‘సవ్యసాచి’ రివ్యూ : డిఫరెంట్ రివెంజ్ డ్రామా

0
614

రివ్యూ: డిఫరెంట్ రివెంజ్ డ్రామా ‘సవ్యసాచి’
ఇండస్ట్రీహిట్.కామ్ రేటింగ్ 3/5

బ్యానర్ : మైత్రి మూవీ మేకర్స్, ఎరోస్ ఇంటర్నేషనల్ తో కలిసి….
నటీనటులు: నాగచైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమిక, వెన్నెల కిశోర్, సత్య, షకలక శంకర్, బ్రహ్మాజీ, నాగినీడు, తాగుబోతు రమేష్, సుదర్శన్ తదితరులు
సంగీతం: యం.యం.కీరవాణి
సినిమాటోగ్రఫీ: యువరాజ్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సి.వి.మోహన్ (CVM)
రచన, దర్శకత్వం: చందు మొండేటి
విడుదల తేదీ : 02.11.2018

‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌తో విజయపథంలో దూసుకెళ్తున్న మైత్రి మూవీ మేకర్స్ నుంచి వచ్చిన మరో విభిన్న కథా చిత్రం ‘సవ్యసాచి’. నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాకి ‘కార్తికేయ’, ‘ప్రేమమ్’ చిత్రాల దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విలన్‌గా తమిళ్ హీరో మాధవన్ నటించడం విశేషం. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే ఓ కొత్త పాయింట్‌తో రూపొందిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏమేర ఆకట్టుకుంది? నాగచైతన్య కెరీర్‌కి ‘సవ్యసాచి’ ఎంతవరకు ప్లస్ అవుతుంది? మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా మరో ఘనవిజయాన్ని అందించిందా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ:
అతని పేరు విక్రమ్‌ఆదిత్య (నాగ చైతన్య) వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే డిజార్డర్‌తో పుడతాడు. దాని కారణంగా అతని ఎడమ చేయి అతనికి తెలీకుండానే కదులుతుంది. అలా ఒకే మనిషిలో రెండు విభిన్న మనస్తత్వాలు కనిపిస్తాయి. అందుకే విక్రమ్, అదిత్య అనే రెండు పేర్లు అతనికి పెడతారు. విక్రమ్ ఒకటి చేయాలనుకుంటే ఎడమచేయి ద్వారా దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాడు ఆదిత్య. అక్క(భూమిక) అంటే అతనికి ఎంతో ఇష్టం. అలాగే అక్క కూతురు మహాలక్ష్మి అంటే ప్రాణం. యాడ్ ఫిలింస్ డైరెక్టర్‌గా పనిచేసే విక్రమ్‌కి ఫ్లాష్ బ్యాక్‌లో ఆరు సంవత్సరాల క్రితం ఒక లవ్‌స్టోరీ ఉంటుంది. కాలేజ్ డేస్‌లోనే చిత్ర(నిధి అగర్వాల్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయి ఆరు సంవత్సరాల తర్వాత కలుసుకుంటారు. లైఫ్ హ్యాపీగా గడిచిపోతున్న టైమ్‌లో ఒక ఫైర్ యాక్సిడెంట్‌లో అతని బావ చనిపోతాడు, అక్క ఆస్పత్రి పాలవుతుంది. మహాలక్ష్మి ఆ యాక్సిడెంట్ కాలి బూడిదైందని పోలీసులు రిపోర్ట్ ఇస్తారు. ఆ టైమ్‌లోనే అతనికి ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్‌లో మహాలక్ష్మి కూడా మాట్లాడుతుంది. ఆ వ్యక్తి మాటల్ని బట్టి మహా కిడ్నాప్ అయిందని తెలుసుకుంటాడు. మహాని ఎందుకు కిడ్నాప్ చేశాడు? విక్రమ్ నుంచి అతను ఆశించింది ఏమిటి? తన మేనకోడలు ఆచూకీ విక్రమ్ తెలుసుకోగలిగాడా? ఆ కిడ్నాపర్ ఆట కట్టించగలిగాడా? అనేది మిగతా కథ.

