సాహూ రివ్యూ

0
12516

సంస్థ‌: యువీ క్రియేష‌న్స్
న‌టీన‌టులు: ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధా క‌పూర్‌, జాకీ ష్రాఫ్‌, నీల్ నితిన్ ముఖేష్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, అరుణ్ విజ‌య్‌, ఎవ్లిన్‌శ‌ర్మ‌, చుంకీ పాండే, లాల్‌, మందిరా బేడీ, మ‌హేష్ మంజ్రేక‌ర్‌, టిన్ను ఆనంద్‌, న‌వీన్ వ‌ర్మ‌, ఆదిత్య శ్రీవాస్త‌వ, సుప్రీత్‌, సాషా ఛెత్రి, గిరిష్ గ‌ర్లాడిన్నె, దామిని చోప్రా, కుమార్ రాజా వేనాటి, శివ‌కృష్ణ , ప్ర‌త్యేక పాత్ర‌లో జాక్వ‌లిన్ ఫెర్నాండెజ్ త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: సుజీత్‌
నిర్మాత‌లు: వంశీకృష్ణా రెడ్డి, ప్ర‌మోద్ ఉప్ప‌ల‌పాటి
స్టోరీ – స్క్రీన్‌ప్లే- డైలాగులు: సుజీత్‌
పాట‌ల బాణీలు: త‌నీష్ బాగ్చి, గురు రంధ్వా, బాద్షా, శంక‌ర్ ఎహ‌సాన్ లాయ్‌
నేప‌థ్య సంగీతం: జిబ్ర‌న్‌
కెమెరా: ఆర్‌.మ‌ది,
ఎడిటింగ్‌: ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌
విడుద‌ల‌: ఆగ‌స్ట్ 30, 2019

`బాహుబ‌లి`… తెలుగు సినిమా స‌త్తాను అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా. ఈ సినిమాతో అంద‌రి దృష్టి తెలుగు సినిమాల‌పై ప‌డ్డాయి. దీంతో బాహుబ‌లిలో న‌టించిన ప్ర‌భాస్ ఆల్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఆయ‌న ఇమేజ్ ఆకాశాన్నంటింది. ప్ర‌భాస్ త‌దుప‌రి సినిమా `సాహో`పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప్యాన్ ఇండియా మూవీగా సాహోను యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్ భారీ బడ్జెట్‌, హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందించారు. బాలీవుడ్ తార‌లు, హాలీవుడ్ టెక్నిషియ‌న్స్ అంద‌రూ ఈ సినిమాకు ప‌నిచేశారు. సినిమా పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ అన్ని సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. మ‌రి సుజిత్ ప్ర‌భాస్ ఇమేజ్‌ను పెంచాడా? లేదా? అనే విషయాలు తెలియాలంటే ముందుగా క‌థేంటో చూద్దాం..

