విడుదల తేదీ : ఆగస్టు 15, 2019
నటీనటులు : అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర, మురళీ శర్మ, నిహాల్ తదితరులు
దర్శకత్వం : వెంకట్ రామ్‌జీ
నిర్మాతలు : వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె
సంగీతం : శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫర్ : వంశీ పచ్చిపులుసు
ఎడిటర్ : గ్యారీ బి.హెచ్
థ్రిల్లర్ ఈ జోనర్ కి ఈ మధ్య కాలంలో విపరీతమైన ప్రేక్షకాదరణ ఉంది. అందుకనే కొత్త దర్శకులు ఎక్కువగా థ్రిలర్ సినిమాలనే ఎంచుకుంటారు.. అయితే మంచి కంటెంట్ ఉన్న కథలో ట్విస్ట్‌లు ఉంటేనే సినిమా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. కాని సినిమాలో సీన్ సీన్‌కి ట్విస్ట్ ఉంటే. అదికాక ఆ ట్విస్ట్ ని తన స్క్రీన్ ప్లే ద్వారా కన్వీనియన్స్ గా చెప్పగలిగితే… అందులో ఉండే మజానే వేరు. అలా క్షణం, గూఢచారి సినిమాలతో నటుడిగానే కాదు బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా తనని తాను నిరూపించుకున్నారు అడివిశేష్.. రీసెంట్ గా ఆయన నటిస్తూ స్క్రీన్ ప్లే అందించిన సినిమా ఎవరు?..టీజర్, ట్రైలర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఆగష్టు 15 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడివిశేష్ ఎవరు సినిమాతో, తన మార్క్ స్క్రీన్ ప్లే తో ఎలాంటి మ్యాజిక్ చేశాడో చూద్దాం..
కథ :
ఆత్మరక్షణ కోసం సమీరా(రెజీనా) అనే అమ్మాయి అశోక్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ని మర్డర్ చేసే సీన్ తో స్టార్ట్ అవుతుంది. కథలోకి వెళ్తే..ఓ సాప్ట్ వేర్ సంస్థలో రిసెప్షనిస్ట్‌గా పనిచేసే మధ్య తరగతికి చెందిన సమీరా (రెజీనా).. ఆ కంపెనీ బాస్‌ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. అయితే.. తన స్నేహితుడైన పోలీస్ ఉన్నతాధికారి అశోక్ (నవీన్ చంద్ర)తో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు లోని కూనూర్ ప్రాంతంలో ఒక రిసార్ట్స్ కి వెళ్లగా.. అక్కడ సమీరాపై అత్యాచారం జరగడం.. పోలీస్ ఆఫీసర్ మర్డర్ జరగడం జరుగుతుంది. ఇదే సమయంలో మరోవైపు కూనూర్ ప్రాంతంలో రిసార్ట్స్ నిర్వహించే వినయ్ వర్మ (మురళీ శర్మ) కనిపించకుండా పోతారు. అతన్ని వెతుక్కుంటూ క్యాన్సర్‌తో బాధపడే ఆయన కొడుకు రాహుల్ (నిహాల్) పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటాడు. అదే స్టేషన్‌లో ఎస్.ఐగా పనిచేస్తుంటాడు విక్రమ్ వాసుదేవ్ (అడివి శేష్). అసలు కనపడకుండా పోయిన వినయ్ వర్మ ఎవరు?, ఈ కేసు లోకి విక్రమ్ ఎలా వచ్చాడు? సమీరాని రేప్ చేసింది ‘ఎవరు’? అశోక్‌ని హత్య చేసింది ‘ఎవరు’? ఈ ప్రశ్నలన్నింటిసమాధానాల సమాహారమే ‘ఎవరు’ మూవీ.
నటన:
విక్రమ్ వాసుదేవ్ గా తన నటనతో మరో సారి ఆకట్టుకున్నారు శేష్. డబ్బులు ఇస్తే ఎలాంటి పని ఆయన చేసే లంచగొండి పోలీస్ అధికారి పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అక్కడక్కడా పంచ్ డైలాగ్స్ తో తన మార్క్ కామెడీ ని పండిస్తూనే మరో వైపు ప్రేక్షకుల్ని తన స్క్రీన్ ప్లే తో రెండు గంటలపాటు ఎంగేజ్ చేయగలిగాడు.
