మిస్టర్ కె.కె
సమర్పణ టి.అంజయ్య
బ్యానర్స్: పారిజాత మూవీ క్రియేషన్స్
నటీనటులు: చియాన్ విక్రమ్, అక్షరా హాసన్, అభిహాసన్, లీనా, వికాస్, చెర్రీ తదితరులు
సంగీతం: జిబ్రాన్
కెమెరా: శ్రీనివాస్ ఆర్.గుత్తా
మాటలు: శశాంక్
పాటలు: రామజోగయ్య శాస్త్రి
ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్
నిర్మాతలు:టి.నరేష్ కుమార్, టి. శ్రీధర్
దర్శకత్వం: రాజేశ్ ఎం.సెల్వ
కమల్‌హాసన్ అంటే సినిమాలో ఏదో ఓ కొత్తదనం ఉంటుంది. ఆయన బాటలోనే నడిచే హీరోల్లో చియాన్ విక్రమ్ ఒకరు. విక్రమ్ కూడా తన పాత్ర కోసం ఎంత కష్టమైనా పడతారు. జయాపజయాలను పక్కన పెడితే విక్రమ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి ఉంటుంది. అలాంటి అంచనాలతో రూపొందిన చిత్రమే `కడరం కొండాన్`. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ చిత్రాన్ని కమల్‌హాసన్ నిర్మించగా.. ఆయన రెండో కుమార్తెఅక్షరా హాసన్ హీరోయిన్‌గా నటించింది. ఈచిత్రాన్ని తెలుగులో `మిస్టర్ కెకె` పేరుతో విడుదల చేశారు టి.అంజయ్య. మరి సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం..
కథ:
ఇది మలేషియా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ. ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ విన్సెంట్(వికాస్), కల్పన(లీనా ) మద్య ఫ్రొఫెషనల్ వార్ జరుగుతుంటుంది. విన్సెంట్ మేజర్ కేసులను డీల్ చేస్తుంటాడు. ఇలాంటి తరుణంలో మలేషియాకు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న జంట వాసు(అభిహాసన్), అదిరా(అక్షరా హాసన్) వస్తారు. అదిరా నెలలు నుండి గర్భవతి. ఆమెను వాసు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో ఇద్దరు వ్యక్తలు కె.కె(విక్రమ్)ను చంపడానికి ప్రయత్నిస్తారు. కె.కెకి యాక్సిడెంట్ జరుగుతుంది. అతన్ని పోలీసులు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కె.కె ను హాస్పిటల్లో ఎవరో చంపడానికి ప్రయత్నిస్తే.. వాసు కాపాడుతాడు. కానీ కొందరు అదిరాను కిడ్నాప్ చేస్తారు. కె.కె. ఎవరికీ తెలియకుండా బయటకు తెస్తేనే ఆమెను విడిచిపెడతామనే కండీషన్ పెడతారు. అప్పుడు వాసు, కె.కె ను హాస్పిటల్ నుండి తప్పిస్తాడు. అసలు వాసును బెదిరించింది ఎవరు? కె.కె ఎవరు? చివరకు వాసు, తన భార్యను రక్షించుకుంటాడా? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
నటీనటుల విషయానికి వస్తే చియాన్ విక్రమ్ గురించి ముందు ప్రస్తావించుకోవాలి. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కె.కె అనే డబుల్ ఏజెంట్ పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు విక్రమ్. ఆయన పాత్ర సినిమా అంతా గ్రే షేడ్స్‌తోనే సాగుతుంది. అలాగే మరో పక్క హీరోను కాపాడే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. ఒక పక్క సాఫ్ట్ కార్నర్.. మరో పక్క గ్రే షేడ్స్ ఉన్న పాత్రను విక్రమ్ చాలా సునాయసంగా చేశాడు. ఇక అక్షరా హాసన్ నటన బావుంది. ముఖ్యంగా సినిమాలో ప్రధానంగా ఉండే ఎమోషనల్ సీన్స్‌లో ఆమె నటన బావుంది. క్లైమాక్స్‌లో తన బిడ్డను కాపాడుకోవడానికి ఆమె పోలీస్ ఆఫీసర్‌తో చేసే పోరాటం.. అలాగే తన బిడ్డ ఎక్కడ చనిపోతుందోనని దిగులు పడే సన్నివేశాల్లో అక్షరా హాసన్ చక్కటి అభినయాన్ని కనపిచారు. ఇక అక్షరా హాసన్ భర్త పాత్రలో నటించి అభిహాసన్ పాత్రకు వందశాతం న్యాయం చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న గర్భవతిగా ఉన్న భార్యను రక్షించుకోవడానికి అతను పడే తాపత్రయం తెరపై కనపడుతుంది. లీనా, చెర్రీ, వికాస్ అందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
ఇక సాంకేతికంగా చూస్తే డైరెక్టర్ రాజేశ్ ఎం.సెల్వ `చీకటిరాజ్యం`లో ముగింపు ముందు వరకు కమల్‌ను గ్రేషేడ్స్‌లోనే చూపిస్తూ వచ్చి ట్విస్ట్ ఇచ్చాడు. `మిస్టర్ కెకె`లో అంత పెద్దట్విస్ట్ లేకపోయినా గ్రే షేడ్స్ ఉన్న హీరోను చక్కగా ఎలివేట్ చేశారు. ఫస్టాఫ్ అంతా అసలు విక్రమ్ ఎవరు? అతన్ని చంపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారనే దానిపైనే ఆసక్తికరంగా సినిమా రన్ అవుతుంది. సెకండాఫ్‌లో విక్రమ్ సమస్యను ఎలా ఛేదించాడనే దానిపై ఫోకస్ చేస్తూ సినిమాను నడిపారు. సెకండాఫ్‌లో మలేషియాలో షూట్ చేసిన చేజింగ్ సీన్ చాలా బావుంది. రాజేశ్ ఎం.సెల్వ ఓ స్టైలిష్ మూవీని చక్కగా తెరకెక్కించాడు. సినిమా చూస్తున్నంత సేపు అంతర్జాతీయ సినిమా చూస్తున్నట్లు ఉంటుంది. యాక్షన్ సీన్స్‌లో విక్రమ్ చక్కగా నటించాడు. ఇక సినిమా చివర్లో ఇచ్చిన ట్విస్ట్ బావుంది. జిబ్రాన్ సంగీత, నేపథ్య సంగీతం బావున్నాయి. శ్రీనివాస్ ఆర్.గుత్తా కెమెరా వర్క్ సింప్లీ సూపర్బ్. ప్రతి సీన్ రిచ్‌గా ఉంది. ప్రవీణ్ కె.ఎల్ ఎడిటింగ్ బావుంది. నిర్మాతగా అన్ కాంప్రమైజ్‌డ్‌గా కమల్‌హాసన్ సినిమాను రూపొందించిన తీరు ఆయన ప్యాషన్‌ను తెలియజేస్తుంది.
బాటమ్ లైన్ : హాలీవుడ్ తరహా యాక్షన్ థ్రిల్లర్
రేటింగ్: 3/5