సినీ రంగంలోని ఎంతోమంది మహానుభావుల జీవిత చరిత్రలను రాసిన సీనియర్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు. లేటెస్ట్‌గా ఆలిండియా నటి శ్రీదేవిపై రచించిన ‘అతిలోకసుందరి శ్రీదేవి కథ’ బుక్‌ని ప్రముఖ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్‌లో ఆవిష్కరించారు. తొలి కాపీని నటుడు మాదాల రవి అందుకోగా, నటుడు శివాజీ రాజా తొలి ప్రతిని కొనుగోలు చేశారు. యువకళావాహిని అండ్‌ సీల్‌వెల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకులు రేలంగి నరసింహారావు, ఆర్‌. నారాయణమూర్తి, వై.వి.ఎస్‌. చౌదరి, నిర్మాతలు బి.వి.ఎస్‌.పన్‌. ప్రసాద్‌, దిల్‌ రాజు, కె. అచ్చిరెడ్డి, సురేష్‌ కొండేటి, నటులు మాదాల రవి, శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్‌, జయప్రకాశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ – ”’పదహారేళ్ల వయసు’ నుంచి ఇండియాలోనే ఒక నెంబర్‌వన్‌ స్టార్‌గా ఎదిగిన శ్రీదేవిగారి పైన రామారావుగారు ఇలాంటి బుక్‌ తీసుకురావడం నిజంగా చాలా హ్యాపీగా వుంది. రామారావుగారితోటే ఇలాంటి బుక్స్‌ ఆగిపోకూడదు. రామారావుగారు జర్నలిస్ట్‌ కెరీర్‌ మొదలుపెట్టినప్పటి నుండి ఏదో ఒక వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. రామారావుగారికి చాలా ధన్యవాదాలు. ఇలా అందరిపై పుస్తకాలు తీసుకొచ్చి వాళ్ల జీవిత చరిత్రను ఈతరాల వారికి అందిస్తున్న రామారావుగారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను” అన్నారు.

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ – ”అతిలోకసుందరి అనే టైటిల్‌ శ్రీదేవిగారికి తప్ప ఇంకెవరీకి సూట్‌ అవ్వదు. ఆవిడ మీద బుక్‌ తీసుకొస్తున్న రామారావుగారికి అభినందనలు. శ్రీదేవిగారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియాలోనే ఫస్ట్‌ సూపర్‌స్టార్‌. తమిళ్‌, తెలుగు, హిందీ భాషల్లో నటించిన శ్రీదేవి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఎంతైనా ఉంది. చాలామందికి ఎంతో ఇష్టమైన నటి శ్రీదేవి మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆమె అభిమానులు, రామారావుగారిలాంటి వ్యక్తుల ప్రేమతో ఆమె ఎప్పుడూ మనతోనే ఉంటుంది” అన్నారు.

భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌. ప్రసాద్‌ మాట్లాడుతూ – ”నేను ఇండస్ట్రీకి రావడానికి పసుపులేటి రామారావుగారు ఎంతో దోహదపడ్డారు. నా ఫస్ట్‌ హీరోయిన్‌ శ్రీదేవి. ఆమె కుటుంబ సభ్యులతో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. ఆవిడ ఇప్పుడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం” అన్నారు.

దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ – ”సినీ పరిశ్రమలో మహానుభావుల గురించి మరుగున పడిపోతున్న చరిత్రని ఈతరానికి తెలియజేయటానికి ముందుకి వస్తున్న రామారావు, వినాయకరావుగారు నిజంగా గ్రేట్‌. రామారావుగారు నాకు 40 ఏళ్లుగా తెలుసు. బాలనటిగా శ్రీదేవి ‘బలిపీఠం’ అనే సినిమాలో రోజారమణిగారి చిన్నప్పటి క్యారెక్టర్‌ చేసింది. ఆవిడ వ్యక్తిత్వం, ప్రిన్సిపల్స్‌, డిసిప్లిన్‌, డెడికేషన్‌ ఎంత గొప్పవి అని ఈ తరానికి రామారావుగారి పుస్తకం చదివితే తెలుస్తుంది. నేను ఈ పుస్తకం చదివాను. నేటి యువతరం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. రామారావుగానీ, వినాయకరావుగారు గానీ జర్నలిస్ట్‌లుగానే కాకుండా ఒక రచయితలుగా వాళ్లు రాస్తున్న కొటేషన్స్‌ చూస్తే నాకు చాలా గొప్పగా అన్పించింది. ఈ పుస్తకంలో కారే రాజులు.. రాజ్యాలను ఏలారు.. ఏరీ వారేరి.. అనే కొటేషన్‌ చూస్తే ఈ పుస్తకం ఎంత గొప్పగా రాశారో అర్థమవుతోంది. అలాగే శ్రీదేవిగురించి రాస్తూ.. ‘అమ్మా నువ్వు మా చెంత ఉండలేవు. మేము మీ చెంతకు రాలేము. మా మనస్సులకి మేము ఏమని సమాధానం చెప్పుకోవాలమ్మా’ అనే కొటేషన్‌ చదివినప్పుడు నిజంగా నా గుండె తరుక్కుపోయింది. ఆయనలో ఆయన ఎంతో మధనపడితే గానీ అలాంటి డైలాగ్స్‌ రావు. నువ్వు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మీ చిన్నమ్మకు చెప్పావట. మళ్ళీ వస్తాను అని. ఎలా వస్తావమ్మా? నువ్వు ఇంద్రజవు అక్కడ. దేవేంద్రుడు రాణిస్తాడా! మా దగ్గరికి’ అనే మాటలు చదువుతుంటే నిజంగా నా కళ్లలో నీళ్లు తిరిగాయి. రామారావుగారికి శ్రీదేవి అంటే ఎంత అభిమానమో ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది” అన్నారు.

పీపుల్స్‌స్టార్‌ ఆర్‌. నారాయణమూర్తి మాట్లాడుతూ – ”రామాయణం రాసారు కాబట్టే రాముడి గురించి మొత్తం తెలిసింది. భాగవతం రాశారు కాబట్టే కృష్ణుడి గురించి తెలిసింది. పసుపులేటి రామారావుగారు, వినాయకరావుగారు తెలుగు జాతి మహామహుల గురించి, ఇండస్ట్రీ ఏంటి? దాని గొప్పదనం ఏంటి, దర్శకనిర్మాతలు, సాంకేతిక నిపుణుల గురించి పుస్తకాలు రాసి వారి కీర్తి, ప్రతిష్టల గురించి చాలామందికి తెలియజేశారు. రామారావుగారు మహానటి సావిత్రిగారి గురించి రాశారు. దాసరి నారాయణరావుగారి గురించి, మెగాస్టార్‌ చిరంజీవి గురించి రాశారు. ఇప్పుడు అతిలోకసుందరి శ్రీదేవి గురించి రాశారు. అలాగే వినాయకరావుగారు ఎన్‌.టి.ఆర్‌. గురించి, దాసరి నారాయణరావుగారి గురించి, కృష్ణగారి గురించి, రామానాయుడు గురించి రాసి వారి చరిత్రను ఎంతోమందికి తెలియజేశారు. శ్రీదేవిగారిని ‘బంగారక్క’ సినిమాలో మొదటిసారిగా నేను చూడటం జరిగింది. ‘పదహారేళ్ల వయసు’ సినిమా తర్వాత ఆమె అంచలంచెలుగా ఎదుగుతూ ఆమె స్టార్‌డమ్‌ ఆకాశం అంత ఎత్తుకు ఎదిగింది. ‘హిమ్మత్‌వాలా’ సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చి నేషనల్‌ స్టార్‌గా ఎదిగింది. సౌత్‌ నుంచి వైజయంతి మాల, జయప్రద, రేఖ, శ్రీదేవి ఈ నలుగురు హిందీ హీరోయిన్లకి మేమేం తక్కువకాదు అని నిరూపించిన మహామణులు. ఆ ముగ్గురి లక్షణాలు శ్రీదేవిగారిలో ఉన్నాయి. అందం, అభినయం, డిసిప్లిన్‌, క్యారెక్టర్‌.. ఇలా అన్నీ అంశాలు ఉన్న శ్రీదేవి కారణ జన్మురాలు. ఆవిడ మరణించినప్పుడు తెలుగు రాష్ట్రాలే కాదు.. భారతదేశం సహా ప్రపంచం మొత్తం కన్నీరు కార్చింది. అది ఆమె గొప్పతనం. మహాకవి ఆత్రేయ చెప్పినట్లు ‘పోయినోళ్లందరూ మంచోళ్ళు. ఉన్నవాళ్లు వారి తీపి గుర్తులు’. మనందరం ఆ తీపి గుర్తులు. ఆ గుర్తులని ఈ బుక్‌ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్న రామారావుగారికి నా ధన్యవాదాలు” అన్నారు.