రెజీనా తనలో పూర్తి స్థాయి నటి ఉందని సమీరా పాత్రతో రుజువుచేసింది. తొలి సీన్‌లోనే తన పెర్ఫామెన్స్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చిన రెజీనా.. ఆ ఫ్లో మిస్ కాకుండా సినిమా చివరి వరకూ కంటిన్యూ చేసింది. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో రెజీనా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న పాత్రలు అరుదుగా వస్తున్న తరుణంలో రెజీనా తో ఓ ఛాలెంజింగ్ రోల్ ప్లే చేయించడం అభినందించాల్సిన విషయం. అలాగే నవీన్ చంద్ర పోలీస్ ఆఫీసర్‌గా ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఆకట్టుకున్నారు. జగడం సినిమాలో రామ్ తమ్ముడిగా నటించిన నిహాల్ ఈ సినిమాలో క్యాన్సర్ పేషెంట్‌గా కథలో కీలకమైన రోల్ లో అద్భుతంగా నటించారు. క్లైమాక్స్ ట్విస్ట్‌తో ఈ పాత్రకు మంచి హైప్ వచ్చింది. కథలో కీలకమైన వినయ్ వర్మ పాత్రలో మురళీశర్మ తన అనుభవంతో మరోసారి ఆకట్టుకున్నారు. ఆయనకు భార్యగా నటించిన పవిత్ర లోకేష్ తన పరిధిమేర పాత్రకు న్యాయం చేసింది.
విశ్లషణ :
ఈ చిత్రంలో కీలకమైన రెజీనా రేప్ సీన్‌ను మూడు కోణాల్లో చూపించాడు దర్శకుడు. ఒక్కోసారి ఒక్కో ప్రశ్నకు చిక్కుముడి వీడుతుంది. ఈ మూడు సీన్స్‌కి భిన్నమైన నేపథ్యం ఉంటుంది. కథ డిమాండ్ చేయడంతో దర్శకుడు రెజీనాలోని గ్లామర్ యాంగిల్‌ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. అబ్బూరి రవి అందించిన సంభాషణలు సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. కథలో లీనం అయ్యేలా అతని మాటలు బలాన్నిచ్చాయి. ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథకు ఎలాంటి ఇంటెన్సిటీ ఉండాలో తన కెమెరాపనితనంతో ఇంటర్నేషనల్ అపీరెన్స్ రియిలిస్టిక్ లుక్ తీసుకువచ్చాడు వంశీ పచ్చిపులుసు. గూఢచారి చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతంతో తన మార్క్ చూపించిన శ్రీ చరణ్ పాకాల మరోసారి సస్పెన్స్ థ్రిల్లర్ కథలకు తాను బెస్ట్ చాయిస్ అనిపించాడు. ఎడిటర్ గ్యారీ సినిమా రన్ టైం తక్కువ చేసి క్రిస్పీగా ఉండేలా ఎడిట్ చేశారు. నిర్మాత పీవీపీ మరోసారి విభిన్న చిత్రాలని ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా టాప్ క్వాలిటీ తో నిర్మించి తన మార్క్ చూపించారు. కథను నమ్మి కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చి అందులోని హిట్ ఫ్లేవర్‌ని ముందే పసిగట్టడంలో వందకు వంద శాతం సక్సెస్ అయ్యారు.
సినిమాపై ఎంతో నమ్మకం ఉంటే తప్ప.. ప్రీమియర్ షోలు వేయరు. కాని ‘ఎవరు’ చిత్రం విడుదలకు ముందే వేయి మందికిపైగా జనరల్ ఆడియన్స్‌కి చూపించి మరీ సినిమా విడుదల చేశారంటే ‘ఎవరు’ మీద అడివి శేష్, పివిపి లకి ఉన్న నమ్మకం తెలుస్తోంది. ఈ అంచనాల్ని నిజం చేసింది ‘ఎవరు’. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ప్రాథమిక సూత్రం.. ఆడియన్స్‌ని కథలో ఇన్వాల్వ్ చేసి కుర్చీల్లో కదలకుండా కూర్చోబెట్టడం. తరువాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో పాటు.. వారి ఊహలకు ఆస్కారం ఇవ్వకుండా కథను మలిచితే దర్శకుడు సక్సెస్ అయినట్టే. ‘ఎవరు’ చిత్రంతో ఇదే మ్యాజిక్ చేశారు అడివి శేష్, దర్శకుడు వెంకట్ రామ్ జీ. ప్రతి సీన్ లోనూ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ లతో స్టోరీ ని గ్రిప్పింగ్ గా నడిపారు. ఓవరాల్‌గా.. అడివి శేష్ సినిమా అంటే పై సగటు ప్రేక్షకుడికి ఉండే నమ్మకాన్ని మరో సారి నిలబెట్టుకున్నారు. ప్రేక్షకులకు ఒక పూర్తి స్థాయి థ్రిల్లర్ మూవీ రుచి చూపించడంలో అంచనాలకు మించి సక్సెస్ అయ్యారు ఎవరు టీమ్…
బాటమ్ లైన్ : ఉత్కంఠ రేపే మలుపులతో ఎవరు..
రేటింగ్ : 3.25/5