నటీనటులు:
రెండు విభిన్న మనస్తత్వాలు ఒకే మనిషిలో ఉంటే అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎన్ని రకాల వేరియేషన్స్ అతనిలో కనిపిస్తాయి అనేది ఈ సినిమాలో నాగచైతన్యను చూస్తే తెలుస్తుంది. ఒక కొత్త లుక్‌తో, కొత్త క్యారెక్టరైజేషన్‌తో ఉన్న విక్రమ్, ఆదిత్య క్యారెక్టర్స్‌ను నాగచైతన్య ఎంతో సమర్థవంతంగా పోషించారు. ఎమోషనల్ సీన్స్‌లో చైతన్య నటన మరింత ఆకట్టుకుంటుంది. అలాగే లవ్ సీన్స్‌లో, కామెడీ సన్నివేశాల్లో తనదైన నటనను ప్రదర్శించారు. ఇక డాన్సుల్లో, ఫైట్స్‌లో ఎంతో మెచ్యూరిటీ చూపించారు. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన నిధి అగర్వాల్ తన గ్లామర్‌తో అందర్నీ ఆకట్టుకుంది. తన పాత్ర పరిధి మేరకు చక్కని పెర్‌ఫార్మెన్స్‌తో అలరించింది. తొలిసారి తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేసిన మాధవన్ తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశారు. క్రూరమైన విలన్‌గా తన హావ భావాలతో డైలాగ్ మాడ్యులేషన్‌తో ఆడియన్స్‌లో ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. మాధవన్ కెరీర్‌లో ఈ క్యారెక్టర్ ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. ఇక వెన్నెల కిశోర్, సత్య, సుదర్శన్, షకలక శంకర్ చాలా సందర్భాల్లో నవ్వులు పూయించారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో వెన్నెల కిశోర్, సత్య, షకలక శంకర్ చేసిన కామెడీ అందర్నీ నవ్విస్తుంది. విక్రమ్ అక్కగా నటించిన భూమిక ఎప్పటిలాగే తన పెర్‌ఫార్మెన్స్‌తో ఆ క్యారెక్టర్‌కి హుందాతనాన్ని తెచ్చింది.

సాంకేతికవర్గం:
ఈ సినిమాకి ఫోటోగ్రఫీ అందించిన యువరాజ్‌ని అభినందించాలి. ఫస్ట్‌హాఫ్‌లో ఎంతో ప్లెజెంట్‌గా సాగిపోయే కథ, కథనాలకు అతని ఫోటోగ్రఫీ చాలా ప్లస్ అయింది. నాగచైతన్యను ఎంతో క్యూట్‌గా, నిధి అగర్వాల్‌ని గ్లామర్‌గా చూపించడంలో అతని కృషి కనిపిస్తుంది. అలాగే యాక్షన్ సీక్వెన్స్‌ల్లోనూ ప్రతిభ కనబరిచారు. రిలీజ్‌కి ముందే టైటిల్ సాంగ్‌తో సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెంచిన కీరవాణి తన పాటలతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు’ పాటను మోడ్రన్‌గా రీమిక్స్ చేయడంలో కీరవాణి సక్సెస్ అయ్యారు. సినిమాలోని ప్రతి సీన్‌ని ఎలివేట్ చేసే ఆయన చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అయింది. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ చాలా పర్‌ఫెక్ట్‌గా అనిపిస్తుంది. ఎక్కడా ల్యాగ్ అనిపించకుండా సినిమా స్పీడ్‌గా ఉండడానికి ఆయన ఎడిటింగ్ ఒక కారణం. తమ అన్ కాంప్రమైజ్డ్ మేకింగ్‌తో ప్రతి సినిమాకి ఒక లుక్‌ని తీసుకొచ్చే మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాని కూడా ఎక్కడా రాజీపడకుండా భారీగా నిర్మించారు. ఇక డైరెక్టర్ చందు మొండేటి గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు తెలుగు తెరపై రాని ఒక కొత్త పాయింట్‌తో చేసిన ఎక్స్‌పెరిమెంట్ సక్సెస్ అయింది. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ ఉన్న హీరో క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్ మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించగలిగారు. హీరో తన ఎడమ చేయితో నెక్స్‌ట్ ఏం చెయ్యబోతున్నాడు అనే క్యూరియాసిటీని కలిగించడంలో చందు సక్సెస్ అయ్యారు. అలాగే విలన్ మాధవన్ క్యారెక్టర్‌ని మలిచిన తీరు, ఆయన నుంచి పెర్‌ఫార్మెన్స్ రాబట్టుకున్న విధానం ప్రశంసనీయం.

విశ్లేషణ:
ఒక కొత్త పాయింట్‌తో రూపొందిన ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు ప్రేక్షకులు ఆశించే సస్పెన్స్, యాక్షన్, థ్రిల్ పుష్కలంగా ఉన్నాయి. ఫస్ట్‌హాఫ్ లవ్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకుల్ని ఆహ్లాదపరుస్తుంది. సెకండాఫ్ రకరకాల ట్విస్టులతో, సస్పెన్స్‌తో కథను పరుగులు పెట్టిస్తుంది. ఈ సినిమాకి నాగచైతన్య నటన, నిధి అగర్వాల్ గ్లామర్, కమెడియన్స్ చేసిన కామెడీ, మాధవన్ ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్, కీరవాణి పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డిఫరెంట్‌గా అనిపించే యాక్షన్స్ సీక్వెన్స్‌లు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. కొత్త తరహా కథలతో సినిమా రావాలని ఆశించే ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here