రివ్యూ: హిప్పీ

0
466

హిప్పీ

బ్యానర్: వి క్రియేషన్స్‌

తారాగణం: కార్తికేయ, దిగంగన సూర్యవంశీ, జె.డి.చక్రవర్తి, వెన్నెల కిశోర్‌, శ్రద్ధా దాస్‌, సుదర్శన్‌, జజ్బా సింగ్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌.

సంగీతం: నివాస్‌ కె.ప్రసన్న

నిర్మాత: కలైపులి ఎస్‌.థాను

రచన, దర్శకత్వం: టి.ఎన్‌.కృష్ణ

విడుదల తేదీ: 06.06.2019

ఆర్‌ఎక్స్‌ 100 వంటి డిఫరెంట్‌ యూత్‌ఫుల్‌ మూవీతో హీరోగా పరిచయమైన కార్తికేయ ఆ సినిమా సూపర్‌హిట్‌ అవ్వడంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. తదుపరి సినిమా ‘హిప్పీ’ అనే పేరుతో ప్రారంభం కాగానే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమాకి సంబంధించి విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌, ట్రైలర్‌లలో కార్తికేయ డిఫరెంట్‌ లుక్‌ అందర్నీ ఆకట్టుకుంది. సూర్య, భూమిక, జ్యోతికలతో ‘నువ్వు నేను ప్రేమ’ వంటి ఎమోషనల్‌ లవ్‌స్టోరీని తెరకెక్కించిన టి.ఎన్‌.కృష్ణ ‘హిప్పీ’ చిత్రాన్ని డైరెక్ట్‌ చేశారు. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘హిప్పీ’ ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు రీచ్‌ అయ్యింది? కార్తికేయ తన రెండో చిత్రంతో మరోసారి యూత్‌ని ఎట్రాక్ట్‌ చెయ్యగలిగాడా? డైరెక్టర్‌ టి.ఎన్‌.కృష్ణ ‘హిప్పీ’ చిత్రంతో ఏం చెప్పాలనుకున్నాడు? వంటి విషయాలు తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం.

ప్రేమ…. ఈ పదానికి, ఆ ఫీలింగ్‌కి తరాలు గడుస్తున్న కొద్దీ అర్థాలు మారుతూ వస్తున్నాయి. కాలాన్ని బట్టి ప్రేమకు కొత్త నిర్వచనాలు పుట్టుకొస్తున్నాయి. అయితే ఏ జనరేషన్‌కి ఆ జనరేషన్‌ తమకు అనుకూలంగా ప్రేమ అనే అనుభూతికి మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. ప్రజెంట్‌ ట్రెండ్‌లో ప్రేమకు ఒక్కొక్కరు ఒక్కో అర్థం చెప్తూ వస్తున్నారు. డేటింగ్‌ అనీ, లివింగ్‌ రిలేషన్‌షిప్‌ అనీ… రకరకాలుగా అబ్బాయిలు, అమ్మాయిలు ఒకరినొకరు పూర్తిగా స్టడీ చేసిన తర్వాతే పెళ్ళి దాకా వెళ్తున్నారు. కొంతమంది మధ్యలోనే బ్రేకప్‌ అంటున్నారు. నేటితరం యువత ప్రేమ విషయంలో, పెళ్ళి విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు, వాటివల్ల కలిగే మానసిక సంఘర్షణ నేపథ్యంలో ‘హిప్పీ’ చిత్రం రూపుదిద్దుకుంది. కథ విషయానికి వస్తే దేవా అలియాస్‌ హిప్పీ(కార్తికేయ) ఒక కిక్‌ బాక్సర్‌. అతని కాలేజ్‌ డేస్‌లో తన హిప్పీ హెయిర్‌ స్టైల్‌తో అమ్మాయిల మనసుల్లో అలజడి రేపేవాడు. అలా స్నేహ అనే అమ్మాయితో రొమాన్స్‌ చేస్తుంటాడు. అనుకోకుండా స్నేహ ఫ్రెండ్‌ అయిన ఆముక్త మాల్యద(దిగంగన సూర్యవంశీ)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత దేవా, ఆముక్త లవర్స్‌గా మారిపోతారు. లవర్‌ బోయ్‌ అయిన దేవాను ఎప్పుడు ఎవరు తన్నుకుపోతారోనన్న భయంతో అతన్ని తన గ్రిప్‌లో పెట్టుకోవాలనుకుంటుంది ఆముక్త. కట్‌ చేస్తే.. దేవా సూసైడ్‌ చేసుకోవాలని డిసైడ్‌ అయి పెద్ద బిల్డింగ్‌పైకి చేరతాడు. దేవా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? దేవా, ఆముక్త ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది? చివరికి వారిద్దరి ప్రేమ సక్సెస్‌ అయ్యిందా? అనేది మిగతా కథ.