క‌థ‌:
మాఫియా రాజ్యానికి రాజు రాయ్‌(జాకీ ష్రాఫ్‌).. అత‌ని స్థానంపై క‌న్నేసిన కొంద‌రు ఆయ‌న్ని ఇండియాలో చంపేస్తారు. దానిపై దేవ‌రాజ్‌(చుంకీపాండే) క‌న్నేస్తాడు. అయితే రాయ్ కొడుకు విశ్వ‌క్‌(అరుణ్ విజ‌య్‌) రావ‌డంతో బోర్డు స‌భ్యులు అత‌నికే ఓటు వేస్తారు. దీంతో దేవ‌రాజ్ ఎలాగైనా ఆ స్థానాన్ని సాధించాల‌నుకుంటాడు. అదే స‌మ‌యంలో ముంబైలో రెండు వేల కోట్ల రాబ‌రీ జ‌రుగుతుంది. కేసుని అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ అశోక చ‌క్ర‌వ‌ర్తి(ప్ర‌భాస్‌)కి అప్ప‌గిస్తారు. డేవిడ్‌(ముర‌ళీశ‌ర్మ‌), గోస్వామి(వెన్నెల‌కిషోర్‌), అమృతానాయ‌ర్‌(శ్ర‌ద్ధాక‌పూర్‌ల‌తో క‌ల‌సి అశోక్ కేసుని ప‌రిశోధిస్తూ రావ‌డం వ‌ల్ల జై(నీల్ నితిన్‌) దొంగ అని తెలుస్తుంది. ఆధారాలు లేని జైని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకోవాల‌ని అశోక్ ఓ ప్లాన్ వేస్తాడు. ఆ ప్లానేంటి? దాని వ‌ల్ల బ‌య‌ట ప‌డే నిజాలేంటి? అస‌లు అశోక్‌కి, రాయ్ గ్యాంగ్‌కి ఉన్న రిలేష‌న్ ఏంటి? అస‌లు జై ఎవ‌రు? చివ‌ర‌కు పోలీసులు దొంగ‌ను ప‌ట్టుకున్నారా? అస‌లు రాయ్‌ని చంపిందెవ‌రు? ఇలా అన్ని విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేష‌ణ‌
క‌థ ప్రారంభం కావ‌డ‌మే గ్రాండియ‌ర్‌గా ఉంటుంది. ఓ గొప్ప సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న అధినేత‌.. అత‌ని సామ్రాజ్య విస్త‌ర‌ణ‌ను వివ‌రించే తీరు బావుంటుంది. `బాహుబ‌లి`లాంటి కాల్ప‌నిక జాన‌ప‌ద క‌థ‌తో ప్ర‌భాస్‌ను చూసిన త‌ర్వాత‌, సోష‌ల్ గెట‌ప్‌లో `సాహో`లో ఆయ‌న క‌నిపించిన తీరు ఫ్యాన్స్ కి పండ‌గే. కొన్ని స‌న్నివేశాల్లో మాస్‌గా, మ‌రికొన్ని స‌న్నివేశాల్లో స్టైలిష్డ్ గా, రిచ్ కిడ్‌గా ఆయ‌న జీవించారు. మ‌రీ ముఖ్యంగా ష‌ర్ట్ లేకుండా క‌నిపించిన స‌న్నివేశాల్లో మ‌రింత హాట్‌గా ఉన్నారు. ఆయ‌న చేసిన సూప‌ర్‌మేన్ త‌ర‌హా స్కై డైవ్‌, జెట్ ఫైట్ ఆక‌ట్టుకున్నాయి. యాక్ష‌న్ స‌న్నివేశాల్లో ఎగిరెగిరి చేసిన ఫైట్లు అభిమానులకేకాదు, సినిమా ప్రియులు అంద‌రికీ న‌చ్చుతాయి. ఆయ‌న తండ్రిగా జాక‌ష్రాఫ్ రాయ్ పాత్ర‌లో రాయ‌ల్‌గా క‌నిపించారు. మ‌హేష్ మంజ్రేక‌ర్ త‌న‌దైన శైలిలో ఆక‌ట్టుకున్నారు. దేవ‌రాజ్‌గా చుంకీ పాండే న‌ట‌న తెలుగువారికి కొత్త‌గా అనిపిస్తుంది. ఆయ‌న‌కు డ‌బ్బింగ్ చెప్పిన విధానం కూడా బావుంది. లీగ‌ల్ అడ్వైజ‌ర్‌గా, రాయ్ తో చిర‌కాలం ప‌రిచ‌యం ఉన్న క‌ల్కిగా మందిరాబేడి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేసింది.జాక్వ‌లిన్‌తో చేసిన ఐట‌మ్ సాంగ్ మెప్పించింది. ఆ పాట‌లో తెర‌మీద అమ్మాయిలు హీట్ పుట్టించారు.

కాస్త సీరియ‌స్‌నెస్ మిక్స్ అయిన రోల్‌లో పోలీస్ ఆఫీస‌ర్ అమృత నాయ‌ర్‌గా శ్ర‌ద్ధాక‌పూర్ బాగా న‌టించింది. సాంగ్స్ లో ఆమె కాస్ట్యూమ్స్ హైలైట్ అయ్యాయి. ప్ర‌భాస్‌తో ఎమోష‌న‌ల్‌గా బాండ్ అయ్యే స‌న్నివేశాలు, అత‌నికి త‌న ప్రేమ‌ను చెప్పే సీన్లు, ఆమె గ‌తాన్ని అత‌నితో పంచుకుంటూ న‌డిచే దృశ్యాలు బావున్నాయి.
కేర‌క్ట‌ర్‌లో విష‌యం ఉండాలే కానీ, ముర‌ళీ శ‌ర్మ దూసుకుపోతారు. ఈ సినిమాలో డేవిడ్ పాత్ర ఆయ‌న కెరీర్‌లో మ‌రో హైలైట్ పాత్ర‌. తెర‌మీద `గోస్వామి` అనే పేరు వినిపించ‌గానే ప్రేక్ష‌కుల ముఖాల్లో న‌వ్వులు క‌నిపించాయి. ఆ పాత్ర పోషించింది వెన్నెల కిశోర్ క‌నుక‌. న‌మ్మిన బంటుగా లాల్‌, రాయ్ కొడుకు విశ్వంక్‌గా అరుణ్ విజ‌య్ త‌మ పాత్ర‌ల‌కు సంపూర్ణ న్యాయం చేశారు.

