మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి అనే సినిమా కొత్త సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ నుండి కర్నూల్ వెళ్తున్న వరుణ్ మరియు కొందరు సహనటులు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరొక కారు వేగంగా ఢీకొనడంతో రెండు కార్లు కొంత నుజ్జునుజ్జయ్యాయి.

అయితే ప్రమాద సమయంలో తనకు కానీ, తన సహచరులకు కానీ ఏమి కాలేదని, మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు అంటూ వరుణ్ తేజ్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ తెలిపారు. కాగా ఈ ప్రమాదం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట వద్ద జాతీయ రహదారిపై జరిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం అనంతరం ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసిన పోలీసులు, ఆపై వరుణ్ సహా ఇతర నటులను వేరొక కారులో పంపించడం జరిగింది. ఈ ఘటనతో టాలీవుడ్ ప్రముఖులు మరియు ప్రేక్షకులు కొంత నిర్ఘాంతపోయినప్పటికీ, ప్రమాద సమయంలో ఎవరికి ఏమి కాకపోవడంతో అందరూ కొంత ఊపిరి పీల్చుకున్నారు.