రివ్యూ: మన్మథుడు 2
నిర్మాణ సంస్థలు : అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ 18 స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్
తారాగణం: అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, రావు రమేష్, వెన్నెల కిశోర్, లక్ష్మి, దేవదర్శిని, ఝాన్సీ, నిశాంతి తదితరులు. ప్రత్యేక పాత్రల్లో: సమంత అక్కినేని, కీర్తి సురేష్
సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్
ఎడిటింగ్: ఛోటా కె.ప్రసాద్, బొంతల నాగేశ్వరరెడ్డి
సంగీతం: చైతన్ భరద్వాజ్
కథ: రాహుల్ రవీంద్రన్, కిట్టు విస్సాప్రగడ
స్క్రీన్‌ప్లే: సత్యానంద్, రాహుల్ రవీంద్రన్
నిర్మాతలు: అక్కినేని నాగార్జున, పి.కిరణ్
దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
విడుదల తేదీ: 09.08.2019
అక్కినేని నాగార్జున హీరోగా 2002లో వచ్చిన ‘మన్మథుడు’ అందరికీ గుర్తుండే ఉంటుంది. చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇప్పటికీ టీవీలో అలరిస్తుంది. ఇప్పుడు అదే టైటిల్‌తో ‘మన్మథుడు 2’ చిత్రం రూపొందింది. ఆ సినిమాకీ, ఈ సినిమాకీ కథ, కథనాల విషయాల్లో ఎలాంటి పోలికా లేదు. ఇందులో హీరో క్యారెక్టరైజేషన్‌కి తగ్గట్టుగా ‘మన్మథుడు 2’ అనే టైటిల్ పెట్టడం జరిగింది. మరి ఈ సినిమా ఆనాటి ‘మన్మథుడు’ స్థాయిలో ఉందా? లేక ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టుగా, ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఉందా? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
ఇందులో హీరో పేరు సామ్ అలియాస్ సాంబశివరావు(అక్కినేని నాగార్జున). పోర్చుగల్‌లో స్థిరపడిన ఫ్యామిలీ అతనిది. భిన్నమైన మనస్తత్వం ఉన్న సామ్ పెళ్లంటే ఆమడ దూరం పరిగెడతాడు. అమ్మాయిలతో గడపడం తప్ప పెళ్లి ఊసెత్తడు. ఆ విషయంలోనే తల్లితో గొడవపడి సెపరేట్‌గా ఉంటూ ఉంటాడు. ఓ ఫైన్ మార్నింగ్ జరిగిన డిస్కషన్‌లో మూడు నెలల్లో పెళ్ళి చేసుకోవాల్సిందేనని తల్లి చెప్పడంతో తప్పనిసరై ఒప్పుకుంటాడు. తల్లి తృప్తికోసం పెళ్లికి ఒప్పుకున్న సామ్ దాని నుంచి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ వేస్తాడు. ఓ రెస్టారెంట్‌లో వెయిట్రెస్‌గా పనిచేసే అవంతిక(రకుల్ ప్రీత్)తో ఒక ఒప్పందం కుదుర్చుకుంటాడు. రెండు వారాల పాటు తన ప్రేయసిగా నటించాలని, తన ఇంట్లో వారిని బాగా ఇంప్రెస్ చెయ్యాలని, పెళ్లి పీటల వరకు వచ్చిన తర్వాత ఎవ్వరికీ కనిపించకుండా వెళ్ళిపోవాలన్నది ఆ అగ్రిమెంట్ సారాంశం. అవంతికకు డబ్బు అవసరం చాలా ఉండడంతో దానికి ఒప్పుకుంటుంది. అలా మొదలైన సామ్, అవంతికల ప్లాన్ ఎంతవరకు వెళ్లింది? దాని వల్ల ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ప్రేమ, పెళ్ళి అంటే చిరాకు పడే సామ్… అవంతిక విషయంలో తన నిర్ణయం మార్చుకున్నాడా? ఈ క్రమంలో కథ ఎన్ని మలుపులు తిరిగింది? చివరికి ఎలా ముగిసిందీ అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
‘మన్మథుడు’ చిత్రంలో నాగార్జున అమ్మాయిల పాలిట మన్మథుడిలాగే కనిపించాడు. ఆ సినిమాలో ఎంతో గ్లామర్‌గా కనిపించడమే కాకుండా కామెడీ, సెంటిమెంట్.. ఇలా అన్ని అంశాల్లో తనదైన శైలిలో నటించి అందర్నీ మెప్పించారు. 17 ఏళ్ళ తర్వాత వచ్చిన ‘మన్మథుడు 2’ చిత్రంలో నాగార్జున అప్పటి కంటే గ్లామర్‌గా కనిపించడం విశేషం. అంతేకాదు ఇప్పటి యువ నటులకు ఏమాత్రం తీసిపోకుండా తన పెర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేయడం మరో విశేషం. కామెడీ, సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్‌లో తన అద్భుతమైన నటనతో మెప్పించారు. హీరోయిన్‌గా నటించిన రకుల్ ప్రీత్ తన క్యారెక్టర్‌కి తగ్గట్టుగా అన్ని ఎమోషన్స్‌ని పండింది. ఇంతకుముందు సినిమాల్లో కంటే గ్లామర్‌గా కనిపించి ప్రేక్షకులకు కనువిందు చేసింది. హీరో తల్లిగా లక్ష్మి, అక్కలుగా ఝాన్సీ, దేవదర్శిని, చెల్లెలుగా నిశాంతి, మేనమామగా రావు రమేష్ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక నాగార్జునకు పి.ఎ.గా వెన్నెల కిశోర్ ఆద్యంతం నవ్వులు పూయించే ప్రయత్నం చేశాడు.
