మెగాస్టార్ చిరంజీవి, ఖైదీ నెంబర్ 150 ఘన విజయం తర్వాత ఎటువంటి సినిమాలో నటిస్తారు అనుకుంటున్న తరుణంలో తన కెరీర్లో తొలిసారి ఒక స్వతంత్ర సమరయోధుపాత్ర చేయడానికి సిద్ధమయ్యారు. ఆ సినిమానే ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సైరా నరసింహా రెడ్డి. స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తోంది చిత్ర యూనిట్. అయితే ఈ చిత్రంపై నేడు తిరుమల వేంకటేశ్వరుని దర్శనానంతరం ప్రముఖ రచయిత, నటులు మరియు దర్శకులైన తణికెళ్లభరణి తన మనసులో మాటను అక్కడి మీడియా ముఖంగా బయటపెట్టడం జరిగింది.
ఆయన మాట్లాడుతూ, సైరా చిత్రం ఇప్పటికే చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోందని, సినిమా ఆలస్యం అవుతుంది అనే భావన మెగా అభిమానులకు అక్కర్లేదని, ఎందుకంటే లేట్ గా వచ్చినప్పటికీ, రేపు విడుదల తరువాత ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని అద్భుతమైన రికార్డులు తప్పకుండా నెలకొల్పుతుంది అనే నమ్మకం తనకు ఉందని అన్నారు. ఇక ఈ సినిమాలో తాను ఒక విలక్షణమైన పాత్రలో నటిస్తున్నానని తనికెళ్ళ భరణి అన్నారు. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి వంటి దిగ్గజ నటులు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు…!!