ఓటుకు ఉన్న విలువేంటనేది ‘సర్కార్‌’ చిత్రంలో తెలుస్తుంది. పొలిటిషియన్‌ పాత్రలో కనపడతాను – వరలక్ష్మీ శరత్‌ కుమార్‌

0
99

నాయిక, ప్రతినాయకురాలు, సహాయక పాత్ర.. ఏదైనా సరే నటిగా నిరూపించుకునే పాత్ర అయితే చాలు, వదులుకోను అనే వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, మాస్‌ హీరో విశాల్‌ కథానాయకుడిగా నటించిన ‘పందెంకోడి 2’లో ప్రతినాయకురాలుగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుని, ఇప్పుడు దళపతి విజయ్‌,కీర్తి సురేష్‌ జంటగా నటిస్తున్న ‘సర్కార్‌’లో కీలకపాత్ర పోషించింది. వచ్చే నెల 6న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా.. ”వరలక్ష్మీ శరత్‌ కుమార్‌” తో ఇండస్ట్రీ హిట్‌ ఇంటర్వూ …

ఇంత వరకూ స్ట్రయిట్‌ తెలుగు ఫిలిం చేసే అవకాశం రాలేదా?
చాలా అవకాశాలు వచ్చాయి. అయితే నాకు ఏదీ ఎగ్జయిటింగ్‌గా అనిపించలేదు. అలాగని తెలుగు సినిమాలు చేయనని కాదు. తమిళంలో నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలను గమనిస్తే నా పాత్రలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. తమిళం తర్వాత మలయాళం, కన్నడ సినిమాలంటూ బిజీ అయిపోయాను. తెలుగుపై ఫోకస్‌ పెట్టలేదు. ‘పందెంకోడి 2’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు విజయ్‌ ‘సర్కార్‌’లో నటించాను. ఇలా ఇప్పుడే తెలుగు సినిమాల్లో నా ప్రయాణం ప్రారంభమైంది.

హీరోయిన్‌గానే కాదు నెగటివ్‌ షేడ్స్‌ కూడా చేసేస్తున్నారుగా?
– ఓ నటిగా అన్ని పాత్రలను చేయాలనుకుంటున్నాను. అందుకనే నాకు నచ్చితే హీరోయిన్‌గానే కాదు. విలన్‌ అయినా.. సపోర్టింగ్‌ క్యారెక్టర్‌ అయినా చేయడానికి నేను సిద్ధమే. ‘పందెంకోడి 2’లో పూర్తిస్థాయి నెగటివ్‌ షేడ్‌ ఉండే క్యారెక్టర్‌లో నటించాను.

‘సర్కార్‌’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
-సర్కార్‌లో నా పాత్ర గురించి చెప్పలేను. కానీ పొలిటిషియన్‌ పాత్రలో కనపడతాను. ఓటుకు ఉన్న విలువేంటనేది ‘సర్కార్‌’ చిత్రంలో తెలుస్తుంది. అలా ఓటు గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేశాను. సాధారణంగా మురగదాస్‌గారు స్ట్రాంగ్‌ క్యారెక్టర్స్‌ రాస్తుంటారు. అలాగే సర్కార్‌ కోసం నా పాత్రను చాలా స్ట్రాంగ్‌గా మలిచారు.

తెలుగులో డబ్బింగ్‌ చెప్పడం ఎలా అనిపించింది?
– నాకు తెలుగు బాగానే వస్తుంది. రెండు సినిమాలకీ నేనే డబ్బింగ్‌ చెప్పా. పాత్రధారులే డబ్బింగ్‌ చెప్పడం వల్ల భావోద్వేగాలు బాగా పండుతాయి. అవి ప్రేక్షకులకు ఇంకా బాగా దగ్గరవుతాయి. అదీగాక నేనే డబ్బింగ్‌ చెప్పుకుంటే కాస్త వైవిధ్యం ఉంటుంది కదా. తెలుగులో డబ్బింగ్‌ చెప్పడం ఓ చాలెంజింగ్‌గా అనిపించింది.

