2010వ సంవత్సరంలో టాలీవుడ్ లో వెర్సటైల్ యాక్టర్ సాయి కుమార్ ప్రధాన పాత్రలో, శర్వానంద్ మరియు సందీప్ కిషన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించిన ‘ప్రస్థానం’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సంచలన చిత్రాల దర్శకులు దేవా కట్ట దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాను అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో విడుదల చేసారు. హిందీలో సాయి కుమార్ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించగా, ఇతర ముఖ్య పాత్రల్లో ఆలీ ఫైజల్, మనీషా కొయిరాలా, జాకీ ష్రాఫ్, అమైరా దస్తూర్ నటించారు.
సంజయ్ దత్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మాన్యత దత్ నిర్మించిన ఈ సినిమాను కూడా తెలుగులో దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన దేవా కట్టానే దర్శకత్వం వహించడం విశేషం. ‘మంచిని చేస్తే రామాయణం జరిగింది, అదే మంచిని దూరం చేస్తే మహాభారత యుద్ధం జరిగింది’ అనే డైలాగ్ తో ప్రారంభమయి, ఆద్యంతం ఆకట్టుకునే యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలతో సాగిన ఈ టీజర్ ప్రస్తుతం వీక్షకులను విశేషంగా అలరిస్తోంది. వారసత్వ అధికారం కోసం జరిగే పోరాటం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై బాలీవుడ్ లోను మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది…!!