే విధంగా తెలుగు ఖ్యాతి ని చాటిన మెగాస్టార్ చిరంజీవి గారు ఒకవైపు, అలాగే గొప్ప నిర్మాత, శ్రీదేవి భర్త అయిన బోనీ కపూర్ గారు మరోవైపు ఉన్నారు. ఈరోజు నేను ఎక్కడికి పోయినా నాకు అభిమానులు ఉన్నారంటే అది అక్కినేని నాగేశ్వర రావు గారు నా స్నేహితుడు అవ్వడమే కారణం. అటువంటి అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారు త‌న‌కి `దాదాసాహెబ్‌ ఫాల్కే` అవార్డు వచ్చినప్పుడు నన్ను పిలిచి భవిష్యత్తులో ‘ఎఎన్‌ఆర్ నేష‌న‌ల్ ఫిలిం అవార్డు’ స్థాపించి నేను ఉన్నా, లేకున్నా నాతరంవారిచే నేష‌న‌ల్ లెవ‌ల్‌లో సినీ ప‌రిశ్ర‌మ‌లోని గొప్ప గొప్ప వ్యక్తులకు ఈ అవార్డుని ఇద్దాం అనుకుంటున్నాను అన్నారు. ఆయన ఆఖరి రోజుల్లో నేను శ్రీదేవి, రేఖ లకు ఈ అవార్డ్ ఇవ్వాలని కోరుకున్నారు. ఈరోజు అంత బాద్య‌త‌గా త‌న తండ్రి కోరిక‌ను నెర‌వేరుస్తున్నందుకు నాగార్జున గారిని హృద‌య‌పూర్వ‌కంగా అభినందిస్తున్నాను. అలాగే అందం తో పాటు హృదయ సౌందర్యం ఉన్న నటి. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. అలాగే రేఖ గారు 35 సంవత్సరాలుగా అంతే అందంగా ఉన్నారు. వెరీ డిసిప్లేన్డ్ పర్సనాలిటీ. వీరిద్దరికి ఈ అవార్డ్ ఇవ్వడం హ్యాపీ గా ఉంది“ అన్నారు.

బోని కపూర్ మాట్లాడుతూ – ” అందరికి నమస్కారం. శ్రీ దేవి తరపున ఈ అవార్డ్ అందుకుంటున్నందుకు గర్వంగా ఉంది. ఈ అవార్డ్ ని అందించిన అక్కినేని ఫౌండేషన్, అక్కినేని ఫ్యామిలీ కి అలాగే సుబ్బరామి రెడ్డి గారికి ధన్యవాదాలు “అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – “ఆరుదశాబ్దాల క్రితం ఓ పల్లెటూరిలో నవమాసాలు నిండిన ఓ గర్భవతి ఆమె. ఆ సమయంలో తన అభిమాన నటుడి సినిమా విడుదలైంది. తన అభిమాన నటుడి సినిమా చూడాలని కలలు కన్నది బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమా చూసే అవకాశం ఉండదని అప్పుడే సినిమా చూసి రావాలని భర్తను కోరింది. ఆ భర్త సరే అని గతుకుల రోడ్డులో ఓ జట్కాబండి మీద బయలుదేరారు. మార్గమధ్యలో ప్రమాదం జరిగి కింద పడ్డారు. ఇద్దరికీ గాయాలయ్యాయి అయినా వెనకడుగు వేయకుండా వెళ్లి ఆ సినిమా చూసొచ్చారు. ఈ కథలో గర్భిణి స్త్రీ మా అమ్మ అంజనా దేవి. ఆ భర్త మా నాన్న వెంకటరావుగారు. ఆ కడుపులో ఉన్న వ్యక్తిని నేను! నరసాపురం టౌన్‌లో జరిగిన సంఘటన ఇది. 1955లో నాగేశ్వరరావుగారు నటించిన ‘రోజులు మారాయి’ సినిమా అది. మా అమ్మ గారికి నాగేశ్వర రావు గారు అంటే అంత అభిమానం కాబట్టే నాకు సినిమా అంటే అంత అభిమానం ఏర్పడింది. అందుకే చదువు అయిపోగానే ఇండస్ట్రీ కి రావాలని కోరుకున్నాను, వచ్చాను. ఎన్.టి.ఆర్ గారు ఏఎన్ఆర్ లాంటి లెజెండరీ పర్సన్స్ ఉన్న టైమ్ లో నేను హీరోగా నిలదొక్కుకోవడం హ్యాపీ గా ఉంది. అలాగే నాగేశ్వర రావు గారితో మెకానిక్ అల్లుడు సినిమాలో నటించడం నా అదృష్టం. ఆయన ఈ ఇండస్ట్రీ గురించి చెప్పిన ఎన్నో విషయాల వల్లే నేను ఈ రోజు ఈ స్థానానికి రావడానికి దోహద పడింది. ఆరకంగా నాగేశ్వర రావు గారు నాకు గురు తుల్యులు. ఆయన నడిచే నిగంటువు, ఒక ఎన్సైక్లోపీడియా. అలాంటి మహా నటుడితో నాకు సాంగత్యం ఉండడం నా పూర్వజన్మ సుకృతం. నాగేశ్వర రావు గారు చివరి రోజు వరకూ మానసికంగా, శారీరకంగా ఎంతో బలంగా ఉండేవారు. ఎంతో మంది మహామహులకి ఇస్తున్న ఈ ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డు ఎదో ఒక రోజుకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అంత గొప్ప అవార్డ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాచేతుల మీదుగా శ్రీదేవి, రేఖ లాంటి లెజెండరీ పెర్సొనాలిటీస్ కి ఈ అవార్డ్ ఇవ్వడం ఎంతో సముచితం. ఇంత గొప్ప అవార్డ్ నా చేతుల మీదుగా ఇచ్చే అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి దన్యవాదాలు. ఆవిడతో నేను మూడు నాలుగు సినిమాలు చేశాను. శ్రీదేవి గారు షూటింగ్ లో టైమ్ దొరికితే సినిమా గురించే మాట్లాడేవారు. ఆవిడకి సినిమా గురించి తప్ప మరేమి తెలీదు. ఆవిడ మనమధ్య లేకపోవడం బాధాకరం. అన్ని భారతీయ భాషలలో నటించి లేడీ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ అవార్డ్ ఇచ్చి ఆవిడను మరోసారి గుర్తు చేసుకునే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. అలాగే ఏజ్ లెస్ స్టన్నింగ్ బ్యూటీ రేఖ చేతుల మీదుగా నేను ఫిలిం ఫేర్ అవార్డ్ అందుకున్నాను. అలాగే ఈ సంవత్సరం మా ఇంట్లో జరిగే 80స్ క్లబ్ కి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించడం జరిగింది. ఈ ఎఎన్‌ఆర్‌ నేషనల్‌ అవార్డ్ ఆవిడకి రావడం ఆమెకు గౌరవం, నా చేతుల మీదుగా ఈ అవార్డ్ ఇవ్వడం నాకు గౌరవం. ఈ అవకాశం ఇచ్చిన అక్కినేని ఫ్యామిలీ కి నా హృదయ పూర్వక దన్యవాదాలు” అన్నారు.

