‘యాత్ర’ హానెస్ట్‌ ఫిల్మ్‌. వై.ఎస్‌.ఆర్‌గారి పాత్రతో ప్రేక్షకులు ఎమోషనల్‌గా ఖచ్చితంగా కనెక్ట్‌ అవుతారు – దర్శకుడు మహి వి. రాఘవ్‌

0
458

జనరంజకమైన పాలన, సంక్షేమ పథకాలతో ప్రజల హ దయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత వైఎస్‌ఆర్‌. ఆయన చేసిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. వైఎస్‌ఆర్‌ పాత్రలో మలయాళ స్టార్‌ మమ్ముట్టి నటించారు. శివ మేక సమర్పణలో 70 ఎం ఎం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా మరియు శశిదేవి రెడ్డి నిర్మించారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్‌ మహి వి. రాఘవ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా దర్శకుడు మహి వి. రాఘవ్‌ ఇంటర్వ్యూ.

‘యాత్ర’ సినిమా చేయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు ఏమిటి?
– వై.ఎస్‌.ఆర్‌ గురించి మూవీ చేయాలని ఉద్దేశపూర్వకంగా అనుకోలేదు. ఒక మనిషి కథను ఈ టైంలో చెప్పాలనేంత నైపుణ్యం కూడా నాకు లేదు. ఏడెనిమిదేళ్ల కాలంలో చాలా మంది వ్యక్తులను కలిసినప్పుడు, చూసినప్పుడు వారు చెప్పిన విషయాలన్ని వై.ఎస్‌.ఆర్‌గారి చుట్టూ తిరిగేవి. ‘ఆనందోబ్రహ్మ’ సినిమా చేస్తున్నప్పుడు వై.ఎస్‌.ఆర్‌గారి క్యారెక్టర్‌ గురించి మరింత ఆసక్తి ఏర్పడింది. నేను సాధారణంగా ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఆయన గురించి ఎవరినైనా అడిగితే వాళ్లు ఆయన గురించి చాలా మంచిగా చెప్పేవారు. ఆయన ధైర్యసాహసాల గురించి ఎవరూ నాకు చెప్పలేదు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించే అందరూ మాట్లాడేవారు. ఓ రాజకీయ నాయకుడి గురించి ప్రజలు మంచిగా చెప్పుకోవడం చాలా అరుదైన విషయం. అలాంటి వ్యక్తి గురించి ఓ సినిమా చేద్దామనిపించింది. ఆయన జీవితంలో పాదయాత్ర అనే పార్ట్‌ తీసుకున్నాను. పాదయాత్ర టైమ్‌లైన్‌కి, సినిమాటిక్‌ టైమ్‌లైన్‌కి చాలా తేడా ఉంటుంది. వై.ఎస్‌.ఆర్‌గారి గురించి సినిమా చేయాలనుకున్నప్పుడు సినిమాకు వచ్చే ప్రజలు ఇన్‌ఫర్మేషన్‌ గురించైతే రావడం లేదు. ఓ డ్రామా అవసరం. ఓ ఎమోషనల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కోసం వస్తారు. కాబట్టి ఓ దర్శకుడిగా వై.ఎస్‌.ఆర్‌గారి పాదయాత్రలో ఎమోషన్‌ను ఆట్టుకునేలా చూపించడమే ముఖ్యమని అనుకున్నాను.

సినిమా చేయడానికి ముందు వై.ఎస్‌.ఆర్‌ కుటుంబ సభ్యులను కలిశారా?
– వై.ఎస్‌.ఆర్‌గారి పాదయాత్ర మీద సినిమా కదా! ఎలాంటి కాంట్రవర్సీలు ఉండవని అనుకుని కథ రాసుకున్నాను. నేను వై.ఎస్‌.ఆర్‌గారి జీవితం గురించి చెప్పదలుచుకోలేదు. ఆయన జీవితంలో ఒక బాగం అయిన పాదయాత్ర ఘట్టాన్ని మాత్రమే చెప్పాలనుకున్నాను. జగన్‌ అన్నను.. పోస్టర్‌ రెడీ అయిన తర్వాత గోదావరి జిల్లాలో ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు వెళ్లి కలిశాను. వైఎస్‌గారిపై సినిమా చేయాలనుకుంటున్నానంటే ఓకే అన్నారు. జగన్‌ అన్న ‘మా నాన్న చేయనివి చెప్పొద్దు. నాన్నగారు చేయనిదాని క్రెడిట్‌ మనకొద్దు’ అన్నారు. అంతేకాదు.. ‘నాన్నగారి గురించి జనాలకు మీరు ఓ కథ చెప్పాలనుకున్నారు. ఆ కథ ఏంటని నేను తెలుసుకుని, మార్పులు చేర్పులు చేయమని చెప్పడం కరెక్ట్‌ కాదు’ అన్నారు. ఆ మాట జగన్‌ అన్న చెప్పడం చాలా గ్రేట్‌.

