అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ పతాకాలపై రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `మన్మథుడు 2`. ఆగస్ట్ 9న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో ఇంటర్వ్యూ..
ఫ్రెంచ్ సినిమా రీమేక్ అనగానే ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి?
– ఫ్రెంచ్ సినిమాను రీమేక్ చేయాలని నాగార్జునగారు చెప్పగానే నాకు భయం వేయలేదు.. అయితే రైట్స్ ఉన్నాయి కదా సార్! అన్నాను. ఆయన అఫీషియల్‌గా రైట్స్ తీసుకున్నామని చెప్పారు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్లడంతో సమయం ప్రకారం అంతా ముగిసింది.
మన్మధుడు 2 టైటిల్ ఎవరు సజెస్ట్ చేశారు?
– ఈ టైటిల్‌ను ఎవరు చెప్పారో తెలియదు కానీ మా టీమ్ సభ్యులే చెప్పారు. కథకు తగ్గ టైటిల్. మన్మథుడు అనే టైటిల్‌ను పెడితే రెండు సినిమాలు ఒకే హీరో చేశాడు కాబట్టి రేపు ఎప్పుడైనా ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన్మథుడు 2 అని పెట్టాం. సినిమాలో మంచి ఎమోషన్ ఉంది. దానికి ఆడియెన్స్ ఎక్కడో కనెక్ట్ అవుతారని గట్టి నమ్మకం ఉంది.
ఈ సినిమాలో సమంత నటించడం ఎవరి ఛాయిస్?
– సినిమాలో సమంత ఓ సీన్‌లో నటించారు. ఆ సీన్ మైండ్‌లోకి రాగానే ముందునాకు తట్టిన యాక్టర్ సమంతనే. నాకు అనిపించిన తర్వాత తనకు చెప్పాను ఓకే అంది. ఆ తర్వాత నాగ్ సార్‌కి చెప్పాను ఆయన ఓకే చాలా బావుంది బట్ సమంత చేస్తుందా? అని అడిగారు. ఆమెకు చెప్పానని, ఆమె చేయడానికి ఒప్పుకుందని నాగ్‌సార్‌కి చెప్పగానే అయితే ఓకే అన్నారు. అలాగే మరో ఇంపార్టెంట్ రోల్ లో కీర్తి సురేష్ నటిస్తోంది. వీళ్లిద్దరి క్యారెక్టర్స్ కథలో చాలా ముఖ్యం.
మీ రెండో సినిమా నాగార్జున గారితో చేయడం ఎలా అనిపించింది?
– నేను సినిమా చేస్తే బావుంటుందని గీతగారు చెప్పారు. `చి.ల.సౌ` సినిమా చూసి నాగార్జునగారు పిలిచి అవకాశం ఇచ్చారు. `ఒకసారి ఫ్రెంచ్ సినిమా చూడు నీకు నచ్చితే చేద్దాం` అని నాగ్‌సార్ అన్నారు. వెంటనే నేను చాలా హ్యాపీ ఫీలయ్యాను. నా రెండో సినిమానే నాగ్ గారు హీరో అంటే అమేజింగ్ ఫీలింగ్ అనిపించింది. ఇది చాలా హ్యాపీ సినిమా ఫుల్ ఎంటర్‌టైన్ మూవీ.
టీజర్, ట్రైలర్ లో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి?
– ఇందులో ఏ ఒక్క సీన్ కూడా అసభ్యకరంగా ఉండదు. అలా చూపించి టికెట్ అమ్మాలనే ఆలోచన లేదు. అలాగే ఇందులో రాసిన ప్రతీ డైలాగ్ సింగిల్ మీనింగ్‌తోనే రాశాం. ఎక్కడా డబుల్ మీనింగ్ ఉండదు. కాకపోతే ఎందువల్లనో ఫీడ్ బ్యాక్ అలా వచ్చింది. ఇందులో డైలాగ్స్ అనేవి వల్గర్‌గా ఉండవు నాటీగా మాత్రమే అనిపిస్తాయి. మనకు కేవలం మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. మేం సింగిల్ మీనింగ్‌లో రాసినా.. ఓ సందర్భంలో డబుల్ మీనింగ్ అన్న ఫీడ్ బ్యాక్‌వచ్చింది. ఉదాహరణకి `పిల్లలకి కోచింగ్ ఇచ్చే వయసులో నువ్వు బ్యాటింగ్‌కి దిగుతావేంటిరా? అన్న డైలాగ్ బాగా డబుల్ మీనింగ్ అన్నారు. కానీ రాసేటప్పుడు మేమైతే ఆ ఉద్దేశం లేదు.
ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైం తీసుకున్నారంట?
– ఫైనల్ కథను లాక్‌చెయ్యడం కోసం అలా టైమ్ తీసుకున్నా అంతే. కథ మొదలయ్యే ఒక నెలన్నర ముందు కథను బలంగా తయారు చేసి వెళ్ళాను. డైలాగ్ రైటర్ కిట్టు కూడా యాడ్ అయ్యారు. షూట్ మొదలయిందంటే లక్షలు ఖర్చు అవుతాయి. ప్రీప్రొడక్షన్ మంచిగా తీసుకుంటే షూట్‌లో ఏ ప్రాబ్లమ్ రాదు అని బాగా నమ్ముతాను. `చి.ల.సౌ` తర్వాత చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ తర్వాత నేను వెంటనే ఈ సినిమాకు లాక్ అయిపోయాను.
ఒక హీరో డైరెక్టర్ అయితే ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి?
– పదమూడు చిత్రాల్లో హీరోగా చేశాను కాబట్టి ఎలా చెబితే వాళ్ళకు అర్ధమవుతుంది అనేది నాకు అర్ధం అయింది. నేను నాగ్ గారు కలిసి మిగతా కాస్టింగ్ అందర్నీ తీసుకున్నాం. బట్ లక్ష్మీగారు విషయంలో మాత్రం నేను.. ఆ పర్టికులర్ పాత్రకు ఆమెనే కావాలని చెప్పాను. లక్కీ గా ఆవిడే ఆపాత్ర చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ ని నాగార్జున గారే సజెస్ట్ చేశారంట?
– మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ చాలా హార్డ్ వర్కర్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆయన మ్యూజిక్ చేసిన ఆర్.ఎక్స్ 100లో పిల్లారా సాంగ్‌ను బాగా విన్నాను. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎవరిని తీసుకోవాలని అనుకుంటున్నప్పుడు నాగ్ సార్ చైతన్ పేరుని సజెస్ట్ చేశాడు. తనను కలిసి మాట్లాడాను. ఈ సినిమాకోసం కూడా చాలా మంచి ట్యూన్స్ ఇవ్వడం జరిగింది.
ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
– ఆయనకు రిలేషన్స్ మీద నమ్మకం ఉండదు. ఆయనకున్న రిక్వైర్ మెంట్స్ వేరు కానీ అమ్మాయిలకి మంచి రెస్‌పెక్ట్ ఇస్తారు. పడయేడం ఏంటి ముందు గౌరవం ఇస్తే వాళ్ళే వస్తారు.. అనే లాంటి ఓ మంచి క్యారెక్టర్‌లో కనపడతారాయన.
మన్మథుడు 2 తరువాత ఏవైనా సినిమాలు ప్లాన్ చేశారా?
– మన్మథుడు 2 తర్వాత ఏ సినిమా తీయాలని ప్రత్యేకించి ఏమీ అనుకోలేదు. నేను పర్సనల్‌గా ఎవరినీ ఏమీ అప్రోచ్‌కాలేదు. తర్వాత లవ్ స్టోరీ మాత్రం తియ్యను. థ్రిల్లర్ చెయ్యాలని ఉంది. లేదంటే జనం కేవలం లవ్ సినిమాలు మాత్రమే తియ్యగలను అని ఫిక్స్ అయిపోతారు. నాకు వచ్చే ప్రతి ఐడియా ఒక ఫైల్‌లో రాసుకుంటాను. అలా నా దగ్గర 13 కథలు ఉన్నాయి. వాటిలో ఏది ఓకే అవుతుందో ఇప్పుడే చెప్పలేను.
చిన్మయి మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది?
– చిన్మయికి నాకు మధ్య బాండింగ్ చాలా బావుంటుంది. తను నాకు దొరకడం నా లక్. తను చాలా ఇండిపెండెంట్ గర్ల్. తనకు తెలుసు ఎలా ఉండాలి? ఏం చెయ్యాలి? అని నేను తనను ప్రత్యేకించి సపోర్ట్ చెయ్యడం అంటూ ఏమీ ఉండదు ఎప్పుడు సపోర్ట్ చెయ్యాలో అప్పుడే చేస్తాను.