‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో అద్భుతమైన నటనతో పాటు డాన్స్‌లు, ఫైట్స్‌తో అలరించి అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు లవ్లీ రాక్‌స్టార్ ఆది సాయి కుమార్. ప్రస్తుతం బీరం సుధాకర రెడ్డి సమర్పణలో దీపాల ఆర్ట్స్, టఫెండ్ స్టూడియోస్ లిమిటెడ్ బ్యానర్లపై హెచ్‌కె. శ్రీకాంత్ దీపాల, కిషోర్, కిరణ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బుర్రకథ’. ఈ చిత్రం ద్వారా ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం జూన్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా లవ్లీ రాక్‌స్టార్ ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ.
రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయడం ఎలా అనిపించింది?
– నాకు ఒక ఛాలెంజింగ్‌గా అనిపించింది. అదే టైములో ఏదైనా క్యారెక్టర్ మనకు ఛాలెంజింగ్‌గా అనిపిస్తేనే మనలోని బెస్ట్ యాక్టర్ కూడా బయటికి వస్తాడు అనిపించింది. చాలా మంది సీనియర్ యాక్టర్స్ ఎందుకు ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఎంచుకుంటారో కూడా అర్ధం అయింది. ఇలాంటి ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మనం రిలాక్స్ అవ్వం. రెండు క్యారెక్టర్స్ ఆడియన్స్‌కి రిజిస్టర్ అవుతాయి అనే నమ్మకంతోనే నటించడం జరిగింది.
అంటే కళ్లజోడు పెడితే ఒక క్యారెక్టర్, పెట్టకపోతే ఒక క్యారెక్టర్?
– అలా అనేం లేదు. కొన్ని సీన్లలో రెండు క్యారెక్టర్స్ కూడా కళ్ళజోడు పెట్టుకోవు. ఎందుకంటే ఈ కథే చాలా స్ట్రాంగ్ ఎలిమెంట్స్‌తో కూడుకున్నది. ఆ రెండు క్యారెక్టర్స్ కూడా ఆడియన్స్‌కి ముందే రిజిస్టర్ అవుతాయి. అది ఎలా అన్నది సినిమా చూసే తెలుసుకోవాలి.
దర్శకుడు ఆ పాయింట్ చెప్పినప్పుడు మీరు ఎలా కన్వీన్స్ అయ్యారు?
– ఈ కథ చెప్పగానే వెంటనే నేను కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఇదివరకే నేను దీనికి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ చదివాను. నాకు పర్సనల్‌గా కూడా ఇలాంటి విషయాలంటే కొంత ఆసక్తి ఉంది. అందుకనే కథ వినగానే ఓకే.. నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడే ఈ కథ ఓకే చేశాను.
ఈ సినిమాలో మీ క్యారెక్టర్స్ గురించి చెప్పండి?
– నా క్యారెక్టర్స్ పేరు అభి, రామ్. అభి క్యారెక్టర్ నేటితరం యువత ఎలా ఆలోచిస్తుందో దానికి ప్రతీకగా ఉంటుంది. ఎలాంటి పరిమితులు లేని ఒక ఎంటర్టైనింగ్ క్యారెక్టర్. వాళ్ళ నాన్నతో కలిసి మందు తాగుతూ సరదాగా అమ్మాయిల వెనకాల తిరుగుతాడు. ఇక రామ్ క్యారెక్టర్‌కి వస్తే కంప్లీట్ ఆపోజిట్‌గా ఉంటుంది.
పేరెంట్స్ అంటే గౌరవం ఎక్కువ. ఒక అబ్దుల్ కలాం, వివేకానందుడు లాంటి ఒక గొప్ప వ్యక్తి అవ్వాలనే కోరిక ఉంటుంది.
ఈ రెండు క్యారెక్టర్స్‌లో మీలో ఎవరున్నారు?
– నా వరకు నేను రామ్లా ఉంటాను అనుకుంటాను. కానీ చాలా మంది నన్ను అభిలా ఉంటావు అంటారు. ఇదే విషయం నేను రత్నబాబు అడిగాను. అయితే మీరు కెమెరా ముందు అభిలా ఉంటారు. కెమెరా ఆఫ్ చేస్తే రామ్లా కనిపిస్తారు అన్నారు. (నవ్వుతూ)
డైరెక్టర్ డైమండ్ రత్నబాబు గురించి చెప్పండి?