వై.ఎస్‌.ఆర్‌గా మమ్ముట్టినే ఎందుకు ఎంచుకున్నారు?
– నేననే కాదు.. ‘యాత్ర’ సినిమాను ఎవరు డైరెక్ట్‌ చేసినా టాప్‌ త్రీ స్థానంలో మమ్ముట్టిగారి పేరు ఒకటి కచ్చితంగా పరిగణనలోకి తీసుకునేవారు. ఆయన అన్ని రకాల సినిమాలు చేశారు.

మమ్ముట్టినే మొదటి చాయిస్‌గా తీసుకున్నారా?
– ఈ సినిమాకు ఆయనే మా మొదటి ఛాయిస్‌. అయితే ఆయన తెలుగు సినిమా చేసి చాలా కాలమైంది. ఈ క్యారెక్టర్‌ చేయాలంటే తెలుగు చక్కగా మాట్లాడగలగాలి. కథ, క్యారెక్టర్‌ వినగానే ఆయన ఈ సినిమాలో నటించాలనుకున్నారు. ఈ సినిమాలో నేను ఎందుకు నటించాలి? అని అడిగారు. ‘దళపతి’ సినిమాలో ఓ సీన్‌లో మీరు, రజనీకాంత్‌, అరవిందస్వామి ఉంటారు. అన్ని డైలాగ్స్‌ రజనీకాంత్‌కే ఉంటాయి. మీరు కేవలం కుదరదు అనే మాట చెప్పి ఆ స్క్రీన్‌ స్పేస్‌ను క్యారీ చేశారు. అలాంటి ఓ గర్వం లేని వ్యక్తి నాకు కావాలి అన్నాను. ఆయన ఒప్పుకున్నారు. నిజంగా మమ్ముట్టిగారిని చూస్తే ఆయన ముఖంలో గర్వం కనపడదు. హంబుల్‌గా కనపడతారు. ఆయనకు అద్భుతమైన వాయిస్‌ ఉంది.

మమ్ముట్టి డబ్బింగ్‌ చెప్పాలనుకున్న నిర్ణయం ఎవరిది?
– మమ్ముట్టిగారిదే. పెర్ఫామెన్స్‌ అంటే నటన, డబ్బింగ్‌ కలిస్తేనే బాగా వస్తుందని ముమ్మట్టిగారి నమ్మకం. వేరే వాళ్లతో సూట్‌ అయ్యేలా మనం డబ్బింగ్‌ చెప్పించి ఉండుంటే ఆయనంత బాగా కుదిరి ఉండేది కాదేమోనని నా అభిప్రాయం.

సినిమా ఎలక్షన్స్‌లో ప్రజలను ప్రభావితం చేస్తుందనుకుంటున్నారా?
– 30-40 ఏళ్ల క్రితం ఓ సినిమా ప్రజలను ఎన్నికల్లో ప్రభావితం చేస్తుందని భావిస్తే నమ్మేవాడినేమో. కానీ ఇప్పుడు ఓటర్లు చాలా తెలివిగా ఉన్నారు. ఎవరికి ఓటేస్తే ఎంత లాభం? అని క్యాలిక్కులేటర్‌తో సహ లెక్కలు వేసి మరీ చెబుతున్నారు. సినిమాకు వచ్చేటప్పుడు రెండు గంటల సమయాన్ని, 150 రూపాయలను ప్రేక్షకులు మనకు కేటాయిస్తారు. కానీ సినిమాలకు, రాజకీయాలకు చాలా తేడా ఉందని ప్రజలకు చాలా బాగా తెలుసు.

ప్రత్యేకంగా పాదయాత్ర ఘట్టాన్నే ఎందుకు తీసుకున్నారు?
– సినిమాలో కేవలం పాదయాత్రకు సంబంధించిన విషయాలే కాదు. చాలా సబ్‌ప్లాట్స్‌ కూడా ఉన్నాయి. ఉదాహరణకు వై.ఎస్‌.ఆర్‌గారు ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాలు ఎందుకు పెట్టారనే విషయాలను హత్తుకునేలా సబ్‌ప్లాట్స్‌లో చూపించాం. అలా చూపించాలనుకున్నప్పుడు అందుకు తగ్గ డ్రామా అవసరం. సినిమాటిక్‌ టైం లైన్‌ వేరుగా ఉంటుంది. సినిమా వై.ఎస్‌.ఆర్‌గారు పాదయాత్ర ముగించడంతో ముగుస్తుంది. ఆయన మిగతా జీవితాన్ని పెంచలదాస్‌గారి ఎమోషనల్‌ సాంగ్‌లో సింపుల్‌గా చూపించాం.

