విభిన్న కథాంశాలతో రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఓబేబీ, బుర్రకథ చిత్రాలు….!!

0
86

సినిమా ఇండస్ట్రీలో శుక్రవారం వస్తుందంటే చాలు, చాలావరకు కొత్త చిత్రాలు విడుదలకు సిద్దమవుతుంటాయి. ఇక రేపటి శుక్రవారం కూడా రెండు విభిన్న చిత్రాలు మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అవి సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ, అలానే ఆది సాయికుమార్ హీరోగా నటించిన బుర్రకథ. ఇక వీటిలో రెండూ కూడా వేటికవే ఒకదానికొకటి సంబంధం లేని జానర్లలో వస్తున్న చిత్రాలు. ఆ రెండు చిత్రాల ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఓ బేబీ : ఇప్పటివరకు కెరీర్ పరంగా తాను నటించిన చిత్రాల్లోని పాత్రలన్నిటికంటే ప్రస్తుతం తాను నటిస్తున్న ఓబేబీ చిత్రం లోని పాత్ర ఎంతో ప్రత్యేకమని అంటున్నారు సమంత. తన సినిమా కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నో పాత్రల్లో నటించినప్పటికీ, తనకు పూర్తి స్థాయి వినోదాత్మక పాత్ర చేయాలని ఉండేదని, అయితే ఆ కోరిక ఈ చిత్రం ద్వారా తీరుతోందని సమంత ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కొరియాలో కొన్నాళ్ల క్రితం విడుదలై మంచి విజయాన్ని అందుకున్న మిస్ గ్రానీ అనే చిత్రానికి అధికారిక రీమేక్ గా రాబోతున్న ఈ చిత్రంలో సమంత యువతిగా, అలానే వృద్ధురాలిగా రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం మొత్తానికి సమంత పాత్రే హైలైట్ అని, అలానే సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ పోషించిన పాత్రకు కూడా మంచి పేరొస్తుందని చిత్ర బృందం చెపుతోంది.  మంచి కథ దొరికే వరకు ఎంత సమయం అయినా వేచిచూద్దామని ఆగి, చివరకు ఈ ఓబేబీ కథను ఎంపిక చేశామని, ఇక తమ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరు చిత్రం తప్పకుండా సక్సెస్ అవ్వాలని ఎంతో కృషితో కష్టపడ్డారని, తమ కృషి రేపు విడుదల తరువాత ఫలిస్తోందని భావిస్తున్నట్లు ఈ చిత్ర దర్శకురాలు నందిని రెడ్డి అంటున్నారు.

బుర్రకథ : ఇప్పటివరకు టాలీవుడ్ లోని పలు విజయవంతమైన చిత్రాలకు తన పదునైన కలంతో మాటల ముత్యాలను అందించిన డైమండ్ రత్నబాబు గారు తొలిసారి మెగాఫోన్ పడుతున్న చిత్రమే ఈ బుర్రకథ. తాను సహా చిత్ర బృందం మొత్తం షూటింగ్ జరుగుతున్నన్నిరోజులు చిత్రం తప్పకుండా మంచి హిట్ కొట్టాలని ఎంతో శ్రమ పడ్డామని, ఇక నటుడు ఆది కూడా హీరోగా పలు కీలక సన్నివేశాల్లో ఎంతో బాగా నటించారని, రేపు విడుదల తరువాత తప్పకుండా చిత్రం సక్సెస్ సాధించి తామందరికి మంచి గుర్తింపునిస్తుందన్న నమ్మకం ఉందని రత్నబాబు అన్నారు. ఆదితో తీసే ఈ చిత్రంతో తప్పకుండా సక్సెస్ సాధిస్తాం, మీరు చూస్తూ ఉండండి, ప్రేక్షకులు మా కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇస్తారు అని దర్శకులు డైమండ్ రత్నబాబు, బుర్రకథ షూటింగ్ ప్రారంభం సమయంలో తనతో అన్నారని, అన్నట్లుగానే చిత్రాన్ని తెరకెక్కించారని డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పుకొచ్చారు. కథా పరంగా హీరోకు రెండు మెదళ్ళు కలిగి ఉండడం అనే ఈ కథాంశం ఇప్పటివరకు ఎవరు స్పృసించలేదని, కేవలం కథ మాత్రమే కాక , దానిని ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లే ని సిద్ధం చేసి ఎంతో కష్టపడి రత్నబాబు  చిత్రాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించారని హీరో ఆది సాయి కుమార్ అన్నారు….!!

యూట్యూబ్ లో విడుదలైన ఈ రెండు చిత్రాల ట్రైలర్లు వీక్షలను బాగా ఆకట్టుకుని ఆయా చిత్రాలపై ఆసక్తిని మరింతగా పెంచాయనే చెప్పాలి. ఇక రేపు శుక్రవారం మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాలు రెండూ మంచి సక్సెస్ సాధించి ఆ చిత్రాల నటీనటులు, దర్శక నిర్మాతలకు మంచి సక్సెస్ ని అందివ్వాలని కోరుకుందాం…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here