నిర్మాత కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ – ”శ్రీదేవిగారికి ఉన్న కోట్లాది మంది అభిమానుల్లో నేను ఒకడిని. ఆవిడలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే ఆవిడలో ఒక ఆత్మసౌందర్యం కన్పిస్తుంది. ఆవిడ మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. ఆవిడలోని నిర్మలత్వమే ఎక్కువమందిని ఆకర్షించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆవిడను బాల నటి నుంచి లేటెస్ట్‌గా నటించిన హాలీవుడ్‌ మూవీ వరకు అన్నీ సినిమాలు నేను చూశాను. ‘క్షణక్షణం’ సినిమాలో ఆవిడ అమాయకత్వం ఉట్టిపడుతూ చేసిన నటనకి ముగ్ధుడినై ఆ సినిమాను అరవై సార్లు చూసుంటాను. అలాంటి ఒక గొప్ప నటి జీవిత చరిత్రను తనదైన శైలిలో మనకందిస్తున్న రామారావుగారికి థాంక్స్‌” అన్నారు.

దర్శక నిర్మాత వై.వి.ఎస్‌. చౌదరి మాట్లాడుతూ – ”స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి దివ్యరూపం నన్ను సినిమా ఇండస్ట్రీ వైపు నడిపించింది. ఈ ఫంక్షన్‌కి రావడానికి రెండు కారణాలు. ఒకటి రామారావుగారు. అప్పట్లో సినిమా స్టార్స్‌ ఎంత సుపరిచియమో.. కొంతమంది జర్నలిస్ట్‌లు కూడా అంతే పరిచయం. అందులో ఒకరు రామారావుగారు. ఆర్‌. నారాయణమూర్తి, పసుపులేటి రామారావుగారిలా సాధారణ జీవితాన్ని గడపటం కొంతమందికే సాధ్యం అవుతుంది. రామారావుగారు ఏం చేసినా అవగాహనలోంచి అర్థవంతంగా ఉంటుంది. మా అభిమాన నటి శ్రీదేవిగారి బుక్‌ కూడా ఆయన చేతులమీద నుంచి రావడం అదృష్టంగా భావిస్తున్నా. నేను ఆవిడను చివరిసారిగా రాఘవేంద్రరావుగారి ‘సౌందర్యలహరి’ షోలో కలిసి ఫొటోలు దిగడం జరిగింది. శ్రీదేవిగారికి ఇన్ని అర్హతలు ఇచ్చిన దేవుడు దీర్ఘాయుష్షును ఎందుకు ఇవ్వలేకపోయాడనే బాధ చాలామందిలో ఉంది.” అన్నారు.

నటుడు మాదాల రవి మాట్లాడుతూ – ”పసుపులేటి రామారావుగారు ఒక జర్నలిస్ట్‌ ఐకాన్‌. వారు నమ్ముకున్న సిద్ధాంతం జర్నలిజం. వామపక్ష భావాలతో జర్నలిజంలోకి అడుగుపెట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు ఏనాడూ విలువలకు రాజీపడని వ్యక్తి రామారావుగారు. ఆయన జర్నలిజానికే పేరు తెచ్చారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి గురించి ఎవరూ తల్చుకోకపోవడం నరకానికి వెళ్ళడం, చనిపోయిన తర్వాత వారు అందరి హృదయాల్లోకి వెళ్ళడం స్వర్గానికి వెళ్ళడం లాంటిది. అందుకనే కళాకారులకి మరణం ఉండదు” అన్నారు.

నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ – ”నేను చాలాసార్లు అనుకుంటాను. రామారావుగారిలా, నారాయణమూర్తిలా బ్రతకొచ్చా? అని. కానీ అది అసాధ్యం. నా మొదటి సినిమా అప్పుడు రామారావుగారు ఎలా ఉన్నారో.. ఇప్పుడూ అలానే ఉన్నారు. శ్రీదేవిగారు కళ్లలో తేనె పూసినట్టుంటుంది. నవరసాల తేనెపట్టు ఆమె. చిరంజీవిగారి 150 సినిమాల్లో ఎప్పుడూ ఆయననే చూస్తుంటాను. కానీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలో శ్రీదేవిగారిని చూశాను. మళ్ళీ శ్రీదేవి బాలనటిగానే తెలుగు ఇండస్ట్రీలోనే పుట్టి.. మళ్ళీ నెంబర్‌వన్‌ స్థానానికి చేరుకొని వందేళ్లు చక్కగా బతుకుతుంది” అన్నారు.

బండారు సుబ్బారావు మాట్లాడుతూ – ”శ్రీదేవిగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా పసుపులేటి రామారావుగారి ఆవిడ జీవిత చరిత్రను ‘అతిలోక సుందరి శ్రీదేవి కథ’ పుస్తక రూపంలో తీసుకొస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు. రామారావుగారు ఇలాంటి మరెన్నో బుక్‌లు రాయాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడ్ని కోరుకుంటున్నా” అన్నారు.

సీనియర్‌ జర్నలిస్ట్‌ పసుపులేటి రామారావు మాట్లాడుతూ – ”శ్రీదేవిగారంటే నాకు ఎంతో అభిమానం. నేను ‘జ్యోతిచిత్ర’లో పనిచేసే రోజుల్లో చిన్నప్పటి నుండి ఆవిడ గురించి రాస్తూ ఉండేవాడిని. దాంతో కనిపించినప్పుడల్లా పలకరించేది. ప్రతిరోజూ సాయంకాలం పెరియార్‌ రోడ్‌లోని మిద్దె రామారావుగారి ఆఫీస్‌లో షూటింగ్‌ లేనప్పుడు ఆవిడతో కూర్చుని నేను, బి.ఎ.రాజు, మిద్దె రామారావుగారు ముచ్చటించుకునేవాళ్లం. ఆవిడకు జర్నలిస్ట్‌ల పట్ల ఉన్న అభిమానాన్ని చూసి నేను చాలాసార్లు ఆశ్చర్యపోయా. 30 ఏళ్ల తర్వాత కూడా ఒక తాజ్‌కృష్ణలో నేను వెళ్ళి ఆవిడను కలిస్తే నన్ను గుర్తు పట్టి బాగున్నారా అని పలకరించి ఇంటర్వ్యూ ఇచ్చింది. శ్రీదేవిగారు నేను ఎప్పటికీ మర్చిపోలేని హీరోయిన్‌గా గుర్తుండిపోయారు” అన్నారు.

నిర్మాత సురేష్‌ కొండేటి మాట్లాడుతూ – ”రామారావుగారు పదిహేను సంవత్సరాల నుంచి ‘సంతోషం’లో ఉండటం నిజంగా నా అదృష్టంగా ఫీలవుతాను. ఆయన ఎంతోమంది గురించి పుస్తకాలు రాశారని గర్వంగా ఫీలవుతుంటాను. ఇండస్ట్రీకి రాకముందు నుండి శ్రీదేవిగారంటే ఎంతో అభిమానం. ఆ అభిమానంతోనే ఒకసారి తాజ్‌కృష్ణలో శ్రీదేవిగారిని కలిసి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఆ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన రకుల్‌ప్రీత్‌సింగ్‌కి నా ప్రత్యేక ధన్యవాదాలు” అన్నారు.

‘Athilokasundari Sridevi Katha’ By Pasupuleti Ramarao Book Launch – Pics