దివంగత నటులు రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి గారి తనయుడు మేఘంశ్ శ్రీహరి హీరోగా తొలిసారి తెలుగు తెరకు పరిచయం అవుతున్న రాజ్ దూత్ సినిమా టీజర్ మరియు పాటలు ఇటీవల యూట్యూబ్ లో విడుదలై, వీక్షకుల నుండి మంచి స్పందనను సంపాదించాయి. ఇక ఇటీవల ట్రైలర్ విడుదల తరువాత ఆ అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పాలి. రాజ్ దూత్ బైక్ వెతుకులాట కోసం సాగె ట్రైలర్ లో మేఘంశ్ పలికిన డైలాగులు, చేసిన డాన్స్ మరియు ఫైట్స్ వీక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, సెన్సార్ బోర్డు నుండి క్లీన్ యు సర్టిఫికెట్ ని పొందింది. ఈ సినిమాకి దర్శక ద్వయం అర్జున్ – కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా మేఘంశ్ సరసన నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎమ్.ఎల్.వి సత్యనారాయణ ఈ సినిమాని ఎంతో గ్రాండ్ గా నిర్మించడం జరిగింది. ఇంకా ఈ సినిమాలో సుదర్శన్, కోటశ్రీనివాసరావు, ఆదిత్యమీనన్, ఏడిద శ్రీరామ్, దేవిప్రసాద్, అనిష్ కురివిళ్ళ, మనోబాల తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తుండగా సినిమాటోగ్రఫీని విద్య సాగర్ చింతా, ఎడిటింగ్ ను విజయవర్దన్ కావూరి, అలానే సంగీతాన్ని వరుణ్ సునీల్ సమకూరుస్తున్నారు.