– డైమండ్ రత్నబాబు నా దగ్గర స్టోరీ ఉంది అని ఫోన్ చేసినప్పుడే.. ఐ వాంట్ టు డైరెక్ట్ అని పెట్టి మెసేజ్ పంపారు. ఒక రైటర్ తన కథ మీద ఎంత నమ్మకం ఉంటే నేనే డైరెక్ట్ చేస్తాను అని చెప్తాడు. అది కాకుండా ఇంత కాంప్లికేటెడ్ స్టోరీని చాలా ఈజీగా నేరేట్ చేసారు. అప్పుడే నేను అనుకున్న ఈ సినిమాకు రత్నాబాబు పర్ఫెక్ట్ అని. ఎందుకంటే ఒక రైటర్ డైరెక్టర్ అవ్వాలి అనుకుంటున్నాడు అంటేనే అది ఎంత పర్ఫెక్ట్ స్టోరీ నో మనం ఊహించగలము. మొదటి సినిమా అయినా మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మంచి టీంతో ఈ సినిమాను తెరకెక్కించారు. అలాగే అత్యద్భుతమైన డైలాగ్స్ ఆడియన్స్‌కి ఫ్రెష్ఫీల్ని తీసుకువస్తాయి. ఆయన చాలా డెడికేటెడ్ డైరెక్టర్. ఆయనతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది.
హీరోయిన్ గురించి?
– ఈ సినిమాలో మిస్తీ చక్రవర్తి హీరోయిన్గా నటించింది. చాలా టాలెంటెడ్ యాక్ట్రెస్. ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేసింది. రెండు క్యారెక్టర్స్ మధ్య కన్ఫ్యుజ్ అయ్యే అమ్మాయి క్యారెక్టర్. గ్లామరస్‌గా ఉంటూనే నటనకి మంచి స్కోప్ ఉండే క్యారెక్టర్. అలాగే మరో హీరోయిన్ గా నైరాశ కూడా ప్రేక్షకులని అలరిస్తుంది.
ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది కదా?
– అవునండీ. ఇప్పటికే విడుదల చేసిన ‘ఒకటే ఒకటే’ సాంగ్‌కి, అలాగే రీసెంట్గా విడుదల చేసిన ‘నాకొద్దు’ సాంగ్‌కి ఆడియన్స్ నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సాయి కార్తీక్ మ్యూజిక్ గురించి తెలిసిందే. ఈ సినిమాలో అద్భుతమైన సంగీతంతో పాటు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు.
పృథ్వి తో మరోసారి స్పూఫ్ చేయించారు?
– దాని గురించి నేను ఇప్పుడే ఏం చెప్పలేను. కానీ ఈ సినిమాలో చాలాకాలం తర్వాత పృధ్వీ ఫుల్‌లెంగ్త్ ఎంటర్టైన్ క్యారెక్టర్ చేశారు. ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.
ఈ మధ్యకాలంలో యంగ్ హీరోస్ మల్టీస్టారర్ చిత్రాలు చేస్తున్నారు కదా!
– నాకు ఇప్పటివరకూ అలాంటి కథలు రాలేదు. కథ బాగుంటే మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి నేనెప్పుడూ సిద్ధమే.
కథల ఎంపికలో మీ డెసిషన్లో ఏమైనా మార్పులొచ్చాయా?
– అదేం లేదండీ. నాకిప్పటికీ ‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’ సినిమాలతోనే మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వాటి స్థాయిలో గుర్తింపు వచ్చే కథ కోసం వెయిట్ చేశాను. నా దగ్గరకి వచ్చిన కొన్ని స్క్రిప్ట్‌లు విజయవంతం అయ్యాయి. అలాగే కొన్ని అంతగా కనెక్ట్ కాలేదు. కథను జడ్జ్ చేయడంలో ఎలాంటి మార్పు లేదు.
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఎలా ఉండబోతుంది?
– సాయి కిరణ్ అడివిగారి దర్శకత్వంలో అర్జున్ పండిట్ అనే కశ్మీర్ పండిట్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ కథ వినగానే చాలా ఎక్సైటింగ్‌గా అన్పించింది. రియల్ ఇన్సిడెంట్స్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రతి భారతీయుడు గర్వించేవిధంగా పవర్ఫుల్ ఇంటెన్స్ ఉన్న దేశభక్తితో కూడిన చిత్రం. షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది.
మీ తదుపరి చిత్రాల గురించి?
– తెలుగు, తమిళ్ బైలింగ్వల్ చిత్రం షూటింగ్ జరుగుతోంది. యాభై శాతం పూర్తయింది. ఈ చిత్రానికి కార్తీక్, విఘ్నేష్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ప్యూర్ లవ్‌తో కూడిన ఎంటర్టైనర్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. సబ్జెక్ట్ లాక్ చేశాం. ఈ సంవత్సరంలో నేను నటించిన మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు లవ్లీ రాక్‌స్టార్ ఆది సాయికుమార్.


