‘ఓ బేబీ’ రచయితగా నా విజయాన్ని అమ్మ, అమ్మమ్మకు అంకితమిస్తున్నా! – మాటల రచయిత లక్ష్మీ భూపాల్‌

0
534

‘చందమామ’, ‘అలా మొదలైంది’, ‘మహాత్మ’, ‘టెర్రర్‌’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘కల్యాణ వైభోగమే’ చిత్రాలతో మాటల రచయితగా మంచి పేరు తెచ్చుకున్నారు లక్ష్మీ భూపాల్‌. ఇటీవల విడుదలైన ‘ఓ బేబీ’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే, లక్ష్మీ భూపాల్‌ తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా ప్రవేశించి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు.

– సాధారణంగా మీడియా ముందుకు రాని మీరు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం?

‘ఓ బేబీ’ విడుదల తర్వాత ప్రేక్షకులు, విమర్శకులు సమంత నటన, నందినీరెడ్డి దర్శకత్వంతో పాటు నేను రాసిన మాటల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు ఫోన్ చేసి అరగంటకు పైగా మాట్లాడారు. కెఎస్ రామారావుగారు ఫోన్ చేశారు. ఇండస్ట్రీ నుంచి, ప్రేక్షకుల నుంచి ఎన్నో ఫోనులు వచ్చాయి. అందరికీ కృతజ్ఞత తెలపడానికి వచ్చాను.

– ‘ఓ బేబీ’ విజయం మీకు అంత ప్రత్యేకమా?

నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఒక 50, 60 సినిమాలు చేశా. అందులో కొన్ని విజయాలు ఉన్నాయి. ఇన్నేళ్లలో ఇన్ని సినిమాలు చేసినా రాని శాటిశ్‌ఫ్యాక్ష‌న్‌ ‘ఓ బేబీ’కి వచ్చింది. మాటల గురించి ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తుంటే సంతోషంగా ఉంది. వ్యక్తిగతంగానూ సినిమాకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. మా నాన్నగారు నా చిన్నతనంలో మరణించారు. అప్పటి నుంచి అమ్మ, అమ్మమ్మ సంరక్షణలో పెరిగాను. అందుకని, సినిమా కథ నాకు మరింత కనెక్ట్ అయింది. ఇందులో బేబీ పాత్రకు రాసిన ప్రతి మాట మా అమ్మ లేదా అమ్మమ్మ అన్న మాటలే. నేను చిన్నతనంలో ఎన్నోసార్లు విన్న మాటలే. ఉదాహరణకు… ‘మగాళ్లు అందరికీ మొగుడులా బతికా’ అని లక్ష్మిగారు ఒక సన్నివేశంలో డైలాగ్ చెబుతారు. నేనది అమ్మమ్మ నోటి నుంచి 150 సార్లు విని ఉంటాను. అందుకని, ‘ఓ బేబీ’ మాటల రచయితగా నా విజయాన్ని మా అమ్మ, అమ్మమ్మకు అంకితం ఇస్తున్నాను.

– సినిమా చూశాక, మీ అమ్మగారు ఏమన్నారు?

అమ్మ సినిమా చూసేటప్పుడు నేను పక్కనే కూర్చున్నాను. కొన్ని సన్నివేశాలు వచ్చేటప్పుడు నావైపు చూసేది. ఉదాహరణకు… చేపల పులుసు వాసన చూసి ఉప్పు సరిపోలేదని నేను చెప్పేస్తా. లక్ష్మిగారి పాత్రకు దాన్ని అన్వయిస్తూ సన్నివేశం రాశా. ఇటువంటివి కొన్ని ఉన్నాయి. అమ్మకు సినిమా బాగా నచ్చింది.

– కొన్ని ఘాటైన డైలాగులు కూడా రాశారు. మగాళ్లపై విమర్శ చేసినట్టున్నారు?