వై.ఎస్‌.ఆర్‌ ప్రవేశ పెట్టిన పథకాలను వేటిని చూపిస్తున్నారు?
– ఏ పథకాలను వై.ఎస్‌.ఆర్‌గారు ప్రవేశ పెట్టారనే కోణంలో కాకుండా అందుకు దారి తీసిన పరిస్థితులను టచ్‌ చేశాం. ఉదాహరణకు ఆరోగ్య శ్రీ పథకం పెట్టడానికి ఆయన బలమైన సిచ్యువేషన్‌ను ఎక్కడో చూశారు. 2003 వరకు ప్రజలు వై.ఎస్‌.ఆర్‌గారిని చూసింది వేరుగా ఉండొచ్చు. ఎప్పుడైతే ఆయన ప్రజలకు దగ్గరగా వెళ్లారో ఈయన ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి అని అర్థం చేసుకున్నారు. అలాగే వై.ఎస్‌.ఆర్‌గారు కూడా అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారనే విషయాన్ని దగ్గరగా వెళ్లినప్పుడు బాగా అర్థం చేసుకున్నారు.

ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతవరకూ రీచ్‌ అవుతుందనుకుంటున్నారు?
నాకు ఆ ఆలోచన లేదండీ. ఇదొక హానెస్ట్‌ ఫిల్మ్‌. సినిమా చూసినప్పుడు ఆ పాత్రతో వాళ్లు ఎమోషనల్‌గా కచ్చితంగా కనెక్ట్‌ అవుతారు. ఎంతమంది చూస్తారు, ఎంత వసూలు చేస్తుందనే ఆలోచన లేదు. తెలుగు ప్రేక్షకులే కాదు.. మలయాళ ప్రేక్షకులు కూడా ‘యాత్ర’ని ఓ మంచికథగా యాక్సెప్ట్‌ చేస్తారు. వైఎస్‌గారు తెలిసిన వాళ్లు చూడటం కాదు.. తెలియని వారు కూడా చూడాలి.. ‘ఎవరో ఓ నాయకుని కథ, చరిత్ర ఇది. కథగా చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎమోషన్‌గా ఉంది’ అనేది అచీవ్‌ అవ్వాలి. అది మేం అచీవ్‌ అయ్యామనుకుంటున్నాం.

సినిమా చేసే క్రమంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా?
– అలాంటివేం లేవండీ.. ఎందుకంటే నాకు చాలా మంచి టీం దొరికింది. మంచి టీం దొరికినప్పుడు దర్శకత్వం వహించడాని కంటే సులభమైన పని మరొకటి ఉండదు. అలాంటి మంచి టీం వల్ల నాకెలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు.

చంద్రబాబు నాయుడు పాత్ర ఈ సినిమాలో ఉంటుందా?
– లేదండీ.. చంద్రబాబునాయుడుగారి పాత్ర సినిమాలో కనపడదు. వైఎస్‌గారి గొప్పతనం చెప్పడానికి ఇంకొకర్ని మనం చిన్నగా చేయాల్సిన అవసరం లేదు. ఒకర్ని తిట్టాల్సిన లేదా చెడు చేయాల్సిన అవసరం కూడా లేదు. వైఎస్‌గారికి ఉన్న పాజిటివ్‌ థ్రెడ్స్‌ని మనం కరెక్ట్‌గా చూపించగలిగితే చాలు అనుకున్నాం. మన దేవుణ్ని మహానుభావుడు అనుకోవడానికి వేరొకర్ని చిన్నగా చేయాల్సిన అవసరం రాలేదు. పైగా అలాంటి లక్షణం వైఎస్‌గారిది కాదు.

ఈ సినిమాలో వైఎస్‌గారి తనయుడి పాత్రలో జగన్‌గారు కనిపిస్తారా?
– వై.ఎస్‌.జగన్‌గారి పాత్ర సినిమాలో ఉండదు. అయితే రియల్‌ విజువల్స్‌ కొన్నింటిని చూపించాం. అందులో జగన్‌గారు కనపడతారు. స్క్రిప్ట్‌లో రాశాం. కానీ చివర్లో వద్దనుకున్నాం. అందుకు కారణమేమంటే.. రెండు గంటల పాటు వై.ఎస్‌గారి పాత్రతో కనెక్ట్‌ అయ్యుంటాం. అంత ఎమోషనల్‌ ఆర్క్‌లో సడెన్‌లో బాగా తెలిసిన యాక్టరో, స్టారో కనపడి వెళ్లిపోతే, ఆడియెన్స్‌కు నచ్చవచ్చు. కానీ అప్పటి వరకు ఉన్న ఎమోషనల్‌ జర్నీ పోతుందనిపించింది.

‘యాత్ర’ టీజర్‌, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది కదా! జగన్‌గారికి చూపించారా?
– చూశారు. బావుందన్నారు. ‘సినిమా చూస్తారా సార్‌’ అని అడిగితే ‘మీ నాయకుడి కథ మీరు చెప్పారు ఇప్పుడు నేను ఏం చేయాలనేది చెబితే క్రియేటివిటీగా అది దెబ్బతింటుంది’ అన్నారు.

తదుపరి చిత్రం?
– నేను ఫిబ్రవరి 8 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. 2,3 ఆలోచనలు ఉన్నా కూడా.. సినిమా ఫలితాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటూ ఇంటర్వ్యూ ముగించారు దర్శకుడు మహి.వి.రాఘవ్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here