శర్వానంద్‌ని దృష్టిలో పెట్టుకునే ఈ కథ రాశా – హను రాఘవపూడి

0
506

‘అందాల రాక్షసి’ తో పరిచయం అయ్యి ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ వంటి హిట్ చిత్రాన్ని అందించి, ప్రేమకథలని తనదైన శైలిలో తెరకెక్కించే టాలెంటెడ్ దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన తాజా చిత్రం ‘పడి పడి లేచె మనసు’. శర్వానంద్‌, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 21) విడుదల కానుంది. ఈ సినిమాకు చెరుకూరి సుధాకర్‌ నిర్మాత. ఈ చిత్రం గురించి హను రాఘవపూడి హైదరాబాద్‌లో గురువారం విలేకరులతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

లవ్‌ స్టోరీస్‌ మీ బలం అనుకుంటున్నారా?
– అలాంటిదేమీ లేదండీ. మన బలం మనకు తెలియదు. అవతలివాళ్లే చెప్పాలి.

మిమ్మల్ని మణిరత్నంతోనూ, సుకుమార్‌తోనూ పోలుస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది?
– కాంప్లిమెంట్స్‌ మంచివే కదండీ. పాజిటివ్‌గానే తీసుకుంటా. వారి క్రాఫ్టింగ్‌ నాకు చాలా ఇష్టం.

‘పడి పడి లేచె మనసు’లో బ్రేకప్‌ ప్రాబ్లమ్‌ ఉంటుందా?
– ఇందులో బ్రేకప్‌ మాత్రమే ప్రాబ్లమ్‌ కాదు. ఆసక్తికరమైన కాన్‌ ఫ్లిక్ట్స్‌ ఉంటాయి. ప్రేమ కథ పాతదే. దాన్ని కొత్తగా చెప్పే విధానం బావుంటుంది.

శర్వానంద్‌ను దృష్టిలో పెట్టుకుని కథ రాశారా?
– అవునండీ. శర్వానంద్‌ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఒకసారి నా కథను చరణ్‌కి కూడా చెప్పించాడు. ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాం. తనకోసం రెండు, మూడు లైన్స్‌ చెప్పాను. తను మాత్రం నాతో లవ్‌ స్టోరీ మాత్రమే చేయాలని అనుకున్నాడు. అందుకే శర్వాని దృష్టిలో పెట్టుకునే కథ రాశా.

కథలో నటించబోయే హీరో ఎవరన్నది ముందే తెలియడం పాజిటివా? నెగటివా?
– చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే అవతలివ్యక్తి ఎలా నటించగలరో మనకు ముందే తెలిసిపోతుంది. కొన్ని సందర్భాల్లో కాస్త టఫ్‌ కాన్సెప్ట్‌ కూడా.

ఈ కథకు ‘పడిపడిలేచె మనసు’ అనే టైటిల్‌ పెట్టడానికి కారణం
– ఒకసారి నేను వెంకట్‌ సిధారెడ్డి కూర్చుని పాట వింటుంటే నాకు ఈ పదాల్లో ఏదో కథ ఉందనిపించింది. ఆ టైటిల్‌ని అనుకుని, దాన్నుంచి నేను డెవలప్‌ చేసుకున్న కాన్సెప్ట్‌ ఈ సినిమా. మంచి కథ, మంచి క్లైమాక్స్‌ కుదిరింది. దానికి తగ్గ నటీనటులు కూడా కుదిరారు. పాత్రలు రెండూ పోటాపోటీగా అనిపిస్తాయి. సినిమాలో భూకంపం సన్నివేశం కూడా ఉంటుంది. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం ఇప్పటికే ప్రజాదరణ పొందింది.

మీరు ఎక్కువగా ప్రేమకథా చిత్రాలు తీస్తుంటారు. మీ అనుభవంలోనుంచి పుట్టినవా?
– లేదండీ. మన జీవితంలో మనకు దగ్గరగా ఉన్న వాటిని మనం అంతగా పట్టించుకోం. లేని వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాం. అలా ప్రేమ నా జీవితంలో లేదు. అందుకే దాని గురించి తిరుగుతుంటానేమో. నాకు భన్సాలీ సినిమాలన్నా, హిరాణీ చిత్రాలన్నా చాలా ఇష్టం. వాళ్లలాగా చేయాలని కలలు కనట్లేదు కానీ, వాళ్ల సినిమాలంటే చాలా ఇష్టం.

‘పడి పడి లేచె మనసు’ సినిమాకు ఓవర్‌ బడ్జెట్‌ అయిందని టాక్‌ వచ్చింది?
– సూపర్‌ మార్కెట్‌కి వెళ్లి సరకులు కొంటాం. అక్కడ మనకు నచ్చినవి ఇంకో రెండు వస్తువులు ఉంటే కొంటాం. అది మన లిస్టులో లేదు కదా అని ఓవర్‌ బడ్జెట్‌ అయిందని అనుకోం కదా.. ఈ సినిమాకు కూడా అనుకున్నదానికన్నా 15 శాతం బడ్జెట్‌ ఎక్కువైంది. అది కూడా షూటింగ్‌ లొకేషన్లలో వాతావరణం అనుకూలించక. అది ఇప్పుడు నేను చెప్పడం కన్నా, సినిమాలో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. నేను కోల్‌కతాలో కొన్నేళ్ల క్రితం ఓ ఆరు నెలలు ఉన్నాను. నాకు కోల్‌కతా అంగుళం అంగుళం తెలుసు. ఆ బ్యాక్‌డ్రాప్‌ని ఇప్పుడు ఈ సినిమాకు వాడుకున్నానంతే. లొకేషన్లు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి.

మీ దగ్గర ఔట్‌ ఆఫ్‌ ద బాక్స్‌ కథలున్నాయా?
– ఉన్నాయండీ. అయితే వాటిని తీయడానికి సమయం ,సందర్భం కావాలి. ఒక పెద్ద హిట్‌ ద్వారా జనాల్లో నమ్మకం పెరుగుతుంది. ఆ హిట్‌ ద్వారా వచ్చే క్రెడిబిలిటీ వేరుగా ఉంటుంది. ‘అందాల రాక్షసి’ సినిమాకు ఫస్ట్‌ డే టాక్‌ వేరు. ఆ తర్వాత ఆ సినిమా నాకు తెచ్చిన గుర్తింపు వేరు.

సాయి పల్లవి గురించి ?
– కథలో హీరోయిన్ పాత్రకి సాయి పల్లవి 200 % న్యాయం చేసింది. సినిమా చూశాక నా మాటలతో మీరూ ఏకీభవిస్తారు.

నిర్మాత సుధాకర్ చెరుకూరి తో పని చేయడం ఎలా అనిపించింది ?
– ఆయనతో పనిచేయడం నైస్ ఎక్స్పీరియన్స్ అండి. సినిమాని ఎంతో ప్రేమించి, చాలా ప్యాషన్ తో మంచి సినిమాని అందించాలని ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా నిర్మించారు. ఈ బ్యానర్ లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది.

నానితో ఓ సినిమా చేస్తున్నారట కదా?
– కథ రెడీగా ఉంది. నాని మిలిటరీ లుక్‌ కావాలి. అందుకే తనకూ, నాకూ అవైలబిలిటీ ఉన్నప్పుడు చేస్తాం. ఇమీడియేట్‌గా మైత్రీ మూవీస్‌లో సినిమా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here