‘మొలతాడుకి, మోకాలి మధ్య కొవ్వు పెరిగిపోయి కొట్టుకుంటున్నారు’ డైలాగ్ గురించేనా? సినిమాలో నాగశౌర్య పాత్రను ఉద్దేశించి సమంతగారు ఆ డైలాగ్ చెప్పారని అనుకుంటున్నారు. సరిగా వింటే అందరినీ ఉద్దేశించి రాసిన డైలాగ్ అని తెలుస్తుంది. ప్రతివారం ఎక్కడో చోట చూస్తున్నాం లేదా వింటున్నాం. తొమ్మిదేళ్ల పాపపై అని, మరొకటి అని. అందుకే, ఆ మాట రాశా. సెన్సార్ వాళ్లకు భయపడి నేను చెప్పాలనుకున్న భావాన్ని పూర్తిగా కాకుండా, కొంచెం సుతిమెత్తగా రాశా. లేదంటే ఇంకా ఘాటుగా రాసేవాణ్ణి.

– కృష్ణవంశీ, నందినిరెడ్డి, సతీష్ కాసెట్టి… వీళ్లతో ఎక్కువ సినిమాలు చేసినట్టున్నారు?

అవును. ఒక్కొక్కరితో మూడేసి సినిమాలు చేశా. ఇంకా చాలామందితో చేశా. తేజగారితో చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ మంచి పేరు తెచ్చింది.

– స్టార్ హీరోల సినిమాలకు చేయకపోవడానికి కారణం?

కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ, కుదరలేదు. రవితేజ ‘బలాదూర్’కి చేశాను కదా! బహుశా… నేను పంచ్ డైలాగులు, ప్రాసలకు దూరంగా ఉంటాను కనుక అవకాశాలు రాలేదేమో. స్టార్ హీరోలు, దర్శకులు అవకాశాలు ఇవ్వలేదేమో. నాకు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాలు చేయాలని ఉంటుంది. అవకాశం వస్తే… వాళ్ల బాలాలు చూపించేలా డైలాగులు రాయాలని ఉంటుంది. చిరంజీవిగారు ‘దొంగ మొగుడు’ వంటి సినిమా చేస్తే ఎంత హుషారుగా ఉంటుందో ఆలోచించండి. అవకాశాల కోసం చూస్తున్నాను. స్టార్ హీరోలతో పనిచేయలేదేమో గానీ… స్టార్ ప్రొడక్షన్ హౌసులు సురేష్ ప్రొడక్షన్స్, వైజయంతి మూవీస్, ఉషాకిరణ్ మూవీస్ కి పని చేశా. నా ఫస్ట్ మూవీ ‘సోగ్గాడు’ సురేష్ ప్రొడక్షన్స్ సినిమా.

– సినిమాలు ప్లాప్ అయితే రైటర్ పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

నేను రైటర్ గా వర్క్ చేసిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. కానీ, రైటర్ గా నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు. ఫెయిల్ అయితే తర్వాత మరో అవకాశం వచ్చేది కాదు కదా. ఫెయిల్యూర్ వచ్చిన ప్రతిసారి నేను లక్ష రూపాయల రెమ్యునరేషన్ పెంచేవాణ్ణి. కసితో రాసేవాణ్ణి.

– ప్రజెంట్ రైటర్స్ రెమ్యునరేషన్ ఎలా ఉంది?

బావుంది. హ్యాట్సాఫ్ టు త్రివిక్రమ్ గారు. ఆయన ఒక ప్యారామీటర్ సెట్ చేశారు. రైటర్ ఇంత తీసుకోవచ్చు, రైటర్ కి ఇంత ఇవ్వొచ్చు అని చూపించారు.

– ఇటీవల రచయితలు దర్శకులుగా మారుతున్నారు. మీరు?

కొందరు రచయితలు ఫ్ర‌స్ట్రేష‌న్‌లో దర్శకులు అవుతున్నారు. తాము రాసినది దర్శకులు సరిగా ఆవిష్కరించడం లేదనే కోపంలో దర్శకులుగా మారుతున్నారు. నేను ఫ్ర‌స్ట్రేష‌న్‌లో, కోపంలో దర్శకుడు కావాలని అనుకోవడం లేదు. నేను మాత్రమే కథకు న్యాయం చేయగలని భావించిన రోజున మెగాఫోన్ పడతా.

– మీ దగ్గర ఎన్ని కథలున్నాయి? అందులో మీరు మాత్రమే న్యాయం చేయగలిగినవి ఎన్ని?

నా దగ్గర మొత్తం 24 కథలున్నాయి. అందులో ఆరు కథలను నా కోసం పక్కన పెట్టుకున్నా. సతీష్ కాసెట్టికి ఒక కథ ఇచ్చాను. అలాగే, రచయితగా రెండు మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here