‘ఖైదీ నెంబర్ 150 ‘ తో మెగాస్టార్ రీఎంట్రీ తరువాత మెగా అభిమానులు మాత్రమే కాదు.. యావత్ భారతావని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ భారీ హిస్టారికల్ చిత్రాన్ని 270 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నిర్మించాడు. రేనాటి ధీరుడు మజ్జారి నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. మహాత్మా గాంధీ 150 జయంతి సందర్భంగా అక్టోబర్ 2న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో 5 భాషల్లో అత్యంత గ్రాండ్‌గా రిలీజైంది. ట్రైలర్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసి ఇటు మెగా అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ:
ఈ కథ ఝాన్సీ లక్ష్మీభాయి బ్రిటీష్ వారితో ప్రథమ స్వాతంత్య్ర సమరంతో మొదలవుతుంది. ఈ పోరాటం మొదలుపెట్టింది మనం కాదు.. బ్రిటీష్ సైన్యాన్ని వణికించిన రేనాటి ధీరుడు రేనాడు నరసింహారెడ్డి అని వారి సైన్యానికి పిలుపునిస్తుంది. బ్రిటిష్ దొరలు తెలుగు ప్రజలపై పడి.. వారి సొంత భూములలో వెట్టి చాకిరి చేయిస్తూ.. వారికి రావాల్సిన సొమ్ముని అన్యాయంగా స్వాధీనం చేసుకుని.. అష్టకష్టాలు పెడుతున్న రోజులవి. అడ్డం తిరిగిన ప్రజల్ని జాలి, దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీస్తున్న పరిస్థితుల్లో జమిందారీ అయిన ‘సైరా నరసింహా రెడ్డి’ దత్త మండలంలోని 61 మంది పాలెగాళ్లను ఏకం చేసి బ్రిటిష్ వారికి ఎలా ఎదురు తిరిగాడు.? వారిని ఎదుర్కొనడానికి ‘సైరా’కు సాయం చేసిన వీరులు ఎవరెవరు..? ఈ పోరాటంలో నరసింహ రెడ్డి ప్రజల్లో ఎలాంటి చైతన్యాన్ని తీసుకొచ్చి.. విజయం సాధించాడు? అనేది కథాంశం.
నటీనటుల పెర్ఫామెన్స్:
‘సైరా’ సినిమాలో నటన గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా మెగాస్టార్ చిరంజీవి నటన గురించే మాట్లాడాలి. ఫస్ట్ హాఫ్ అంతా జమిందారి పాలెగాడిగా.. సెకండ్ హాఫ్ అంతా బ్రిటిష్ సైన్యంపై తిరుగుబాటు చేసే వీరుడిగా ఆయన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆరు పదుల వయసులో కూడా కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు చేసి ప్రేక్షకులు చేత చప్పట్లు కొట్టించడం ఆయనకే చెల్లింది. సైరా నరసింహ రెడ్డి పాత్రలో మెగాస్టార్‌ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేనంతగా ఆయన నటన ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ పాత్రకి జీవం పోశారు. సైరా నరసింహ రెడ్డి గురువు గోసాయి ఎంకన్న పాత్రలో బిగ్ బి అమితాబ్ నటన సింప్లీ సూపర్బ్. ఆ పాత్రకి హుందాతనాన్ని తెచ్చారు. అలాగే నరసింహారెడ్డి భార్యగా నయన (సిద్ధమ్మ) కూడా బాగా నటించింది. ఈమె క్రేజ్, నటన సినిమాకి అదనపు ఆకర్షణ అవుతుంది. ఇక తమన్నా ఇంతవరకూ చూడని సరికొత్త పాత్రలో అందరికీ పరిచయం అవుతుంది. ప్రతి ప్రేక్షకుడుకి ఆమె పాత్ర కనెక్ట్ అవుతుంది. వీరా రెడ్డి పాత్రలో జగపతి బాబు, రాజా పాండి విజయ్ సేతు పతి, అవుకు రాజు పాత్రలో కిచ్చా సుదీప్ వారివారి పాత్రలలో జీవించారనే చెప్పాలి. అలాగే ఝాన్సీ లక్ష్మీభాయి పాత్రలో అనుష్క ఆడియన్స్‌ని సర్ప్రైజ్ చేస్తుంది. అలాగే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ వాయిస్ ఓవర్ ప్రేక్షకుల్ని మెగాభిమానుల్ని ఆకట్టుకుంటుంది.
