మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలు నిర్మించి ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకోవాలనేదే నా డ్రీమ్ – యంగ్‌ ప్రొడ్యూసర్‌ ఎస్‌.కె.ఎన్‌

0
190

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ చిత్రంతో సక్సెస్‌ఫుల్‌గా నిర్మాతగా అందరి ప్రశంసలతో తనంకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్‌ ప్రొడ్యూసర్‌ ఎస్‌.కె.ఎన్‌. జూలై 7 తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విలేకరులతో తన జర్నీ గురించి మాట్లాడారు.. ఆ విశేషాలు…

మీ జర్నీ ఎలా స్టార్ట్‌ అయ్యింది?
– నేను మెగాస్టార్‌ చిరంజీవిగారికి పెద్ద అభిమానిని. 18 సంవత్సరాల క్రితం మెగా ఫ్యాన్స్‌ క్లబ్‌ రన్‌ చేస్తూ ఆన్‌లైన్‌లో చిరంజీవిగారి సినిమా రికార్డ్‌లు అప్‌డేట్‌ చేస్తుండేవాడిని. అప్పట్లో ఇంటర్నెట్‌ తక్కువ. ఆ టైమ్‌లో వేరే, వేరే దేశాలలో ఉన్న మెగా ఫ్యాన్స్‌ యునైటెడ్‌ అవుతుండేవారు. మా ఏలూరులో పెద్ద హీరోల సినిమాలన్నీ ఎర్లీ మార్నింగ్‌ మూడు గంటలకి షో వేసేవారు. ఆ సినిమా చూసి రిపోర్ట్‌ రాసి, వెబ్‌లో అప్‌లోడ్‌ చేసేవాడిని. ఆ క్రమంలో అల్లు శిరీష్‌, చిరంజీవిగారి స్నేహితులు కోనేరు కుమార్‌గారు పరిచయం అయ్యారు. తరువాత ఒక రోజు విజయవాడలో ‘ఇంద్ర’ ఫంక్షన్‌ జరుగుతున్న సమయంలో శిరీష్‌ నన్ను అల్లు అర్జున్‌కి పరిచయం చేశారు. ఇద్దరం కలిసి చిరంజీవిగారి ఏక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొనేవాళ్లం. అల్లు అర్జున్‌ హీరో అయ్యాక ఆయన సినిమాలకి పిఆర్‌గా జాయిన్‌ అయ్యాను. తరువాత పవన్‌కళ్యాణ్‌, చరణ్‌గార్ల సినిమాలకి పిఆర్‌గా చేశాను. ఈ ప్రాసెస్‌లో నేను, మారుతి, బన్నీ వాసు, యు.వి. క్రియేషన్స్‌ వంశీ కలిసి సినిమాలు డిస్ట్రిబ్యూషన్‌ చేశాం. అలా సినిమాల మీద నాలెడ్జ్‌ పెంచుకొన్నాను. ఆ తర్వాత మారుతి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఈరోజుల్లో’తో తొలిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాను.

ఆ సినిమాకి హ్యూజ్‌ రెస్పాన్స్‌ వచ్చింది కదా?
– అవునండి. ఆ సినిమా చూసి రామ్‌గోపాల్‌ వర్మగారు ట్వీట్‌ చేశారు. ఆ సినిమా చిన్న బడ్జెట్‌లో తీసినా పెద్ద హిట్‌ అయ్యింది. అలా మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమాకి నిర్మాణ రంగంలో వర్క్‌ చేశాను.

చిరంజీవిగారితో మీ అనుబంధం గురించి చెప్పండి?
– చిరంజీవిగారి సినిమాలకి పరోక్షంగా మాత్రమే వర్క్‌ చేశాను. మెగా అభిమానిగా నావంతు బాధ్యతగా ట్విట్టర్‌లో అప్‌డేట్స్‌ ఇచ్చేవాడ్ని. నేను తీసిన ‘టాక్సీవాలా’ చిత్రం చిరంజీవిగారు చూసి నన్ను ఇంటికి పిలిచి రెండు గంటలు ఆ సినిమా గురించి ఆప్యాయంగా మాట్లాడారు. అది నా జీవితంలో ఒక మెమరబుల్ రోజు.

ప్రొడ్యూసర్‌ అంటే టఫ్‌జాబ్ కదా! ఆ ప్రెజర్‌ని ఎలా హ్యాండిల్‌ చేస్తున్నారు?
– అరవింద్‌గారు, యు.వి. క్రియేషన్స్‌లాంటి హేమాహేమీలు నాకు అండగా ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందీ రాలేదు. సినిమా అంటే కేవలం ఫండింగే కాదు, మార్కెటింగ్‌, పబ్లిసిటీ కూడా చాలా ఇంపార్టెంట్‌. 15 ఏళ్లు పిఆర్‌గా పని చేసిన అనుభవం సినిమా మార్కెటింగ్‌, ప్రమోషన్స్‌ విషయంలో హెల్ప్‌ అయ్యింది. బన్నీవాసు, మారుతి, నేను మొదటి నుండి కలిసి ట్రావెల్‌ చేయడం వల్ల మంచి కథల్ని ఎన్నుకొని ఆడియన్స్‌కి నచ్చేవిధంగా సినిమాలు తీశాం. హయ్యస్ట్‌ సక్సెస్‌ రేట్‌ ఉన్న ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన అరవింద్‌గారు మాకు చాలా మంచి సజెషన్స్‌ ఇచ్చి ఎంకరేజ్‌ చేశారు. ఆయన ఏం చేసినా పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తోనే చేస్తారు. ఈ సందర్భంగా అరవింద్‌గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