దేవా అలియాస్‌ హిప్పీ క్యారెక్టర్‌లో కార్తికేయ ఒదిగిపోయాడని చెప్పాలి. డాన్సుల్లో, ఫైట్స్‌లో తన ప్రత్యేకతను చూపించాడు. అలాగే కథలోని సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌లో మంచి నటనను ప్రదర్శించాడు. హిప్పీగా, దేవాగా రెండు లుక్స్‌లో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన దిగంగన సూర్యవంశీ తన క్యారెక్టర్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేసింది. లుక్‌ పరంగా, పెర్‌ఫార్మెన్స్‌ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. లుక్‌ పరంగా నభా నటేష్‌లా కనిపించిన దిగంగన పెర్‌ఫార్మెన్స్‌ పరంగా రష్మిక మందన్నను తలపించింది. హీరోకి బాస్‌ క్యారెక్టర్‌లో నటించిన జె.డి.చక్రవర్తి కథలో కీలక పాత్రను పోషించాడు. అతని కెరీర్‌లోనే ఫస్ట్‌టైమ్‌ తెలంగాణ స్లాంగ్‌లో డైలాగ్స్‌ చెప్పి అందర్నీ మెప్పించాడు. ఇక వెన్నెల కిశోర్‌ సినిమాకి సంబంధించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్ట్‌ని తీసుకొని తన శక్తి మేర నవ్వించే ప్రయత్నం చేశాడు. ప్రత్యేక పాత్రలో కనిపించిన శ్రద్ధా దాస్‌ ఓ పాటలోనూ తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది.

టెక్నికల్‌గా చూస్తే ఆర్‌.డి.రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ ‘హిప్పీ’ చిత్రానికి ఓ స్పెషల్‌ ఎస్సెట్‌గా నిలిచింది. ప్రతి సీన్‌ని అందంగా చూపించడంలోనూ, హీరోహీరోయిన్లను గ్లామరస్‌గా కనిపించేలా చేయడంలోనూ రాజశేఖర్‌ తన ప్రతిభను కనబరిచాడు. కొత్త సంగీత దర్శకుడు నివాస్‌ కె.ప్రసన్న మంచి మ్యూజిక్‌ చేశాడు. సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా వచ్చే పాటల్ని వినసొంపుగా కంపోజ్‌ చేశాడు. అలాగే మంచి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అందించాడు. ప్రవీణ్‌ కె.ఎల్‌. తన ఎడిటింగ్‌తో ఎక్కడా బోర్‌ అనేది లేకుండా చేయగలిగాడు. కలైపులి ఎస్‌.థాను నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకు అవసరమైనంత ఖర్చు పెట్టడంలో థాను ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వలేదు. ఇక డైరెక్టర్‌ టి.ఎన్‌.కృష్ణ గురించి చెప్పాలంటే ఇప్పటి యూత్‌ ఎలా ఆలోచిస్తోంది? ప్రేమ విషయంలో వారికి ఉన్న అభిప్రాయాలు ఏమిటి? జీవిత భాగస్వామి ఎంపికలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే విషయాల్ని ఈ సినిమాలో చర్చించడం జరిగింది. ప్రస్తుతం యూత్‌ తమ లైఫ్‌ని ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారనేది చాలా నేచురల్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. హీరో కార్తికేయ, హీరోయిన్‌ దిగంగన సూర్యవంశీ నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు. కథ, కథనాల విషయంలో ఎంతో కేర్‌ తీసుకున్న కృష్ణ యూత్‌ని ఆకట్టుకునే మాటలు రాయడంలోనూ అంతే శ్రద్ధ పెట్టాడు. హీరో, హీరోయిన్‌ మధ్య ఏర్పడిన గ్యాప్‌ని ఫిల్‌ చేయడానికి సున్నితంగా ఉండే కొన్ని సీన్స్‌ని రాసుకొని వాటిని స్క్రీన్‌మీద అందంగా ప్రజెంట్‌ చేశాడు. ఈ సినిమాలో అందర్నీ ఆకట్టుకునే అంశాలు.. హీరో, హీరో క్యారెక్టర్స్‌, పెర్‌ఫార్మెన్స్‌.. మంచి పాటలు, థ్రిల్‌ చేసే ఫైట్స్‌, సిట్యుయేషనల్‌ కామెడీ, యూత్‌ని ఆకట్టుకునే గ్లామరస్‌ సీన్స్‌, కొన్ని అడల్డ్‌ జోక్స్‌. టోటల్‌గా యూత్‌కి మంచి మెసేజ్‌తోపాటు చక్కని ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించే సినిమా ‘హిప్పీ’.

బాటమ్‌ లైన్‌: యూత్‌ఫుల్‌ ‘హిప్పీ’

రేటింగ్ : 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here