‘గజిని’, ‘యముడు’, ‘సింగం’ లాంటి విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు హీరో సూర్య. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ ‘బందోబస్త్’. ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వం వహించారు. తెలుగు ప్రేక్షకులకు ‘నవాబ్’, విజువల్ వండర్ ‘2.0’ చిత్రాలు అందించిన లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత సుభాస్కరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హ్యారీస్ జైరాజ్ సంగీత దర్శకుడు. ప్రముఖ తెలుగు నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా హీరో సూర్య ఇంటర్వ్యూ..
బందోబస్త్ గురించి చెప్పండి ?
– బందోబస్త్ మన భారత దేశం మొత్తానికి సంబందించిన కథ. ఈ చిత్రంలో వ్యవసాయం, రాజకీయాలు, దేశభద్రత వంటి ప్రధానాంశాల సమాహారంగా తెరకెక్కిన చిత్రం ఇది. అన్ని అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ తెరకెక్కిన చిత్రం ఇది. మా 2:30గంటల సినిమాలో చాలా స్టోరీలు చెప్పాం. సాధారణ మనుషుల జీవితం, హై కమాండర్స్ జీవితం ఎలా ఉంటుందన్నది చక్కగా చూపించాం. ‘బందోబస్త్’ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్సే కాదు.. ప్రొఫెషనల్, ఎమోషన్స్ ఉన్న సినిమా
ఈ సినిమాలో మిమల్ని బాగా ఆకట్టుకున్న అంశాలు ?
– ఒక వ్యక్తి సోషల్ వాల్యూస్ వదిలేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి. అసలు ఇంతకీ ఆ వ్యక్తి అలా మారడానికి కారణాలేమిటి ? ప్రధాన మంత్రి ఆఫీస్ లో వాస్తవంగా ఎటువంటి సంఘటలు జరుగుతాయి అనే అంశాల గురించి సినిమాలో చాల బాగా చర్చించడం జరిగింది ఈ అంశాలు ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటాయని నమ్ముతున్నాను.
కెవి ఆనంద్ తో మూడో చిత్రంకదా! ఒక దర్శకుడుతో మళ్ళీ వర్క్ చేయడం వల్ల ఎలాంటి కంఫర్ట్ ఉంటుంది?
– ఆనంద్ గారి గురించి చెప్పాలంటే.. 1997లో విడుదలైన నా మొదటి చిత్రం ‘నీరుక్కు నేర్’ నుండి ఆయనతో నాకు మంచి అనుభందం ఉంది. ఆయన ఆ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. మా కాంబినేషన్‌లో ‘వీడొక్కడే, బ్రదర్స్’ వంటి సినిమాలొచ్చాయి. ఆ సినిమాతో నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ వసంత్‌సర్ నాకు గురువుకంటే ఎక్కువ. నిజం చెప్పాలంటే ఒక మూవీ సెట్ లో నా మొట్టమొదటి ఫోటో తీసింది ఆనంద్. ఆయన రష్యన్ యాంగిల్ లో తీసిన నా ఫోటో అన్ని న్యూస్ పేపర్స్ లో రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన నాకు అన్నలాంటి వారు.
ఆనంద్ సినిమా అంటే కాన్సెప్ట్ చాలా డెప్త్ గా ఉంటుంది కదా?
– కె వి ఆనంద్ గారు బేసిక్ గా ఒక జర్నలిస్ట్. ఆయన తీసే సినిమాలు మన చుట్టూ జరిగే వాస్తవ సంఘటనలు ప్రతిబింబించేవిగా ఉంటాయి. కథ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఒక కేసు గురించి కానివ్వండి, పొలిటికల్ ఇష్యూ గురించి కానివ్వండి ఆయన చాలా ఇన్ఫర్మేషన్ సేకరించి, రీసెర్చ్ చేసి సినిమా తీస్తారు. అందుకే ఆయన సినిమాల్లో కాన్సెప్ట్ లు చాలా లోతుగా ఉంటాయి. అందుకే ఆయన దర్శకత్వంలో నటించడానికి ఎవరైనా ఆసక్తి చూపిస్తారు.
ప్రచార చిత్రాలు, ట్రైలర్ లో రకరకాల గెటప్పులో కనిపిస్తున్నారు! సినిమాలో మీ క్యారెక్టర్ గురించి?