అల్లు అర్జున్‌ మీకు ఎలాంటి సపోర్ట్‌ని అందిచారు?
– నన్ను, వాసుతో పాటు మా టీమ్‌ అందరికీ ఎంత హెల్ప్‌ కావాలో అంత హెల్ప్‌ చేస్తారు. ఆయన మాకు కొండంత అండగా నిలబడ్డారు. అలా మా వెనక ఆయన ఉన్నారన్న ధైర్యం మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా..

మిగితా హీరోలతో మీ బాండింగ్‌ గురించి?
– నా దృష్టిలో మెగా ఫ్యాన్‌ అంటే మూవీ లవర్‌ అని అర్థం. అలా ప్రతి సినిమాని ఎంజాయ్‌ చేస్తాను. అలా నేను ప్రభాస్‌, రవితేజగారి సినిమాలకి వర్క్‌ చేశాను. అలా అందరి హీరోల ఫ్యాన్స్‌తో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. నా సినిమా ‘టాక్సీవాలా’ కష్టాల్లో ఉన్నప్పుడు మెగా ఫ్యాన్స్‌తో పాటు అందరూ హీరోల ఫ్యాన్స్‌ ముందుకు వచ్చి నాకెంతో సపోర్ట్‌ చేశారు. ఆ సినిమాకి ‘జీ’ తెలుగువారు డెబ్యూ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ అవార్డు ఇచ్చారు. అది నా జీవితంలో మర్చిపోలేని రోజు.

మీకు ఏదయినా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉందా?
– నేను చేసే ప్రతి సినిమా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గానే భావించి, దాని కోసం కష్టపడుతూ ఉంటాను. నేను వేసే ప్రతి అడుగూ నాకు అమూల్యమైనదే. అలా నాకు, నాతో ప్రయాణించే వారికి అన్నింట్లోనూ బెస్ట్‌ ఎలా ఇవ్వగలను అని ఆలోచిస్తాను. ఎందుకంటే తెలుగు సినిమాలకు సుపీరియర్‌ పవర్‌ ఉందని నేను నమ్ముతాను. ఎందుకంటే ‘బాహుబలి’తో మనమేంటో తెలియజేశాం. త్వరలో రాబోయే ‘సాహో’, ‘సైరా’, ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రాలతో మన స్టామినా ఏంటో ప్రపంచానికి తెలియజేయాలని కోరుకుంటున్నాను.

‘ప్రతిరోజూ పండగే’ ప్రోగ్రెస్‌ ఏంటి?
– ఆ చిత్రానికి నేను కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాను. నిర్మాత బన్నీ వాసుగారు. ‘టాక్సీవాలా’ చిత్రం తర్వాత చాలా స్క్రిప్ట్స్‌ విన్నాను. కమర్షియల్‌గానే కాకుండా నావెల్టీగా ఉండే స్క్రిప్ట్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను. మీడియా వ్యక్తిగా బాధ్యతాయుతమైన సినిమాలే నిర్మించాలని అనుకుంటున్నాను. దాని కోసం ఇద్దరు కొత్త దర్శకులు స్టోరి చెప్పారు. స్క్రిప్ట్‌వర్క్‌ జరుగుతోంది. స్క్రిప్ట్‌ పూర్తయ్యాక కాస్టింగ్‌ వివరాలు తెలియజేస్తాను.

మారుతి, బన్నీ వాసు ఇద్దరూ విభిన్న తరహా చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తారు కదా! ఈ చిత్రం ఎలా ఉండబోతుంది?
– షూటింగ్‌ స్టార్ట్‌ అయి మూడు రోజులవుతుంది. మారుతి నుండి వచ్చిన గత చిత్రాల కంటే డిఫరెంట్‌ ప్యాట్రన్‌లో ఈ చిత్రం ఉంటుంది. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే కాకుండా మంచి ఎమోషన్‌ కూడా ఉంటుంది.

నిర్మాతగా ఏ హీరోతో సినిమా తీయాలనుకుంటున్నారు?
– నా మొదటి సినిమాకే విజయ్‌ దేవరకొండలాంటి అప్‌కమింగ్‌ క్రేజీ హీరోతో వర్క్‌ చేసే అవకాశం వచ్చింది. అలాగే మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలు నిర్మించి నేను వర్క్‌ చేసిన అందరి హీరోలతో ప్రశంసలు పొందాలనేది నా కోరిక.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు నిర్మాత ఎస్‌.కె.ఎన్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here