సాంకేతిక విభాగాల గురించి చెప్పుకోవాలంటే సుకుమార్ ఫోటోగ్రఫీ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. పోర్చుగల్‌లోని అందమైన లొకేషన్స్‌ని మరింత అందంగా చూపించడమే కాకుండా నాగార్జున, రకుల్ ప్రీత్‌లను కంటికింపుగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. పాటల్ని కూడా ఎంతో అందంగా చిత్రీకరించి మెప్పించాడు. చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం ఎంతో మధురంగా ఉంది. పాటలు తక్కువే అయినా ఉన్నంతలో మంచి పాటలు చేశాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్కడా రణగొణ ధ్వనులు లేకుండా ప్లెజెంట్‌గా చేశాడు. ఛోటా కె.ప్రసాద్, బొంతల నాగేశ్వరరెడ్డి ఎడిటింగ్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. ఎక్కడా ల్యాగ్ అనేది లేకుండా చాలా కేర్ తీసుకున్నారు. నిర్మాతల గురించి చెప్పాలంటే ఖర్చుకి వెనుకాడకుండా సినిమాను చాలా రిచ్‌గా చేశారు. పూర్తిగా పోర్చుగల్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన ఈ సినిమాలో అందమైన లొకేషన్స్‌కి కొదవలేదు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతి సీన్‌ను రిచ్‌గా తీయడంలో నిర్మాతల కృషి స్క్రీన్‌పై కనిపిస్తుంది.
డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గురించి చెప్పాల్సి వస్తే… పాత మన్మథుడు ఛాయలేవీ ఈ సినిమాలో కనపడకుండా ప్రజెంట్ ట్రెండ్‌కి తగ్గటు ఈ సినిమా చెయ్యాలనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే కథ, కథనం, హీరో క్యారెక్టరైజేషన్ విషయంలో ఎంతో కేర్ తీసుకున్నాడు. ఈ వయసులోనూ నాగార్జునను ఒక యంగ్ హీరో ప్రొజెక్ట్ చేశాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అచ్చమైన తెలుగు మాట్లాడితే ఎలాంటి కామెడీ వస్తుందనేది ఈ సినిమాలో చూపించాడు. నాగార్జున, రకుల్, లక్ష్మి, వెన్నెల కిశోర్, రావు రమేష్‌ల నుంచి తనకు కావాల్సిన పెర్‌ఫార్మెన్స్‌ని రాబట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఫస్ట్‌హాఫ్ అంతా ఎంతో సరదాగా నడిపించి, సెకండాఫ్‌కి వచ్చే సరికి కొంత సెంటిమెంట్, కొన్ని ఎమోషనల్ సీన్స్‌తో కథను టర్న్ చేశాడు. క్లైమాక్స్‌లో హీరో రియలైజ్ అయ్యే సీన్, తను చేసిన తప్పుకి హీరోయిన్ పశ్చాత్తాప పడే సీన్స్‌ను ఎంతో డెప్త్‌లోకి వెళ్ళి తీశాడు. సినిమాలోని చాలా డైలాగ్స్‌కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్‌హాఫ్‌లోని కామెడీ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ కొత్త మన్మథుడు యూత్‌నే కాదు అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి.
బాటమ్ లైన్: వన్నె తగ్గని మన్మథుడు
రేటింగ్ : 3