ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌తో తెరకెక్కిన మా ‘బుర్రకథ’ ష్యూర్‌షాట్‌ హిట్‌ అవుతుంది – దర్శకుడు డైమండ్‌ రత్నబాబు

0
98

ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు రచయితగా పని చేసి, ఆ చిత్ర విజయాల్లో తనవంతు పాత్ర పోషించారు రైటర్‌ డైమండ్‌ రత్నబాబు. ఈయన తొలిసారిగా లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది సాయికుమార్‌ హీరోగా నటించిన ‘బుర్రకథ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బీరం సుధాకర రెడ్డి సమర్పణలో దీపాల ఆర్ట్‌, టఫెండ్‌ స్టూడియోస్‌ లిమిటెడ్‌ బేనర్లపై హెచ్‌కె. శ్రీకాంత్‌ దీపాల, కిషోర్‌, కిరణ్‌ రెడ్డి సంయుక్తంగా రూపొందించారు. ఈ చిత్రం జూలై 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సందర్భంగా దర్శకుడు డైమండ్‌ రత్నబాబు ఇంటర్వ్యూ.

ముందుగా మీ ప్రస్థానం గురించి చెప్పండి?
– నేను విజయవాడ ‘హాస్యానందం’ పత్రికలో సబ్‌ఎడిటర్‌గా నా జర్నీ స్టార్ట్‌ అయ్యింది. అక్కడి నుండి చింతపల్లి రమణగారి దగ్గర అసిస్టెంట్‌ రైటర్‌గా చేరాను. ఆ సమయంలో ‘దేవదాస్‌’ 150 రోజులు ఆడింది. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో రైటర్‌గా ప్రయత్నాలు మొదలు పెట్టాను. ఆ తరువాత ‘సీమశాస్త్రి’ సినిమాకు స్క్రిప్ట్‌ కో-ఆర్డినేటర్‌గా, ఆతరువాత ఎస్వీకృష్ణారెడ్డి, నాగేశ్వర్‌ రెడ్డి గారితో వర్క్‌ చేసి రవికుమార్‌ చౌదరిగారితో ‘పిల్లానువ్వు లేని జీవితం’, ఆ తరువాత మోహన్‌ బాబుగారి కాంపౌండ్‌లో ‘ఆడో రకం ఈడోరకం’, ‘గాయత్రి’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ లాంటి మంచి సినిమాలకు స్క్రిప్ట్స్‌ రాసే అవకాశం వచ్చింది. ఆ తరువాత దర్శకుడు అవుదామని ప్రయత్నాలు మొదలు పెట్టాను.

‘బుర్ర కథ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవ్వడం ఎలా ఉంది?
– చాలా ఆనందంగా ఉంది. నేను దర్శకుడిని అయ్యానన్న ఉత్సాహంతో, అలాగే నా కల సాధించానన్న నమ్మకంతో నా చేతి మీద డైరెక్టర్‌ అని పచ్చ బొట్టు వేయించుకున్నాను.

మీ కలానికి డైమండ్‌ అని పేరు ఎలా వచ్చింది?
– నేను చిన్నప్పటి నుండి కవితలు ఆ పేరుతోనే రాస్తుండేవాడిని. కవితా గోష్టి లో ఇదే పేరుతో చాలా కవిత్వాలు రాశాను. అలా నా కలం పేరు డైమండ్‌గా మారి డైమండ్‌ రత్నబాబుగా ఇండస్ట్రీకి వచ్చాను.

కథ రాయడానికి మీ ఇన్‌స్పిరేషన్‌ ఏంటి?
– నాకు హాలీవుడ్‌ సినిమాలు, కొరియన్‌ సినిమాలు చూసి కథలు రాయడం నాకు నచ్చదు. ఒక సంవత్సరం పాటు కష్టపడి కథ రాసి సినిమా విడుదలయ్యాక ఇది హాలీవుడ్‌ సినిమా కథ కదా! అంటే ఆ కష్టం అంతా వృధా అయిపోతుంది. అందుకని నేను చాలా స్ట్రిక్ట్‌గా అనుకుని ఆ సినిమాలు చూసి ఇన్‌స్పైర్‌ అయ్యి కథలు రాయొద్దు అని నా కలం మీద ఒట్టు వేసుకున్నాను. రామాయణం మహాభారతంలో చాలా కథలు ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని ఈ కథ రాసుకున్నాను. ఇక క్యారెక్టర్స్‌ విషయానికి వస్తే నేను పెట్రోల్‌ బంక్‌లో పని చేస్తున్నపుడు చాలా మందిని అబ్జర్వ్‌ చేసాను. వాటిలోంచి కొన్ని పాత్రలు తీసుకుంటాను.

