విశాఖ పట్టణంలోని ఒక చిన్న కాలనీ ‘కంచెరపాలెం’. దాని గురించి అసలు పేరుతో తెరకెక్కిన సినిమా విడుదలై ఘనవిజయం సాధించేదాకా ఎవరికీ తెలీదు.. అలాంటి అద్భుతమైన చిత్రాలెన్నో మన తెలుగులో రూపొందుతున్నాయి. కానీ వాటికి ప్రోత్సాహం లేక అలా వచ్చి ఇలా వెళుతున్నాయి. కానీ ఒకే ఒక్కరు సినిమాను సినిమాగా చూసి దాని ప్రత్యేకతను గుర్తించి ఆర్థిక అండదండలు ఇచ్చి విడుదల చేయిస్తున్నారు.. చిన్న సినిమాల పాలిట కల్పతరువుగా మారుతున్నారు.. వారే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు..
కేరాఫ్ కంచరపాలెం లాంటి ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనలను అంత అద్భుతంగా సినిమాగా మలచవచ్చని ఆ సినిమా చూసేంతవరకూ ఎవరికీ తెలీదు. కానీ హీరో రానా ఆ సినిమాను చూడడం తన తండ్రి సురేష్ బాబు ప్రోద్బలంతో రిలీజ్ చేయడం.. దేశవిదేశాల్లో కంచరపాలెం మోత మోగించడం తెలిసిందే..
కంటెంట్ ఉన్న వాళ్లకు కటౌట్ అవసరం లేదన్నది సినిమా డైలాగ్.. ఇప్పుడీ కంటెంట్ ఉన్న వాళ్లందరికీ నిర్మాత సురేష్ బాబు పెద్దదిక్కుగా మారుతున్నారు. ఎన్నో మంచి సినిమాలను ఆయన గుర్తించి వాటిని ప్రోత్సహించి విడుదల చేయిస్తున్నారు. టాలీవుడ్ కు కొత్త దర్శకుల కలను, వారి కంటెంట్ పరిచయం చేస్తున్నారు..
తాజాగా సురేష్ బాబు ఆరు కొత్త చిత్రాలకు భరోసా కల్పించి వాటి వెనుక వెన్నుదన్నుగా ఉండి విడుదల చేయిస్తున్నారు. కంటెంట్ బలంగా ఉన్న సినిమాలను ఆయన ప్రోత్సహిస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో రూపుదిద్దుకున్న అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ, కొత్త వాళ్లు నటించిన ఫలక్ నుమా దాస్, దొరసాని, ఇక సమంత నటించిన ‘ఓ బేబీ’, ప్రియదర్శి నటించిన ‘మల్లేశం’, శ్రీవిష్ణు నటించిన ‘బ్రోచేవారెవరురా’ చిత్రాలను సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు విడుదల చేస్తున్నారు. మంచి కథ, కథనంతో రూపొందిన ఈ చిత్రాలను ఎంకరేజ్ చేస్తున్నారు. సురేష్ బాబు చేస్తున్న ఈ కృషితో ఎంతో మంది టాలెంటెడ్ కొత్త దర్శకులు, కొత్త నటులు తెలుగుతెరపై దూసుకొస్తున్నారు. టాలీవుడ్ ప్రభను వెలిగేలా చేస్తున్నారు. సురేష్ బాబు చేస్తున్న ఈ ప్రయత్నాలకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