– దేశభద్రత కోసం ఎంతకైనా తెగించే డైనమిక్ కమాండో అధికారి క్యారెక్టర్. మనకు ఒక ఉన్నతాధికారులనుండి ఒక ఆదేశం వచ్చినప్పుడు వెరవకుండా.. బుల్లెట్ ఎదురుగా వస్తున్నా ముందుకెళ్లే డాషింగ్ ఢిపెన్సు ఆఫీసర్ గా ఈ సినిమాలో కనిపిస్తాను.
డైనమిక్ కమాండో అధికారి గా కనిపించడానికి ఏదయినా ట్రైనింగ్ తీసుకున్నారా?
– ఈ పాత్ర చేయడం కోసం చాలా కసరత్తులే చేయాల్సి వచ్చింది. అధికారికంగా, అనధికారికంగా అనేక విషయాలపై లోతుగా అధ్యాయం చేశాను. అలాగే కొన్ని ప్రత్యేక అనుమతులు తీసుకొని ఢిల్లీలోని ఓ ఆర్మీ క్యాంపులో మూడురోజులు గడపడం జరిగింది. ఆ టైంలో కొందరు కమాండో అధికారులను కలవడం, వారి బాడీ లాంగ్వేజ్, కమాండ్స్ లాంటి అనేక విషయాలు అడిగి తెలుసుకున్నాను. కాల్పుల సమయంలో పోలీసులు, ఆర్మీ వాళ్లు రియాక్ట్ అయ్యేవిధానం వేరు. కానీ, స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ వాళ్ల విధానం వేరు. వీరు ప్రత్యేక శిక్షణ తీసుకుని ఉంటారు. బుల్లెట్స్ ఫైర్ అవుతున్నా భయపడరు. అక్కడ అధికారుల మధ్య సోదర భావం, దేశభక్తి అమోఘం. వాటిని మనం మాటలలో చెప్పలేం..
మోహన్ లాల్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం?
– ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మా ఇద్దరి క్యారెక్టర్స్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చాల కొత్తగా ఉంటుంది. ఆయన క్యారెక్టర్ ను మీరు థియేటర్స్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. అలాగే హీరో ఆర్య కూడా ఒక కీలక పాత్రలో నటించాడు. హిందీ నటుడు బోమన్ ఇరానీ కూడా మంచి క్యారెక్టర్ లో కనిపిస్తారు.
ప్రొడక్షన్ వాల్యూస్ గురించి?
– చాలా కాలం తర్వాత ‘బందోబస్త్’ నాకొక పెద్ద ప్రాజెక్ట్.. అందుకు లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ గారికి ధన్యవాదాలు. వారి వల్లే ఈ ప్రాజెక్టు సజావుగా పూర్తిఅయింది. అలాగే ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత ఎన్వీ ప్రసాద్‌గారి థ్యాంక్స్
తెలుగు చిత్ర పరిశ్రమ నుండి భారీ సినిమాలు వస్తున్నాయి కదా?
– తెలుగు నుంచి వస్తున్న పెద్ద సినిమాలు మంచి గౌరవాన్ని తెచ్చిపెడుతున్నాయి. ‘సైరా’ చాలా పెద్ద ఫిల్మ్. నిర్మాత రామ్‌చరణ్‌కి అభినందనలు. నా ఫ్రెండ్ విక్రమ్ తెరకెక్కించిన ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’ శుక్రవారం విడుదలైంది. తనకు నా శుభాకాంక్షలు. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా నాకు మంచి ఫ్రెండ్. తన ‘వాల్మీకి’ మంచి హిట్ అవ్వాలి.
మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
– సుధ కొంగర దర్శకత్వంలో ‘శూరారై పొట్రు’ చిత్రీకరణ చివరిదశలో ఉంది. ఆ తర్వాత శివ దర్శకత్వంలో ఓ సినిమా ఉంది. గౌతమ్ మీనన్ సర్ తో ఒక సినిమాకి చర్చలు జరుగుతున్నాయి. అలాగే మరో రెండు సినిమాలు పైప్ లైన్ లో ఉన్నాయి. అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో సూర్య.