‘బుర్రకథ’ ఐడియా ఎలా వచ్చింది?
– ఈ కథ విషయానికి వస్తే ఒక ఫోన్‌లో రెండు సిమ్‌ కార్డులు ఉన్నప్పుడు ఒక మనిషిలో రెండు బ్రైన్స్‌ ఉంటే ఎలా ఉంటుంది అన్న ఐడియాలోంచి వచ్చింది. ఆలా డ్యూయల్‌ సిమ్‌ కార్డు ఫోన్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఈ కథ రాశాను.

దీనికోసం ఏమైనా రీసెర్చ్‌ అవసరమైందా?
– అవును. ఆలోచన రాగానే వెంటనే ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేశాను. ఈ ప్రపంచంలో ఇలా ఎవరైనా ఉన్నారా? అని అయితే ఇలా రెండు బ్రైన్స్‌తో పుట్టినవారు దాదాపు పదహారు మంది ఉన్నారు. వివిధ వయసులలో వారు మరణించారు. అయితే బ్రతికి ఉంటే ఎలా ఉండేవారు అనేది సినిమా.

ఆ క్యారెక్టర్స్‌ గురించి చెప్పండి?
– ప్రతి ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉంటే ఒకరు మాస్‌, మరొకరు క్లాస్‌గా ఉంటారు. అలా మా సినిమాలో కూడా అభి, రామ్‌ అనే రెండు క్యారెక్టర్స్‌ ఉంటాయి. ఒకరు బాగా చదివే వారు, ఒకరు బాగా అల్లరి చేసే క్యారెక్టర్స్‌.

ఈ కాన్సెప్ట్‌తో సినిమా అంటే స్క్రీన్‌ ప్లే కష్టం కదా?
– అవును. ఇది ఒక కొత్త తరహా కాన్సెప్ట్‌ కాబట్టి ఆడియన్స్‌ ఎక్కువ కన్‌ఫ్యూజ్‌ అయ్యే అవకాశం ఎక్కువ. అందుకని నా దగ్గర ఉన్న ఐదుగురు అసిస్టెంట్‌ రైటర్స్‌ సిద్దా బత్తుల కిరణ్‌, సయద్‌ తాజుద్దీన్‌, దివ్య భావన, సురేష్‌ ఆర్బాటి, ప్రసాద్‌ కామినేనిని ఈ సినిమాకి స్క్రీన్‌ ప్లే రైటర్స్‌గా పట్టుకొని వాళ్ళ సహకారంతో సినిమా ఆడియన్స్‌కి ఎలాంటి కన్‌ఫ్యుజ్‌ లేకుండా ఉండే విధంగా ఒక చందమామ కథలాగ తెరకెక్కించాను. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ను, అలాగే ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ కూడా మీరు ఊహించరు. సినిమా తప్పకుండా హిట్‌ అవుతుంది.

ఈ సినిమాలో మెయిన్‌ ఎమోషన్‌?
– ఈ సినిమాలో ఆది, రాజేంద్ర ప్రసాద్‌గారు తండ్రి కొడుకుల్లా కాకుండా స్నేహితుల్లా ఉండేలా వారి క్యారెక్టర్స్‌ డిజైన్‌ చేయడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్‌ క్యారెక్టర్‌కి మా నాన్నగారి పేరు ఈశ్వర రావు అని పెట్టాను. ఎందుకంటే ప్రతి కథ మన ఇంట్లోనేే పుడుతుంది అని నేను నమ్ముతాను. వీళ్లిద్దరి మధ్య కామెడీ, ఎమోషన్‌ చక్కగా కుదిరింది. ఒక సందర్భంలో ప్రతి ఒక్కరు కంటతడి పెట్టేవిధంగా నటించారు.

