సాహోకు పోటీగా వస్తున్న..అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం

0
423

ఆగష్టు 15ను సినీ చరిత్రలో మరో బిగ్గెస్ట్ బాక్సఫీస్ క్లాష్ కు ముహూర్తం కాబోతుంది. స్వతంత్ర దినోత్సవం రోజున మూడు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలవనున్నాయి. ముగ్గురు జాతీయ స్థాయి నటులైన ప్రభాస్.. అక్షయ్ కుమార్.. జాన్ అబ్రహం వారి సినిమాలను ఒకే రోజు విడుదల చేయడానికి పూనుకున్నారు. ఒకరిది భారీ బడ్జెట్ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రమైతే మరొకరిది ఇస్రో చేపట్టిన మంగళ్ యాన్ పై ఆధారితమైన స్పేస్ మూవీ.. ఇంకొకరిది నిజ సంఘటనలపై ఆధారితమైన థ్రిల్లర్ చిత్రం. వీటిలో ఏది ఏమేర విజయం సాధిస్తుందో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.

సాహూతో వస్తున్న ప్రభాస్..

ప్రభాస్ కెరీర్ లో సాహూ మూవీ ఎంతో ప్రత్యేకం. సాహూ.. బాహుబలి తరువాత వస్తున్న సినిమా. బాహుబలి సినిమా ప్రభాస్ ఖ్యాతిని ఖండాంతరాలకు దాటించింది. దీంతో ప్రభాస్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. సాహూ సినిమా కోసం తెలుగు అభిమానులతో పాటు దేశీయ.. విదేశీ అభిమానులు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ను చూసి సినిమాపై అభిమానులు అంచనాలను పెంచుకున్నారు. సాహూలో యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని టాక్. కేవలం రన్ రాజా రన్ అనే ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడు సుజీత్.. రెండవ సినిమాగా 300కోట్ల బడ్జెట్ తో సాహూ చిత్రాన్ని రూపొందించడం సాహసమే. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. అలాగే పలువురు తమిళ, హిందీ నటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటివరకు సాహూకు ఏ చిత్రం పోటీ లేదని అంతా అనుకున్నారు. కానీ మిషన్ మంగళ్, బాల్టా హౌస్ చిత్రాలు కూడా అదే తేదీన విడుదల అవుతున్నాయని ప్రకటించడంతో బిగ్ బాక్సాఫీస్ ఫైట్ కు తెరలేసింది.

మిషన్ మంగళ్..

ఈ సినిమా మన దేశ అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక స్పేస్ మిషన్ మంగళయాన్ ఆధారంగా తెరకెక్కుతుంది. బాహుబలి చిత్రం వసూళ్ల కంటే తక్కువ ఖర్చుతో మన ఇస్రో శాస్తవేత్తలు ఒక ఉపగ్రహాన్ని అంగారకుడి పైకి పంపి ఔరా అనిపించారు. ఈ ఫీట్ సాధించిన తరువాత ఒక్కసారిగా ప్రపంచ దేశాల దృష్టి ఇస్రోపై పడింది. ఇంతటి ప్రతిష్టాత్మక మిషన్ లో ఓ ఐదుగురు మహిళా శాస్త్రవేత్తల కృషి ఎంతగానో ఉంది. ఆ ఐదుగురి కథే ఈ మిషన్ మంగళ్. విద్య బాలన్, సోనాక్షి సిన్హా, నిత్య మీనన్, కృతి కులకర్ణి, తాప్సి ఆ ఐదుగురు మహిళా శాస్త్రవేత్తల పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు అక్షయ్ కుమార్, శర్మాన్ జోషీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా జగన్ శక్తి అనే యువకుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఒక రకంగా దేశభక్తి చిత్రమైన ఈ సినిమాను స్వతంత్ర దినోత్సవం రోజునే విడుదల చేసి జాతికి అంకితం చేయడం ఉత్తమమని మిషన్ మంగళ్ చిత్ర బృందం భావిస్తుంది. దీంతో సాహు విడుదల తేదీని ముందుగానే ప్రకటించినప్పటికీ అక్షయ్ కుమార్ కూడా తన చిత్రాన్ని అదే రోజున విడుదల చేయాలనీ నిర్ణయించినట్టు సమాచారం.

బట్ల హౌస్ తో జాన్ అబ్రహం

19 సెప్టెంబర్ 2008 ఢిల్లీలోని జామియా నగర్ లోని బట్ల హౌస్ లో జరిగిన ఉత్కంఠభరిత ఎన్కౌంటర్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా జాన్ అబ్రహం నటిస్తున్నారు. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు బట్ల హౌస్ లో దాకొన్ని ఉన్న ఇండియన్ ముజాహిద్దీన్ టెర్రరిస్టులను ఏరివేసిన సంఘటన ఇది. ఈ కథలో కూడా దేశభక్తి దాగి ఉండడంతో దీనిని స్వతంత్ర దినోత్సవం రోజునే విడుదల చేయాలనీ చిత్రం బృందం భావించింది. దీంతో బట్ల హౌస్ చిత్రం కూడా సాహూకు పోటీగా వచ్చి చేరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here