సాంకేతిక వర్గం పనితీరు:
స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. సైరా సినిమాను హ్యాండిల్ చేసిన విధానం చాలా బాగుంది. ఇలాంటి చారిత్రాత్మక కథలకు ఎక్కడా డీవియేట్ అవ్వకుండా ఎక్కడా ఎమోషన్ తగ్గకుండా స్క్రీన్ ప్లే నడపడం అనేది అంత ఆషామాషీ విషయం కాదు. ఆ విషయంలో సురేందర్ రెడ్డి 200 పర్సెంట్ సక్సెస్ అయ్యారు. అలాగే ఇంతమంది లెజండరీ యాక్టర్స్‌తో పనిచేయడం కత్తిమీద సాములాంటిది. అందులోనూ.. మెగాస్టార్ చిరంజీవి లాంటి అసాధారణ నటుడి జీవిత కల ఈ సినిమా. అలాగే చరిత్ర మరచిన ఒక స్వాతంత్య్ర సమరయోధుడి స్టోరీ కాబట్టి చాలా కష్టపడి ఎంతో రీసెర్చ్ చేసి మరీ ప్రతీ సన్నివేశాన్ని గ్రిప్పింగ్‌గా అత్యద్భుతంగా మలిచాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అవుతుంది. వాస్తవ సంఘటనలతో చేస్తున్న సినిమా కనుక వాస్తవానికి దగ్గరగా, ప్రతి యాక్షన్ ఎపిసోడ్ రియలిస్టిక్‌గా, గ్రాండియర్‌గా చూపించడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. ఈ కథ మీద మొదటినుంచీ వర్క్ చేసిన పరుచూరి బ్రదర్స్ సలహాలు, సూచనలు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. అలాగే సాయిమాధవ్ బుర్రా కథలో ఆయన ఇన్‌వాల్వ్ అయ్యి రాసిన డైలాగ్స్‌కి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. సినిమాని ‘పాన్ ఇండియా’ కళ వచ్చేలా చేసాడు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. ‘స్వాతంత్య్రం రాక ముందు భారతదేశం పరిస్థితి ఎలా ఉండేది అనేదాని అప్పట్లో వాడే నాణేల దగ్గర నుండి, యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్, పాటలను చిత్రీకరించిన విధానానికి తను పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. ఈ చిత్రానికి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం మెస్మరైజింగ్‌గా ఉంది. అలాగే ‘వాటర్ సీక్వెన్స్’ ఫైట్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ జూలియస్ పాకియం అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు ఆడియన్స్‌కి ‘గూజ్ బంప్స్’ రావడం ఖాయం. ఇంత మంది నటీనటులతో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టడం సామాన్య విషయం కాదు కానీ… తన తండ్రికి ఒక బెస్ట్ సినిమా ఇవ్వాలని రామ్‌చరణ్ పడిన తాపత్రయం, అలాగే ఆయన అన్ కాంప్రమైజ్డ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద ఇంకా గ్రాండ్‌గా కనిపించేలా చేసింది. అలాగే సుస్మిత డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ సినిమాకు కీ ఎస్సెట్ అయ్యాయి.
స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరుడు.. చరిత్రలో కానరాని సూర్యుడు.. మన తెలుగువాడు.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటాన్ని వెలికి తీసుకు రావడంతో చిరంజీవి, చరణ్, సురేందర్‌రెడ్డి అండ్ టీం విజయవంతమయ్యారు. ఓ స్వాతంత్ర్యోదమ వీరుడి గాథ .. అది కూడా తెలుగువీరుడి చరిత్ర కాబట్టి ‘సైరా’ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే సినిమా అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
బాటమ్ లైన్: తెలుగు సినిమా ఖ్యాతిని పెంచే ‘సైరా’
రేటింగ్: 3.5/5