ఒక రచయిత దర్శకుడు అయితే ఎలాంటి బెనిఫిట్స్‌ ఉంటాయి?
– ఒక రచయిత అయితే పేజీల కొద్దీ డైలాగ్స్‌ రాసేయొచ్చూ. కానీ దర్శకుడు అలా కాదు. ఏ డైలాగ్‌ పెట్టాలో తెలిసి ఉండాలి. చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే.. ద్రౌపది చీర లాగుతుంటే శ్రీక ష్ణుడు చీర మాత్రమే అందించాడు. కానీ కురుక్ష్షేత్ర సమయంలో అర్జునుడు యుద్ధం వదిలేస్తే .. పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత చెప్పాడు. అంటే అక్కడ కేవలం చీర అవసరం మాత్రమే ఉంది. ఇక్కడ డైలాగ్‌ అవసరం ఉంది. అది ప్రతి దర్శకుడు తెలుసుకొని ఏ సీన్‌కి ఏం కావాలో అది చెయ్యాలి. అలా ఒక దర్శకుడిగా నేను ఈ కథకు పూర్తి న్యాయం చేశానని అనుకుంటున్నాను.

దర్శకుడిగా మీ రోల్‌ మోడల్‌?
– నాకు దాసరి నారాయణరావుగారు రోల్‌ మోడల్‌. ఆయన డైరెక్టర్‌ ఈజ్‌ కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ అన్నారు. నేను ఆయనతో రైటర్‌ కంపాస్‌ ఆఫ్‌ షిప్‌ అనమని అన్నాను. అయితే ఆయన ముందు నువ్వు దర్శకుడివి అవ్వు. అప్పుడు తెలుస్తుంది అన్నారు. ఇప్పుడు ఆయన మాట నాకు ఎప్పుడూ ప్రతిధ్వనిస్తుంది.

టెక్నిషియన్స్‌ నుండి ఎలాంటి సహకారం అందింది?
– సినిమా ఎక్కువగా ఎడిట్‌ వెర్షన్‌తో తీయడం వల్లనే 46 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తయ్యింది. దర్శకుడిగా నా మొదటి రోజు, మొదటి సీన్‌కే మా యూనిట్‌ అందరూ క్లాప్‌ కొట్టారు. అలా సినిమాటోగ్రాఫర్‌ రామ్‌ప్రసాద్‌గారు, ఎడిటర్‌ ఎం.ఆర్‌.వర్మగారు మంచి సహకారం అందించారు. సాయి కార్తీక్‌ సంగీతంతో పాటు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌నిచ్చారు.

సినిమా బిజినెస్‌ ఎలా ఉంది?
– ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌తో మంచి బిజినెస్‌ అయింది. వింటేజ్‌ శివరాం గారు డిస్ట్రిబ్యూషన్‌ చేస్తున్నారు. జీ తెలుగువారు శాటిలైట్‌ హక్కులు తీసుకున్నారు. ‘బుర్రకథ’ హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ ఆది కెరీర్‌లోనే హైయెస్ట్‌ రేటుకి అమ్ముడయ్యాయి. దర్శకుడిగా నా మొదటి సినిమాకి ప్రొడ్యూసర్స్‌కి టేబుల్‌ ప్రాఫిట్‌ ఇచ్చామన్న సంతోషం ఉంది.

పృథ్వితో చాలా కాలం తరువాత స్పూఫ్‌ చేయించారు కదా?
– పృథ్విగారితో ‘సాహో’ సినిమాలోని ఫ్యాన్స్‌, డై హార్డ్‌ ఫాన్స్‌ అనే డైలాగ్‌ చెప్పించాను. అది బాగా వైరల్‌ అయింది. అయితే సినిమాలో వెంటబడ్డానా అనే తారక్‌ డైలాగ్‌ ఉంటుంది. దానిని ప్రభాస్‌ ఫాన్స్‌కోసం ట్రైలర్‌లో మార్చి చెప్పించడం జరిగింది. సినిమాలో తారక్‌ డైలాగ్‌ ఉంటుంది.

నెక్స్ట్‌ డైరెక్టర్‌గానే కొనసాగుతారా?
– నేను ఒక ఐదుగురు ప్రొడ్యూసర్స్‌కి కథ చేప్పాను. వారిలో ఒకరికే డైరెక్ట్‌ చేయగలను. మిగతా వారికి నేను కథ ఇస్తాను. ఫ్యూచర్‌లో కూడా దర్శకుడిగా కొనసాగుతూనే కథలు కూడా ఇస్తాను.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు దర్శకుడు డైమండ్‌ రత్నబాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here