శరత్‌కుమార్‌ గారితో సినిమా?
– నాన్నతో ‘పాంబన్‌’ అనే సినిమాలో నటిస్తున్నాను. నటిగా ఆయనతో కలిసి నటిస్తున్న తొలి చిత్రమదే. పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నాను. ఆయన పేరుని ఎక్కడా వాడుకునే ప్రయత్నం చేయలేదు. మొదట్లో శరత్‌కుమార్‌గారి అమ్మాయి అన్నారు. తర్వాత నా పాత్రల ప్రభావంతో నన్నొక ప్రతిభావంతురాలైన నటిగా ప్రేక్షకులు గుర్తించడం మొదలెట్టారు.

‘సర్కార్‌’ వివాదమేంటి?
– ‘సర్కార్‌’ సినిమా కథకు సంబంధించిన వివాదం చూస్తే.. మురగదాస్‌, వరుణ్‌ రాజేంద్రన్‌ రాసిన కథ ఒకేలా ఉన్నాయి. అంతే కానీ.. వరుణ్‌ కథను మురగదాస్‌గారు తీసుకోలేదు. అయితే కథ ఒకేలా ఉండటంతో టైటిల్‌ కార్డ్స్‌లో వరుణ్‌ రాజేంద్రన్‌కు థాంక్స్‌ కార్డ్‌ వేద్దామని మురగదాస్‌గారు నిర్ణయించుకున్నారు.

మీ టూ ఉద్యమం గురించి?
– నాకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ఏడాది క్రితమే చెప్పాను. ఇప్పుడు మీటూ రూపంలో చాలా మంది చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మీటూ ఉద్యమం అవసరమే. ఎందుకంటే పరిశ్రమలో మహిళల్ని వేధిస్తే ఏం జరుగుతుందో అనే తెలియని భయం ఏర్పడింది. దీనిని సరయిన మార్గంలో నడపాలి. ఇలా అన్ని రంగాలకు సంబంధించినవారు ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

ఫ్యూచర్‌ లో డైరెక్షన్‌ చేసే ఆలోచన ఉందా?
-దర్శకత్వం చేయాలని ఉంది. కానీ ఇప్పుడు కాదు. మూడేళ్ల తరవాతే. అమ్మాయిలు ఏదైనా చేయగలరు. ఆ శక్తి సామర్థ్యాలు వాళ్లకున్నాయి.

రాజకీయాలలోకి వచ్చే ఆలోచన ఉందా?
– మరో పదిహేనేళ్ల తర్వాత నేను కచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను. జయలలితగారంటే నాకు ఎంతో ఇష్టం. ఓ మహిళై తనను తాను తక్కువగా చూసుకోకుండా స్వతంత్య్రంగా ఓ రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలించారు. ఆమెను నా ఇన్‌స్పిరేషన్‌గా భావిస్తుంటాను. ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు.

రజనీ, కమల్‌ రాజకీయ రంగ ప్రవేశంపై మీ అభిప్రాయం?
-రజనీకాంత్‌గారు, కమల్‌హాసన్‌గారు ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. చాలా విషయాలు వారు మాట్లాడవచ్చు. అయితే రేపు కార్యాచరణలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రానికి ఎవరు ముఖ్యమనే విషయాన్ని ప్రజలు నిర్ణయిస్తారు.

జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి కదా?
– నిజమే.. జయలలితగారు మరణించిన తర్వాత రాజకీయాల్లో ఓ గ్యాప్‌ ఏర్పడింది. ఆ గ్యాప్‌లో కుదురుకోవడానికి చాలా మంది తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో చిన్న కన్‌ఫ్యూజన్‌ కూడా కనపడుతుంది. ఆ ప్రయత్నాలను నేను తప్పు పట్టను. అయితే మన రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తారనేదే ముఖ్యం. ఆ గ్యాప్‌ను పూర్తి చేసేది ఎవరు అనేది తెలియడానికి వేచి చూడాలి. కాలమే సమాధానం చెబుతుంది. ప్రజలు రేపు ఎన్నికల్లో వారి నిర్ణయాన్ని ఓటింగ్‌ ద్వారా తెలియజేస్తారు.

మీ నెక్స్ట్‌ ప్రాజెక్ట్స్‌?
తెలుగులో చేయడం లేదు కానీ మంచి అవకాశం వస్తే స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేస్తాను. అలాగే తమిళంలో ఈ ఏడాది ఏడు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.

http://industryhit.com/t/2018/10/varalaxmi-sarathkumar-interview-pics/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here