ఈ సినిమా విష‌యంలో ప్ర‌ధాన క్రెడిట్ ఫైట్ మాస్ట‌ర్ల‌కు ఇవ్వాలి. మ‌న సౌత్ ఫైట్ మాస్ట‌ర్లతో పాటు చైనా, హాలీవుడ్ మాస్ట‌ర్లు కూడా యాక్ష‌న్ సీక్వెన్స్ ని డిజైన్ చేశారు. తెర‌మీద యాక్స‌న్ స‌న్నివేశాలు జ‌రుగుతున్నంత సేపు ఇంట్ర‌స్ట్ తో ప్రేక్ష‌కులు సీట్ ఎడ్జ్ ల్లో జ‌రిగి కూర్చుంటారు. ట్యూన్లు ఇదివ‌ర‌కే హిట్ అయినా, వాటిని తెర‌కెక్కించిన తీరు ఇంకా బావుంది. కొన్ని లొకేష‌న్ల‌ను చూస్తుంటే జీవితంలో ఒక్క‌సారైనా వెళ్లి రావాల‌నిపించాయి. వాటిలో హ్యాంగింగ్ బ్రిడ్జి, లాంగ్ స్టెప్స్… త‌ర‌హా లొకేష‌న్లున్నాయి.
హెలికాప్ట‌ర్ ప్యాడ్‌, హెలికాప్ట‌ర్ స‌న్నివేశాలు, జెట్ ఫైటింగ్‌లు, పారా గ్లైడింగ్‌, స్కై డైవింగ్ వంటివాటిని బ‌ట్టి, తెర‌మీద క‌నిపించిన విజువ‌ల్స్ ను బ‌ట్టి, నిర్మాత‌లు ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా ఎంత గొప్ప‌గా తెర‌కెక్కించారో అర్థ‌మ‌వుతుంది.

ఫ‌స్ట ఫైట్‌లో పందుల మ‌ధ్య నువ్వేంటి పాపా.. అనే డైలాగు, వాళ్లు నా ఫ్యాన్స్… డై హార్డ్ ఫ్యాన్స్ అనే డైలాగు, గ‌ల్లీలో సిక్సులు ఎవ‌రైనా కొడ‌తారు అనే డైలాగు, నీకు నీడ‌లాగా నేనుంటా అనే డైలాగు… తండ్రి చ‌నిపోయిన‌ప్పుడు ఎమోష‌న‌ల్‌గా ప్ర‌భాస్ చెప్పే `ఐ ల‌వ్ యు డాడీ` అనే డైలాగు సినిమాకు హైలైట్ నిలుస్తాయి. అంద‌రి దృష్టిలో ఇది ఎడారి, కానీ ఇదే నాకు పునాది అని విల‌న్ చెప్పే డైలాగు, మ‌గ‌వాళ్లు మీకే అంతుంటే, మిమ్మ‌ల్ని క‌న్న ఆడ‌వాళ్లం. మాకెంత ఉంటుంద‌ని మందిరాబేడి చెప్ప మాట హైలైట్ అవుతాయి.

కాస్ట్యూమ్స్ కూడా బావున్నాయి. వీఎఫ్ ఎక్స్ ప‌నితీరును మెచ్చుకోవాలి. బోట్‌లో శ్ర‌ద్ధాక‌పూర్‌, ప్ర‌భాస్ ఉన్న‌ప్పుడు చుట్టూ పింక్ క‌ల‌ర్ లేక్ ఉండే దృశ్యాన్ని వీఎఫ్ ఎక్స్ లో అద్భుతంగా తీర్చిదిద్దారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బావుంది. ఆర్ట్ వ‌ర్క్ కూడా మెచ్చుకునేలా ఉంది. సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ది కెమెరాలో స్టాండ‌ర్డ్ క‌నిపిస్తోంది. నిర్మాణ విలువలు చాలా బావున్నాయి. సాహో సినిమాను ఇంత గ్రాండ్‌గా నిర్మించి ప్యాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నిర్మాతలు వంశీ, ప్రమోద్‌లను అభినందించాల్సిందే..

బోట‌మ్ లైన్‌: `సాహో`…. అందరినీ మెప్పించే భారీ కమర్షియల్ ఎంటర్టైనర్
రేటింగ్‌: 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here