నటి రేఖ మాట్లాడుతూ – ” తెలుగులో నేను నటించిన మొదటి సినిమా ‘రంగులరాట్నం’ అని నాగార్జున అన్నారు కానీ నా మొదటి సినిమా ‘ఇంటిగుట్టు’. అప్పుడు నా వయసు ఏడాది మాత్రమే.. ఆ సినిమాలో ఐస్‌ తింటూ, బొమ్మలతో ఆడుకుంటూ చాలా బాగా చేశా.. కావాలంటే అందరూ ఒకసారి ఆ సినిమా చూడండి. నేను ఈ అన్నపూర్ణ స్టూడియోస్లో దాదాపు 10 సంవత్సరాలు గడిపాను. మళ్ళీ ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. నేను చూసిన తొలి సినిమా నాగేశ్వరరావు నటించిన ‘సువర్ణ సుందరి’. కథానాయికగా స్థిరపడ్డానంటే అందుకు నాగేశ్వరావుగారు, అంజలి అత్తయ్య కారణం. నాగేశ్వర రావు గారు నాకు ఇండస్ట్రీ గురించి, నటన గురించి,ఆరోగ్యం గురించి  ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది. అవి నా కెరీర్ కి ఎంతో ఉపయోగపడ్డాయి అన్ని జానర్ల సినిమాలు చేశానంటే సినిమాను సినిమాగా, జీవితాన్ని జీవితంగా చూశా. అందంగా ఉండడం అనేది మా అమ్మానాన్న నుంచి వచ్చిన జీన్స్‌. ‘నువ్వు తెలుగు అమ్మాయివి ఒక్క తెలుగు సినిమా అన్నా చెయ్యాలమ్మా’ అన్న అమ్మ కోరిక మేరకు అంజలిగారితో కలిసి ‘అమ్మకోసం’ చేశా. అమ్మ చివరి రోజుల్లో మరోసారి తెలుగు సినిమా చేయమని కోరింది. త్వరలోనే తెలుగు స్పష్టంగా శ్రీదేవి గారి లాగా నేర్చుకొని  సినిమా చేస్తాను. శ్రీదేవి నా చిన్నారి చెల్లెలులాంటిది. మా ఇద్దరికీ ఈ అవార్డు రావడం ఆనందంగా ఉంది” అన్నారు.

అమల అక్కినేని మాట్లాడుతూ – ” ముందుగా ‘ఎఎన్‌ఆర్‌ అవార్డ్’ శ్రీదేవి గారి తరుపున అందుకున్న బోని కపూర్ గారికి, రేఖ గారికి శుభాకాంక్షలు. అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా స్థాపించి ఏడేళ్ళు అవుతుంది. అది రోజురోజుకీ పెరిగి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ అయింది. ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ స్టూడెంట్స్‌ కూడా వస్తున్నారు. దాదాపు 450 మంది స్టూడెంట్స్‌ ఉన్నారు. వారి గ్రాడ్యుయేషన్‌ సెర్మనీ ఈ అవార్డు ఫంక్షన్‌తో కలిపి చేయడం సంతోషంగా ఉంది” అన్నారు.

ఈ కార్యక్రమంలో 66 మంది అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా స్టూడెంట్స్ కి ప్రముఖ నిర్మాత బోని కపూర్, రేఖ చేతుల మీదుగా గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్స్‌ అందజేశారు.

అనంతరం అమల అక్కినేని, డా. అనురాధ రావు (అన్నపూర్ణ కాలేజ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియా డీన్) గౌరవ వందనం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో.. ఏఎన్ఆర్ గారి కుమార్తె నాగ సుశీల, విజయ్ దేవరకొండ, సుమంత్, నాగచైతన్య, అఖిల్, నిహారిక, మంచు లక్ష్మి, అడివి శేష్, సుశాంత్, శ్రీకాంత్, కార్తికేయ, లావణ్య త్రిపాఠి, నిర్మాత పి.వి.పి, రమేష్ ప్రసాద్, నారాయణదాస్ నారంగ్, బ్రహ్మనందం, సుప్రియ లతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here